ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడమే ప్రస్తుతం తన లక్ష్యమని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తెలిపింది.
హైదరాబాద్: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడమే ప్రస్తుతం తన లక్ష్యమని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తెలిపింది. అయితే దానికి నిర్ణీత కాలాన్ని గడువుగా పెట్టుకోలేదని, నంబర్‌వన్ ర్యాంక్ చేరుకోవడానికి కష్టపడతానని చెప్పింది. ‘ప్రస్తుతం నాలుగో ర్యాంక్‌కి చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి లక్ష్యం నం.1 ర్యాంకు చేరుకోవడమే. దాని కోసం కష్టపడతాను. చైనా క్రీడాకారిణులతో పోటీ ఉన్నా ప్రయత్నిస్తాను’ అని చెప్పింది.
తను ఎవరి వద్ద కోచింగ్ తీసుకుంటాననే విషయం కంటే, సాధించే పతకాలపై ప్రజలు దృష్టి పెట్టాలని సూచించింది. ‘నా ప్రదర్శన, సాధించిన పతకాలపై ప్రజలు దృష్టి సారించాలి. కోచింగ్ ఎవరి వద్ద తీసుకుంటాననేది నాకు సంబంధించిన విషయం. ప్రపంచ చాంపియన్‌షిప్ ఆడుతున్నప్పుడు నేను కొన్ని విషయాల్లో మెరుగుపడాలని అక్కడే ఉన్న విమల్ సర్ చెప్పారు. చైనా ఓపెన్‌కు ముందు విమల్ సర్ అధ్వర్యంలో నా బలహీనతలను సరిదిద్దుకున్నాను’ అని చెప్పింది.