
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి పండగకు నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. సామాన్యుడు, ఉన్నత వర్గం అనే తేడా లేకుండా పైసల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పండగ రోజున జేబులు ఖాళీగా ఉండటంతో ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. డిజిటల్ షాపింగ్ చేద్దామంటే చాలా చోట్ల స్వైపింగ్ మిషన్లు కూడా మొరాయిస్తున్నాయి. నగదు కొరతతో బ్యాంకులు చేతులెత్తేశాయి. అటు జీవీఎంసీ సహా పలు సంస్థలకు సంబంధించిన కొంతమంది కార్మికులకు జీతాలు డ్రా చేసేందుకు బ్యాంకులు రిక్తహస్తాలు చూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని ఏటీఎంలలో రూ.8 కోట్ల నగదుని ఆదివారం రోజున అందుబాటులో ఉంచుతారని ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ జిల్లా స్థాయి అధికారితో నగదు కష్టాలపై సంప్రదింపులు జరిపానన్నారు. ఈ నేపథ్యంలో రూ.8 కోట్లను దాదాపు అని ఏటీఎంలలో సర్దుబాటు చేయనున్నట్టు చెప్పారు.
నగరంలో ఉన్న 45 బ్యాంకులకు సంబంధించి 707 బ్రాంచిలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 1134 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఏటీఎంలో కనీసం 5 లక్షలు నగదు అందుబాటులో ఉంచినా.. సుమారు రూ.57 కోట్లు కావాలి. దీనికి తోడు శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో మరో 3 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. దీంతో అత్యవసర నగదు కోసం ఏటీఎంలను ఆశ్రయించాల్సిందే. కానీ.. ఆదివారం ఉంచనున్న 8 కోట్ల నగదు 10 నిమిషాల్లో ఖాళీ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు నగర వాసులకు నగదు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు.