బ్యాంకులలో డబ్బులు అప్పుడే ఖాళీ!
పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటిని మార్చుకోడానికి బ్యాంకులకు వెళ్లినవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రెండో శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించినా, తీరా అక్కడకు వెళ్లేసరికి డబ్బులు అయిపోయాయని మొండిచేతులు చూపిస్తున్నారు. కావాలంటే డబ్బులు మీ ఖాతాలలో డిపాజిట్ చేసుకోవచ్చని, తర్వాత ఏటీఎంలు ఎక్కడైనా పనిచేస్తే, వాటిలో తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెబుతున్నట్లు వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఉషారాణి అనే గృహిణి 'సాక్షి'కి తెలిపారు. తమ వద్ద ఉన్న డబ్బులతో కనీసం పెట్రోలు పోయించుకోవడమో, బస్ పాస్‌లు రెన్యువల్ చేయించుకోవడం లాంటి పనులు అవుతాయని.. అదే బ్యాంకులో డిపాజిట్ చేస్తే చేతిలో డబ్బులు కూడా ఉండవని ఆమె వాపోయారు. అసలే ఏటీఎంలు ఏవీ పనిచేయడం లేదని.. వాటిముందు ఇప్పటికే నో క్యాష్ అని బోర్డులు పెట్టేశారని.. ఇలాంటి పరిస్థితులలో్ తాము బ్యాంకులలో డబ్బు డిపాజిట్ చేసుకుని ప్రయోజనం ఏంటని అడిగారు.
అసలు డబ్బు లేకుండా బ్యాంకులు శని, ఆదివారాల్లో తెరిచి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. చాలామంది ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఈ రెండు రోజుల్లో డబ్బు మార్చుకోవచ్చని ఇన్నాళ్లూ ఎలాగోలా ఆఫీసులకు వెళ్లిపోయారు. తీరా చూస్తే.. శనివారం ఉదయం 10.30 గంటల సమయానికే అసలు బ్యాంకులలో డబ్బులు లేవంటున్నారని.. పైగా, ఆ బ్యాంకులో ఖాతా ఉంటే మాత్రమే డబ్బులు ఇస్తాం తప్ప లేకపోతే అసలు రానివ్వడం లేదని మరికొందరు కస్టమర్లు చెబుతున్నారు. ఏ బ్యాంకులోనైనా డబ్బులు మార్చుకోవచ్చని ఒకవైపు ప్రధానమంత్రి ప్రకటిస్తుంటే.. ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అలా లేదని, కేవలం తమ ఖాతాలు ఉన్న బ్యాంకులకు మాత్రమే వెళ్లాలంటున్నారని తెలిపారు.