
పెద్ద పండుగ వేళ కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. నగదు కొరతతో సం‘క్రాంతి’ మసకబారుతోంది. గత ఏడాది పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పల్లె పండుగను సందడిగా చేసుకోలేకపోయారు. అంతకుముందు సంవత్సరం కరువు దెబ్బతీసింది. ఈసారైనా ఇంటిల్లిపాది సంతోషంగా పండుగ చేసుకుందామనుకుంటే కరెన్సీ కష్టాలు మళ్లీ వచ్చిపడ్డాయి.
సాక్షి, కర్నూలు: నగదు కొరతతో బ్యాంకుల్లో పరిమిత చెల్లింపులే చేస్తున్నారు. ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖాతాల్లో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి. కనీసం రూ.2 వేలు కావాలన్నా 10–15 ఏటీఎం కేంద్రాలకు తిరగాలి. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేక అన్ని వర్గాల ప్రజలు అవస్థ పడుతున్నారు. పల్లెల్లో ఇంకా పండుగ కళ కన్పించడం లేదు. కిరాణ, ఇతర సరుకుల దుకాణాలు వెలవెలబోతున్నాయి.
ఫ్యాన్సీ అమ్మకాలదీ అదే పరిస్థితి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమతో నాలుగు రోజుల పాటు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సందడిగా చేసుకునే పెద్ద పండుగ ఇది. ప్రధానంగా రైతుల పండుగ కావడంతో పల్లెల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇళ్లకు సున్నం పూయించడం, రంగులు వేయించడం, వాహనాలను అలంకరించడం మొదలు.. ఇంటికి వచ్చే బంధువులకు పిండివంటల తయారీ, వస్త్రాల కొనుగోలు, వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి వస్త్రాలు, సంక్రాంతి కానుకలు అందజేయడం వంటివి చేస్తారు. ఇవన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడినవే. సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రూ.300 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా.
బ్యాంకుల్లో నో క్యాష్
జిల్లా వ్యాప్తంగా 450కి పైగా ఏటీఎంలు ఉన్నాయి. అధికశాతం ఏటీఎంల్లో ఔట్ ఆఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మిగిలిన వాటిలోనూ తక్కువ మొత్తంలోనే నగదు విత్‌డ్రా అవుతోంది. నగదు కొరతతో ప్రధాన బ్యాంకులు రూ.20,000 నుంచి రూ.30,000లోపు మాత్రమే చెల్లింపులు చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రూ.2 వేల నోట్ల ముద్రణను ఇప్పటికే రిజర్వు బ్యాంకు నిలిపివేయడం, మార్కెట్‌లోకి వచ్చిన పెద్ద నోట్లు చాలా వరకు కొందరు సంపన్నుల వద్ద ఉండిపోవడం తదితర కారణాలతో ప్రస్తుత కొరత ఏర్పడిందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
కళ తప్పిన రైతు మోము
రైతుల ఇంట పండుగ కాంతులు కరువయ్యాయి. జిల్లాలో 40,53,000 మంది జనాభా ఉన్నారు. సుమారు ఏడు లక్షల రైతు కుటుంబాలున్నాయి. సంక్రాంతి వ్యాపారం చాలా వరకు తొలకరి ఫలసాయంపైనే ఆధారపడి ఉంటుంది. మంచి పంట దిగుబడులు వచ్చాయన్న ఆనందాన్ని నగదు కొరత ఆవిరి చేస్తోంది. ఖాతాల్లో డబ్బున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
వెలవెలబోతున్న పండుగ వ్యాపారం.. జిల్లాలో వాణిజ్య కేంద్రాలైన కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర పట్టణాల్లో ఏటా సంక్రాంతి సీజన్‌లో జరిగే వ్యాపారంతో పోలిస్తే ఈసారి ఇప్పటి వరకు 25శాతం మేర కూడా జరగలేదు. మోటార్‌బైక్‌ల మేళాల్లోనూ ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని డీలర్లు అంటున్నారు. నగదు కొరతే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
ఇబ్బందులు పడుతున్నాం
నగదు కోసం బ్యాంకులకు వెళితే రద్దీ, ఇతర కారణాలతో నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం తలెత్తుతోంది. ఏటీఎం కేంద్రాలకు వెళితే నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తోటలకు ఎరువులు, పురుగు మందు కొనుగోలు చేయాలంటే నగదు కొరత వేధిస్తోంది.
– కల్లా ఎల్లారెడ్డి, రైతు, లాలుమానుపల్లె
నగదు కొరత నివారించాలి
ఏటీఎంలలో నగదు కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. పండుగ వేళ సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.
– ఎన్‌ఎస్ బాబు, యూటీఎఫ్ నాయకులు
ఊరు విడిచి వెళ్లాలంటే కష్టం
ఏదైనా పనిపై వేరే ఊరు వెళ్లాలంటే నగదు కొరతతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏటీఎంపై నమ్మకంతో విజయవాడకు వెళితే అక్కడ కూడా నగదు కొరత వెంటాడింది.
– క్రిష్ణమోహన్, ఏపీ ఎన్జీఓ సం«ఘం నాయకులు
Comments
Please login to add a commentAdd a comment