మనం అందరం కారణజన్ములం. ఏదో ఒక ప్రత్యేకమైన గొప్ప పని చేసేందుకు ఈ భూమిపై జన్మించాం. ఇంత గొప్ప అవకాశం వృథా చేసుకోకండి. ఈ సంవత్సరం ఏదైనా కొత్త, సృజనాత్మకమైన పని మొదలుపెట్టండి. ఏదైనా కొత్త పని చేయకుండా ఏ సంవత్సరమూ గడచిపోకూడదు. మీకు ఏ కలలూ లేకపోతే, వాటిని నిజం చేసుకోలేరు కదా!
ఏ కొత్త ఆవిష్కరణ అయినా ఒక కలతో మొదలవుతుంది. ఉన్నతంగా కలలుగనే, ఆలోచించే స్వేచ్ఛని మీకు మీరు ఇచ్చుకోండి. ఆపై, వాటిని సాధించేందుకు నూరుశాతం ధైర్యంతో, సమర్పణ భావంతో పనిచేయండి.
చాలాసార్లు ఉన్నతమైన కలలు కనేవారిని ఇతరులు అపహాస్యం చేశారు. కానీ వారు వెనక్కు తగ్గకుండా, తమ లక్ష్యాలను సాధించేవరకూ స్థిరంగా నిలబడ్డారు.
మనలో ఉండే ప్రాణశక్తి ప్రవహించేందుకు ఒక దిశను చూపటం అవసరం. దానికి సరైన దిశను చూపకపోతే మీరు గందరగోళంలో చిక్కుకుపోతారు. జీవశక్తి ఒక నిర్దిష్ట దిశలో పయనించేలా చేయాలంటే మనకు నిబద్ధత అవసరం.
ఈ రోజున చాలామంది, తమ జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం, దిశానిర్దేశం లేకపోవడం చేత అయోమయంలో ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ ప్రాణశక్తి తారాస్థాయిలో ఉంటుంది, మరి అంత ఎక్కువగా ఉన్న ఆ ప్రాణశక్తికి, ఎటువెళ్లాలో చెప్పకపోతే, అది అక్కడే చిక్కుకుపోతుంది. ఒకేచోట పేరుకుపోతే ఏమౌతుంది? కుళ్ళిపోయి, పనికి రాకుండా పోతుంది.
ఇక్కడ రహస్యం ఏమిటీ అంటే, మన లక్ష్యం పట్ల నిబద్ధత ఎంత గొప్పగా ఉంటే, దాన్ని సాధించేందుకు అంత గొప్ప శక్తి మనకు లభిస్తుంది. లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే, పనులు అంతా సులభంగా, తేలికగా జరిగిపోతాయి. అదే చిన్న లక్ష్యాలు పెట్టుకున్నారనుకోండి, ఎందుకంటే మీలో సామర్థ్యం కొండంత ఉంది, మీరేమో ఈ చిన్న పనిలో ఇరుక్కుపోయారు అనిపించి మీకే చికాకుగా ఉంటుంది.
మీరు సమాజం బాగు కోసం పనిచేస్తున్నప్పుడు, మీరు పది పనులు చేస్తున్నారనుకుందాం. వాటిలో ఒక పనిలో పొరపాటు జరిగినా, మిగతా తొమ్మిది పనులూ చేస్తూ ఉంటే, ఈ మొదటి పనిలో పొరపాట్లు వాటంతట అనే సర్దుకుంటాయి. సాధారణంగా కృప అనేది ఇలా పనిచేస్తుంది. మొదట అవసరమైన వనరులు సమకూరితే, అప్పుడు పెద్ద లక్ష్యం పెట్టుకుని పని చేద్దామమని మనం సాధారణంగా అనుకుంటాం. కాని, మొదట మీ లక్ష్యం గొప్పగా ఉంటే, వనరులు వాటంతట అనే సమకూరుతాయి.
మనం పెట్టుకున్న లక్ష్యమే మనకు ఆ శక్తిని బహుమతిగా ఇస్తుంది. మీరు మీ కుటుంబ శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకున్నారనుకోండి, ఆ కుటుంబమే మీకు సహాయం చేస్తుంది. మీరు సమాజం మొత్తానికి గొప్ప పనిచేయాలని సంకల్పించుకుంటే సమాజం మొత్తం మీకు సహాయపడటాన్ని మీరే చూస్తారు. మీకు కావలసిన సహాయం మీరు అడక్కముందే వచ్చి చేరుతుంది.
సాధారణంగా మనం మనసులో తపనపడుతూ ఉంటాము, కానీ మన చర్యలు నెమ్మదిగా ఉంటాయి. విజయానికి సోపానం ఏమంటే, మనసులో ఓరిమి, పనిలో ఉత్సాహం. అభిరుచిని, వైరాగ్యాన్ని సరిసమానంగా స్వీకరించండి. మీ లక్ష్య సాధనకై ధైర్యంగా ముందుకు సాగండి, అవసరమైనప్పుడు వదిలేయడం కూడా నేర్చుకోవాలి. అపుడు సహజంగా సమృద్ధి చేకూరుతుంది.
మీరు ధ్యానం చేసినపుడు మీరు సూక్ష్మంగా గమనించగలుగుతారు. మీకు పూర్తిగా విశ్రాంతి లభిస్తుంది, అదే సమయంలో బుద్ధి, వివేచన, సద్యఃస్ఫూర్తి వృద్ధి చెందుతాయి. మీరు ఎఱుకతో ఉండి పనిచేస్తే అది సరైన పని అవుతుంది. చెదిరిపోని దృష్టి, సద్యఃస్ఫూర్తితో పనిచేసే మనసు మీ లక్ష్యాన్ని సాధించేందుకు సహాయ పడతాయి.
ఒత్తిడి లేని, ఉత్సాహభరితమైన జీవితానికి, మీరు అనుకున్న లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో పనిచేసేందుకు సరైన మార్గం ధ్యానం.
నిబద్ధత అనేది దీర్ఘకాలంలో ఎప్పుడూ సుఖాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా జీవించే అద్భుత ప్రదేశంగా మార్చాలని కంకణం కట్టుకోండి. అసాధ్యమైన కల కనండి!
మీ నిబద్ధతకు ఆశించిన ఫలితం రావాలంటే సరైన ఆలోచనలు, సరైన చర్యలు రెండూ అవసరమే. మీరు సాధించాలనుకుంటున్న అన్ని విషయాలతో పెద్ద చిట్టా తయారు చేసుకోకండి. స్థూలంగా పరిశీలించి, నిజంగా అవసరమైన కొన్ని లక్ష్యాలను ఎంచుకోండి. మనకు అత్యంత సంతృప్తిని ఇచ్చే వాటిని, దీర్ఘకాలంలో పదిమంది జీవితాలను తీర్చిదిద్దే వాటిని ఎంచుకుని పని చేసినపుడు, మగిలిన చిన్నాచితక విషయాలు వాటంతట అవే గాడిలో పడతాయి.
మనస్సు పూర్తిగా వర్తమానంలో ఉన్నప్పుడు, మీకు సరైన ఆలోచనలు వస్తాయి. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా, వాటిని సాధించే విధానం కూడా ప్రణాళిక వేసుకోవాలి. మూడేళ్ళ తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక ఇరవై ఏళ్ల తర్వాత? నలభై ఏళ్ళ తర్వాత? ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ విధిని నూరు శాతం నిర్వర్తించండి.
గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
Comments
Please login to add a commentAdd a comment