తగ్గుతున్న చలా’మనీ’
క్రిస్‌మస్, సంక్రాంతి సందర్భంగా జాగ్రత్త పడుతున్న ప్రజలు
తీసుకున్న నగదును దాచుకుంటున్న వైనం
వ్యాపారాలు ప్రారంభం అవుతాయని ఎదురుచూస్తున్న వ్యాపారులు
జంగారెడ్డిగూడెం:
రోజు రోజుకీ మార్కెట్‌లో నగదు చలామణి తగ్గిపోతోంది. ఎవరికి వారు బ్యాంకుల ద్వారా, ఏటీఎంల ద్వారా తీసుకున్న నగదును భద్రపరుచుకోవడంతో మార్కెట్‌లో నగదు చలామణి తగ్గిపోయి, వ్యాపార వాణిజ్య రంగాలు, చిరువ్యాపారులు, చేతివృత్తిదారులు పనులు వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ముందు ముందు ప్రధాన పండుగలు ఉండటమే కారణంగా పలువురు పేర్కొంటున్నారు. నవంబర్ 9 నుంచి రూ. 1000, రూ. 500 నోట్లు రద్దు చేయడంతో ఆ నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలు నగదు కష్టాలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల్లో నగదు లేకపోవడం, అసలు నగదు ఉంటుందో, లేదో తెలియకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబర్ నెలలో క్రిస్‌మస్, జనవరిలో సంక్రాంతి వంటి ప్రధాన పండుగలు ఉండటంతో ముందు ముందు పండుగలకు నగదు కొరత ఏర్పడుతుందని భావించిన ప్రజలు ప్రస్తుతం తీసుకుంటున్న నగదును ఇళ్లల్లోనే భద్రపరుచుకోవడంతో మార్కెట్‌లో చలామణి తగ్గిపోతోంది. ముందు జాగ్రత్త చర్యగా పిల్లలకు దుస్తులు, పిండి వంటలకు, కొత్త అళ్లుళ్లకు దుస్తులు, చీరె, సారె పెట్టుబడులు ఉండటంతో ఆ సమయంలో నగదు లేకపోతే తమ పరిస్థితి ఏమిటనేది ముందుగానే ఆలోచించి ఇళ్లల్లోనే నగదును దాచేస్తున్నారు. ఇంటిల్లపాది దుస్తులు కొనుగోలు చేసుకుని పండుగ చేసుకోవాలంటే పెద్దమొత్తంలోనే నగదు అవసరం అవుతుంది. అంతేగాక క్రిస్‌మస్, సంక్రాంతి పండుగలు ప్రధాన పండుగలు. వీటికి మధ్యలో నూతన సంవత్సర వేడుకలు రావడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రిస్‌మస్ , సంక్రాంతి పండుగలకు పొరుగూళ్లల్లో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులే కాకుండా విదేశాల్లో ఉన్న వారు కూడా స్వదేశాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులు, బంధువులు ఇంటికి రావడంతో ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే సంక్రాంతికి కోడిపందాలు, జూదాలు కూడా పెద్దమొత్తంలో నగదు అవసరం అవుతోంది. దీంతో ఎవరికి వారే జాగ్రత్త పడుతున్నారు. ఇక పేద తరగతి ప్రజలు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ పిల్లలకు కనీసం దుస్తులు అన్నా కొనాలనే తపనతో ఉన్నారు. ప్రస్తుతం తమ నోరు కట్టుకుని పండుగ జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడే నగదు కొరత ఇంత ఉంటే పండుగల సమయానికి నగదు లేకపోతే ఇబ్బందులు తప్పవని ప్రతీ ఒక్కరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాపారులు తమ వ్యాపారాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పెద్దమొత్తాల్లో పెట్టుబడులు పెట్టి దుస్తుల వ్యాపారులు నిల్వ ఉంచారు. క్రిస్‌మస్ దగ్గర పడుతున్నా పూర్తిస్థాయి వ్యాపారాలు ఇంకా అందుకోలేదు. రేపో మాపో వ్యాపారాలు ప్రారంభం అవుతాయని ఎదురుచూస్తున్నారు. క్రిస్‌మస్ అయిన వెంటనే నూతన సంవత్సరం, సంక్రాంతి వస్తుందని ఎంతోకొంత వ్యాపారం జరుగుతుందనే ఆశతో ఉన్నారు. అంతేగాక భారీగా డిస్కౌంట్‌లు, పలు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. దాని వల్లైన తమ వ్యాపారాలు కొంత మేర సాగుతాయని చూస్తున్నారు.