no cash in banks
-
కరెన్సీకి కటకట..
పెద్ద పండుగ వేళ కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. నగదు కొరతతో సం‘క్రాంతి’ మసకబారుతోంది. గత ఏడాది పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పల్లె పండుగను సందడిగా చేసుకోలేకపోయారు. అంతకుముందు సంవత్సరం కరువు దెబ్బతీసింది. ఈసారైనా ఇంటిల్లిపాది సంతోషంగా పండుగ చేసుకుందామనుకుంటే కరెన్సీ కష్టాలు మళ్లీ వచ్చిపడ్డాయి. సాక్షి, కర్నూలు: నగదు కొరతతో బ్యాంకుల్లో పరిమిత చెల్లింపులే చేస్తున్నారు. ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖాతాల్లో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి. కనీసం రూ.2 వేలు కావాలన్నా 10–15 ఏటీఎం కేంద్రాలకు తిరగాలి. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేక అన్ని వర్గాల ప్రజలు అవస్థ పడుతున్నారు. పల్లెల్లో ఇంకా పండుగ కళ కన్పించడం లేదు. కిరాణ, ఇతర సరుకుల దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఫ్యాన్సీ అమ్మకాలదీ అదే పరిస్థితి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమతో నాలుగు రోజుల పాటు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సందడిగా చేసుకునే పెద్ద పండుగ ఇది. ప్రధానంగా రైతుల పండుగ కావడంతో పల్లెల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇళ్లకు సున్నం పూయించడం, రంగులు వేయించడం, వాహనాలను అలంకరించడం మొదలు.. ఇంటికి వచ్చే బంధువులకు పిండివంటల తయారీ, వస్త్రాల కొనుగోలు, వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి వస్త్రాలు, సంక్రాంతి కానుకలు అందజేయడం వంటివి చేస్తారు. ఇవన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడినవే. సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రూ.300 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా. బ్యాంకుల్లో నో క్యాష్ జిల్లా వ్యాప్తంగా 450కి పైగా ఏటీఎంలు ఉన్నాయి. అధికశాతం ఏటీఎంల్లో ఔట్ ఆఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మిగిలిన వాటిలోనూ తక్కువ మొత్తంలోనే నగదు విత్‌డ్రా అవుతోంది. నగదు కొరతతో ప్రధాన బ్యాంకులు రూ.20,000 నుంచి రూ.30,000లోపు మాత్రమే చెల్లింపులు చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రూ.2 వేల నోట్ల ముద్రణను ఇప్పటికే రిజర్వు బ్యాంకు నిలిపివేయడం, మార్కెట్లోకి వచ్చిన పెద్ద నోట్లు చాలా వరకు కొందరు సంపన్నుల వద్ద ఉండిపోవడం తదితర కారణాలతో ప్రస్తుత కొరత ఏర్పడిందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. కళ తప్పిన రైతు మోము రైతుల ఇంట పండుగ కాంతులు కరువయ్యాయి. జిల్లాలో 40,53,000 మంది జనాభా ఉన్నారు. సుమారు ఏడు లక్షల రైతు కుటుంబాలున్నాయి. సంక్రాంతి వ్యాపారం చాలా వరకు తొలకరి ఫలసాయంపైనే ఆధారపడి ఉంటుంది. మంచి పంట దిగుబడులు వచ్చాయన్న ఆనందాన్ని నగదు కొరత ఆవిరి చేస్తోంది. ఖాతాల్లో డబ్బున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెలవెలబోతున్న పండుగ వ్యాపారం.. జిల్లాలో వాణిజ్య కేంద్రాలైన కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర పట్టణాల్లో ఏటా సంక్రాంతి సీజన్లో జరిగే వ్యాపారంతో పోలిస్తే ఈసారి ఇప్పటి వరకు 25శాతం మేర కూడా జరగలేదు. మోటార్‌బైక్‌ల మేళాల్లోనూ ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని డీలర్లు అంటున్నారు. నగదు కొరతే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇబ్బందులు పడుతున్నాం నగదు కోసం బ్యాంకులకు వెళితే రద్దీ, ఇతర కారణాలతో నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం తలెత్తుతోంది. ఏటీఎం కేంద్రాలకు వెళితే నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తోటలకు ఎరువులు, పురుగు మందు కొనుగోలు చేయాలంటే నగదు కొరత వేధిస్తోంది. – కల్లా ఎల్లారెడ్డి, రైతు, లాలుమానుపల్లె నగదు కొరత నివారించాలి ఏటీఎంలలో నగదు కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. పండుగ వేళ సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. – ఎన్ఎస్ బాబు, యూటీఎఫ్ నాయకులు ఊరు విడిచి వెళ్లాలంటే కష్టం ఏదైనా పనిపై వేరే ఊరు వెళ్లాలంటే నగదు కొరతతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏటీఎంపై నమ్మకంతో విజయవాడకు వెళితే అక్కడ కూడా నగదు కొరత వెంటాడింది. – క్రిష్ణమోహన్, ఏపీ ఎన్జీఓ సం«ఘం నాయకులు -
వేతన యాతన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా ప్రజలంతా ఒకటో తారీఖు కష్టాలు ఎలా ఉంటాయో చవిచూశారు. ఎవరికీ ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. అలాంటి చర్యలు ఎక్కడా మచ్చుకైనా కానరాలేదు. జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు, పింఛను సొమ్ముల కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. నగదు ఉన్న బ్యాంకుల వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరారు. అవసరం మేరకు నగదు నిల్వలు లేకపోవడంతో ఆ మొత్తాలను సర్దుబాటు చేయడానికి బ్యాంకర్లు ఇబ్బంది పడ్డారు. ‘నో క్యాష్’ బోర్డులు పెట్టడంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో ఉదయం వేళ అన్ని ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. 10 గంటల తర్వాత కొన్ని ఏటీఎంలలో నగదు పెట్టినా గంటలోనే అయిపోయింది. ఉద్యోగులు నెలవారీ ఖర్చుల కోసం నగదు తీసుకునేందుకు రావడంతో బ్యాంకులు కిటకిటలాడాయి. తర్వాత డబ్బులు ఉంటాయో లేవో అన్న భయంతో ఉదయం 9 గంటల నుంచే బ్యాంకుల ముందు ఉద్యోగులు బారులు తీరారు. తీరా బ్యాంకు తెరిచిన తరువాత డబ్బులు లేవని చెప్పడంతో నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎస్బీఐతోపాటు కొన్ని బ్యాంకులు నగదు చెల్లింపులు చేయగా, ఆంధ్రాబ్యాంక్ మాత్రం ఈ రోజు నగదు లేదు అంటూ బోర్డులు పెట్టింది. ఆ బ్యాంకులకు అనుసంధానంగా ఉన్న ఏటీఎంలు కూడా పనిచేయని పరిస్థితి కనిపించింది. చాలాచోట్ల రూ.4 వేలకు మించి నగదు ఇవ్వలేదు. ఉద్యోగులకు రూ.10 వేల చొప్పున ఇచ్చే ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా డబ్బులు లేవంటూ బ్యాంకర్లు రూ.4 వేలతో సరిపెట్టారు. నరకం చూసిన పింఛనుదారులు పింఛన్ల కోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు చాలా ఇబ్బందులు పడ్డారు. ‘అధికారులేమో పింఛన్ సొమ్ము బ్యాంకుల్లో వేశామంటారు. బ్యాంకులకు వెళ్తే డబ్బులు లేవని బోర్డు పెట్టారు. కనీసం మా అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో కూడా తెలియదు. పంచాయతీ ఆఫీసులో ఇవ్వాల్సిన పింఛను డబ్బును ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఖాతాల్లో వేస్తే మేం బ్యాంకుల ముందు ఎలా పడిగాపులు పడాలి’ అంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.వెయ్యి, రూ.500 నోట్లు లేకపోవడంతో పింఛను సొమ్ము ఎలా చెల్లించాలో అర్థంకాక బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పలుచోట్ల ఇద్దరికి కలిపి రూ.2 వేల నోటు ఇచ్చి బయట మార్చుకోవాలని చెప్పారు. బ్యాంకులోనే చిల్లర లేకపోతే బయట ఎక్కడ దొరుకుతుందని వృద్ధులు వాపోతున్నారు. బ్యాంకుల వద్ద వృద్ధులు, వికలాంగులకు సాయం చేయడానికి ప్రభుత్వం వైపు నుంచిగాని, బ్యాంకుల నుంచి గాని ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల్లో సొమ్ములు వేసి చేతులు దులుపుకుంది. గతంలో అనారోగ్యం, వృద్ధాప్యంతో బాధపడే పింఛనుదారులకు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకుండాపోయింది. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్ ఎలా తీసుకోగలమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, నల్లజర్ల మండలం అనంతపల్లి ఆంధ్రాబ్యాంక్ వద్ద పడమర చోడవరం గ్రామానికి చెందిన వృద్ధుడు ఓంకారపు నాగేశ్వరరావు క్యూ లైన్ లో కళ్లు తిరిగిపడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలించారు. రేషన్ షాపుల వద్దా ఇదే పరిస్థితి నిత్యావసర సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద కూడా జనం బారులు తీరారు. ఈ పోస్ అనుసంధాన ప్రక్రియ పద్ధతిలో కార్డుదారులకు అరువు ప్రాతిపదికన సరుకులు ఇచ్చారు. ఈ ప్రక్రియలో అనుభవం లేనివారు నానా ఇబ్బందులు పడ్డారు. -
బ్యాంకులలో డబ్బులు అప్పుడే ఖాళీ!
పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటిని మార్చుకోడానికి బ్యాంకులకు వెళ్లినవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రెండో శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించినా, తీరా అక్కడకు వెళ్లేసరికి డబ్బులు అయిపోయాయని మొండిచేతులు చూపిస్తున్నారు. కావాలంటే డబ్బులు మీ ఖాతాలలో డిపాజిట్ చేసుకోవచ్చని, తర్వాత ఏటీఎంలు ఎక్కడైనా పనిచేస్తే, వాటిలో తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెబుతున్నట్లు వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఉషారాణి అనే గృహిణి 'సాక్షి'కి తెలిపారు. తమ వద్ద ఉన్న డబ్బులతో కనీసం పెట్రోలు పోయించుకోవడమో, బస్ పాస్‌లు రెన్యువల్ చేయించుకోవడం లాంటి పనులు అవుతాయని.. అదే బ్యాంకులో డిపాజిట్ చేస్తే చేతిలో డబ్బులు కూడా ఉండవని ఆమె వాపోయారు. అసలే ఏటీఎంలు ఏవీ పనిచేయడం లేదని.. వాటిముందు ఇప్పటికే నో క్యాష్ అని బోర్డులు పెట్టేశారని.. ఇలాంటి పరిస్థితులలో్ తాము బ్యాంకులలో డబ్బు డిపాజిట్ చేసుకుని ప్రయోజనం ఏంటని అడిగారు. అసలు డబ్బు లేకుండా బ్యాంకులు శని, ఆదివారాల్లో తెరిచి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. చాలామంది ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఈ రెండు రోజుల్లో డబ్బు మార్చుకోవచ్చని ఇన్నాళ్లూ ఎలాగోలా ఆఫీసులకు వెళ్లిపోయారు. తీరా చూస్తే.. శనివారం ఉదయం 10.30 గంటల సమయానికే అసలు బ్యాంకులలో డబ్బులు లేవంటున్నారని.. పైగా, ఆ బ్యాంకులో ఖాతా ఉంటే మాత్రమే డబ్బులు ఇస్తాం తప్ప లేకపోతే అసలు రానివ్వడం లేదని మరికొందరు కస్టమర్లు చెబుతున్నారు. ఏ బ్యాంకులోనైనా డబ్బులు మార్చుకోవచ్చని ఒకవైపు ప్రధానమంత్రి ప్రకటిస్తుంటే.. ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అలా లేదని, కేవలం తమ ఖాతాలు ఉన్న బ్యాంకులకు మాత్రమే వెళ్లాలంటున్నారని తెలిపారు.