No Shave November
-
No Shave November: గడ్డాలు పెంచుతూ ఆకర్షణగా నిలుస్తున్న యువత
సాక్షి, కాజీపేట(వరంగల్): క్రాఫ్‌లో వివిధ రకాల స్టైల్స్.. ఆ మాదిరిగానే గడ్డంలోనూ తమకంటూ ఓ ప్రత్యేకత కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. తమ అందాన్ని గడ్డం రూపంలోనూ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు మక్కువ చూపుతూ ఇదో స్టైల్ అంటూ కొత్త ట్రెండ్‌కు తెరలేపుతోంది. ‘నో షేవ్.. పెంచెయ్ గడ్డం’ అంటూ నగర యువత గడ్డం పెంచడంతో కొత్తదనం చూపుతోంది. అయితే ఏడాదిలో ప్రతి నెలకో ప్రత్యేకత ఉండగా.. కేన్సర్ మహమ్మారిని సమాజం నుంచి పారదోలేందుకు.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు.. పేషెంట్లకు ఆర్థిక చేయూతనందించేందుకు నో షేవ్ నవంబర్ మాసంగా జరుపుకునేందుకు యువత ఉత్సాహం కనబరుస్తోంది. నవంబర్ నో షేవ్ మాసంగా.. గతంలో గడ్డం పెంచుకుంటే ఏంట్రా దేవదాసులా మారావు అనేవారు. కానీ.. ఇప్పుడు గడ్డం పెంచేసుకుందాం బాసూ అంటున్నారు. ప్రస్తుత యువతకు గడ్డం ఓ ట్రెండ్‌లా మారింది. తీరొక్క ఆకృతుల్లో.. ఇష్టమైన విధంగా మలచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నవంబర్ మాసాన్ని నో షేవ్ నవంబర్ పేరిట.. గడ్డంపై కత్తెర పడనివ్వకుండా.. గడ్డానికి వెచ్చించే ఖర్చును మాసం మొత్తంలో పొదుపు చేసి కేన్సర్ పేషెంట్లకు అందజేయడంతోపాటు గడ్డం పెంచడంలో తమ స్టైల్‌ను కనబరుస్తూ.. డబ్బును ఆదా చేసి పేషెంట్లకు అందిస్తూ తమ ఉదారతను చాటుతున్నారు. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు నగర యువకులు. ఇందుకోసం యువతను మరింతగా ప్రోత్సహించేందుకు ఆన్లైన్ నో షేవ్ నవంబర్ పేరిట స్వచ్ఛంద సంస్థ అందుబాటులో ఉండడం విశేషం. కాగా.. యువత ఫ్రెంచ్, అండర్ కట్ బియర్డ్, యాంకర్ బియర్డ్ వంటి వాటితోపాటు తమకు ఇష్టమైన హీరోల గడ్డాలను సరిపోలే విధంగా గడ్డాన్ని తీర్చిదిద్దుకునేందుకు నగరంలో ప్రత్యేకంగా మెన్స్ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి. గడ్డం ప్రవీణ్ అంటారు.. నాకు గడ్డం పెంచడం అంటే చాలా ఇష్టం. నన్ను మా ఆఫీసులో అందరూ గడ్డం ప్రవీణ్ అనే పిలుస్తారు. నవంబర్ మాసంలో గడ్డంపై పెట్టే డబ్బులను కేన్సర్ పేషెంట్లకు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదో మంచి సేవా కార్యక్రమంలా నేను భావిస్తున్నా. – సుందర ప్రవీణ్‌కుమార్, రైల్వే బుకింగ్ క్లర్క్ నా బియర్డ్ నా ఇష్టం నా బియర్డ్ నా ఇష్టం అంటాను నేను. మా ఇంట్లో వారు గడ్డం ఎందుకన్నా నాకు మాత్రం పెంచడం అంటే చాలా ఇష్టం. ప్రతి ఏడాది నవంబర్ మాసంలో నో షేవ్ నవంబర్‌ను పాటించి డబ్బులను ఆదా చేసి కేన్సర్ పేషెంట్లకు అందజేయడం బాధ్యతగా భావిస్తా. – ప్రియాంషు, ఎంటెక్, నిట్ వరంగల్ నో షేవ్ నవంబర్‌ను పాటిస్తాం.. నిట్ వరంగల్ ప్రతి అంశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నిట్‌లో నవంబర్ నెలను నో షేవ్ నవంబర్‌గా పాటిస్తున్నాం. నాతోటి మిత్రులతో కలిసి బియర్డ్ కటింగ్‌కు అయ్యే డబ్బులను కేన్సర్ పేషెంట్ల చికిత్సకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. – విదిష్రామ్, పీహెచ్డీ స్కాలర్, నిట్ -
నో షేవ్ నవంబర్.. ఎలా మొదలైందంటే?
సాక్షి, హైదరాబాద్ : హే డ్యూడ్ ఇది నవంబర్.. నా గడ్డం ఎలా ఉంది..? అంటూ పలువురు విద్యార్థులు, యువత తమ కొత్త గెటప్ లుక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు? అలా ఒకరిని చూసి మరొకరు గడ్డంతో ఉన్న ఫొటోలను మూడు వారాలుగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ డీపీలు, ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్‌లలో ఉంచుతున్నారు. ఇంతకీ నవంబర్ నెలకీ.. గడ్డానికీ ఏం సంబంధం అనుకుంటున్నారా..? అలా మొదలైంది.. 2009లో అమెరికాకు చెందిన ‘మొవంబర్ ఫౌండేషన్’అనే సంస్థ పురుషుల్లో కనిపించే కేన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని చేపట్టింది. అదే ఏడాది షికాగోకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి కేన్సర్‌తో మరణించడంతో చలించిపోయిన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ‘నో షేవ్ నవంబర్’పేరుతో ఫేస్బుక్లో ప్రత్యేక ప్రచార పేజీని ప్రారంభించారు. ఆరంభంలో పశ్చిమదేశాలకే పరిమితమైనా.. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఐదారేళ్లుగా ఈ ఉద్యమానికి ఆదరణ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది యువకులు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పైగా గడ్డం పెంచడం కొన్నేళ్లుగా ఫ్యాషన్‌గా కూడా మారడంతో యువత ఈ ఉద్యమానికి తమ వంతు మద్దతుగా గడ్డం పెంచి అవగాహన కల్పిస్తున్నారు. ‘నో షేవ్ నవంబర్’హ్యాష్‌ట్యాగ్‌కు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. అవగాహన.. విరాళం.. నెల మొత్తం గడ్డం చేసుకోకుండా ఆ డబ్బులను కేన్సర్ పేషెంట్లకు విరాళంగా ఇవ్వడమే ‘నో షేవ్ నవంబర్’ఉద్యమం. సాధారణంగా అక్టోబర్ నెలను మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించే నెలగా నిర్వహిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తారు. అదే విధంగా పురుషుల్లో కనిపించే టెస్టికల్, ప్రొస్టేట్ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నవంబర్ నెల మొత్తం పురుషులంతా ఇలా గడ్డం పెంచాలన్నది ఈ ఉద్యమ ధ్యేయం. కేన్సర్ చికిత్స తీసుకుంటున్న వారు వినియోగించే మందులు చాలా శక్తివంతమైనవి. వాటి వల్ల తలెత్తే దుష్ప్రభావాల కారణంగా కేన్సర్ రోగులకు జుట్టు మొత్తం రాలిపోతుంది. అందుకే కేన్సర్ ట్రీట్మెంట్ రోగుల్లో చాలామంది గుండుతో కనిపించడం చూస్తుంటాం. ఇలాంటి పేషెంట్లకు విగ్గుల కోసం చాలా మంది తమ జుట్టును కూడా ఇస్తుంటారు. ఇలా కేన్సర్ పేషెంట్లు పడే ఇబ్బందులన్నింటిపై అవగాహన కల్పించేందుకు నవంబర్ నెల మొత్తం షేవింగ్ మానేసి మీసాలు, గడ్డాలు పెంచేస్తున్నారు. ఏం చేయాలి? ఈ ఉద్యమంలో రెండు భాగాలున్నాయి. మొదటిది నెల మొత్తం ముఖంపై రేజర్, కత్తెరలు పడకుండా గుబురు గడ్డం, మీసాలు పెంచాలి. షేవింగ్ కోసం మిగిలిన డబ్బును విరాళంగా ఇవ్వాలి. అది ఎంత మొత్తం అన్న విషయంలో ఎలాంటి షరతులు లేవు. నో షేవ్ నవంబర్ షాపింగ్ అని గూగుల్‌లో టైప్ చేయగానే.. పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన నో షేవ్ నవంబర్ లోగోలు ఉన్న ఉంగరాలు, రిస్ట్ బ్యాండ్లు, టీషర్టులు, గాగుల్స్ కనిపిస్తాయి. వీటిని కొంటే అందులో కొంతమొత్తాన్ని కేన్సర్ రోగుల వైద్యానికి, కేన్సర్‌పై ప్రయోగాలు చేసే సంస్థలకు విరాళంగా పంపుతారు. 2013లో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా దాతలు స్పందించి మిలియన్ డాలర్లు సమకూరుస్తున్నారు. -
షేక్ చేస్తున్న 'నో షేవ్ నవంబర్'
గడ్డం.. ఒకప్పుడు ఏ కొంచెం పెరిగినా అది అందానికి అడ్డంగా ఉందని భావించేవారు యువతరం. నున్నగా షేవ్ చేసుకుని కనిపించేవారు. కానీ ఇప్పటి యూత్ అలా కాదు గడ్డం పెంచుకుని నయాలక్స్కు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. వెండితెరపై హీరోలు పెంచుకున్న గడ్డాలకు ప్రేక్షాభిమానుల నుంచి ఎన్ని చప్పట్లు వస్తాయో.. బయట తమకు సైతం అదే రీతిలో కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటూ గడ్డం బాబులు తెగ మురిసిపోతున్నారు. ఈ గడ్డాల గోల ఇప్పుడెందుకనుకుంటున్నారా?. నేటినుంచి నవంబర్ నెల ప్రారంభమవుతోంది. ఈ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలను ‘నో షేవ్’గా పిలుస్తారు. నవంబర్‌లో యువత గడ్డాలను డిఫరెంట్‌గా పెంచుకుంటూ కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ.. ఫాలో అవుతున్నారు. ఈ సందర్భంగా నవంబర్ నో షేవ్పై ప్రత్యేక కథనం. నవంబర్ నెలను కుర్రకారు ‘నో షేవ్’గా అభివర్ణిస్తారు. వాస్తవానికి ఇది అమెరికన్ స్టైల్. అక్కడ ఈ నెల మొత్తం యూత్ గడ్డం గీసుకోరు. ఒక నెలలో గడ్డానికి పెట్టే డబ్బులను నెల పూర్తయ్యాక కేన్సర్ పేషెంట్లకు అందజేస్తారు. తద్వారా వారు ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. స్టైల్‌కి స్టైల్.. హెల్ప్‌కి హెల్ప్ అనే ఫార్ములాకి అక్కడివారి మైంట్ సెట్ కావడం విశేషం. సిటీలో ఇదో వెరైటీ.. అమెరికాలో అలా ఉంటే.. మన సిటీలో మాత్రం డిఫ్రెంట్. 16 ఏళ్లు దాటిన ప్రతి బాయ్‌కి ఈ రోజుల్లో గడ్డం వచ్చేస్తోంది. ఇదే నవంబర్ నెలని వారు స్టైల్‌గా మలుచుకుంటున్నారు. తమకిష్టమైన కట్స్‌ని అక్టోబర్ చివరి వారంలోనే సెట్ చేసుకుంటున్నారు. నవంబర్ 1వ తేదీనే కొత్త తరహా గడ్డంతో దర్శనమిస్తున్నారు. ఇలా నెల మొత్తం నో షేవ్ అంటూ స్టైల్‌ని ప్రెజెంట్ చేయడమే కాకుండా.. వీరు కూడా ఈ గడ్డానికి పెట్టే డబ్బులను ఇక్కడ స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం గమనార్హం. లయన్ ఈజ్ నయా ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జయసింహ గౌడ్. ఉప్పల్‌లోని ‘సిమ్ లయన్ ఫిట్నెస్’ అధినేత. పదేళ్లుగా ప్రతి నవంబర్ నెలలో ఈయన ‘నో షేవ్’ని పాటిస్తున్నారు. డిఫరెంట్ స్టైల్స్‌లో కనిపిస్తారు. ఈ ఏడాది సైతం ఓ కొత్త స్టైల్‌కి శ్రీకారం చుట్టారు. అది ‘లయన్ స్టైల్’. లయన్(సింహం)కి గడ్డం ఎలా ఉంటుందో.. అంతే రీతిలో ఈయన గడ్డాన్ని పెంచుకున్నారు. ఈ నెల మొత్తం గడ్డం గీయకుండా ఈ స్టైల్‌ని మరింత పదును పెట్టేందుకు సిద్దంగా ఉన్నానంటున్నారు జయసింహగౌడ్. బంద్లోజ్ భలే ఈయన సిద్ధార్థ్‌రెడ్డి. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇతనికి గడ్డమంటే మహాపిచ్చి. ప్రతి ఏటా ఓ కొత్త స్టైల్‌తో గడ్డాన్ని పెంచుకుని ఫ్రెండ్స్, కొలీగ్స్‌ని సర్ప్రైజ్ చేస్తారు. ఈ నవంబర్ నెలలో ‘బంద్లోజ్’ స్టైల్‌కి శ్రీకారం చుట్టారు. నెలరోజుల పాటు ఈ గడ్డంలో కనిపించడమే కాదు.. లుక్‌ని కాపాడుకోవడం కూడా సవాల్ అంటున్నారు. స్టైల్‌ని క్యారీ చేయడమే నవంబర్ నో షేవ్ అంటూ మురిసిపోతున్నారీయన. -
గీకకోయి.. గ్రీకువీరుడా!
వన్స్ అపాన్ ఏ టైమ్ గీకితే గ్రీకువీరుడు.. ఇప్పుడు గీకకపోతే క్లీన్ హిట్! హీరోలు.. దర్శకులు.. గడ్డాలు పెంచుతున్నారు. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు.. మన హీరోల పుల్లింగ్ పవర్ అంతా గడ్డంలోనే ఉంది. గడ్డం ఎందుకు పెంచుతున్నారనే చిక్కు ప్రశ్న వీడింది. పెంచితే చాలు.. అందరూ చిక్కుతారట. ఈ గడ్డం బాబుల చిక్కు విప్పుదాం రండి!! ‘మాసిన గడ్డం.. పెరిగిన మీసం.. ఎంత చిరాగ్గా ఉందో ఓసారి అద్దంలో చూసుకోరా!’ - నాన్న క్లాస్ పీకడం కామన్. అమ్మయితే... ‘ఈ అవతారం ఏంట్రా’ అంటుంది. ‘ప్రేమలో ఫెయిలైన పార్వతీశంలా ఎలా ఉన్నావో! ఈ మీసాలు.. గడ్డం.. తీసేయొచ్చుగా’ - గాళ్‌ఫ్రెండ్ కూడా ఆర్డర్ పాస్ చేస్తుంది. ఎవరేమన్నా.. ఏదేమైనా.. యూత్ ఆన్సర్ మాత్రం నో షేవ్. ఎందుకంటే.. అదొక స్టైల్! ఆ స్టైల్‌కి సోషల్ కాజ్ కూడా యాడ్ అయితే.. సూపర్ కదా! ఆ సూపర్ ట్రెండ్‌కి ఈ మంత్ మంచి చాన్స్ గురూ! ‘నో షేవ్ నవంబర్’... ఇప్పుడీ ట్రెండ్... తెలుగులోనూ పాపులర్. మన తెలుగు హీరోలు అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ‘నో షేవ్’తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నారు. గడ్డంలో మనోళ్లు హ్యాండ్సమ్గా కనిపిస్తుంటే.. కుర్రకారు కూడా ఫాలో అయిపోతున్నారు. రీసెంట్గా ‘నో షేవ్’తో నయా లుక్‌లో మన హీరోలు-దర్శకులు అందర్నీ ఆకట్టుకుంటున్నారు!! ఎప్పుడూ సోగ్గాడిలా చక్కగా క్లీన్ షేవ్‌తో కనిపించే మన్మథుడు నాగార్జునను ఈ మధ్య చూశారా? మీసాలు.. గడ్డాలు.. బాగా పెంచేశారు. నాగార్జున మ్యాన్లీ లుక్ మహిళాభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా కోసం గడ్డం పెంచారాయన. గడ్డంతో గ్రీకు వీరుడు భలే ఉన్నాడంటున్నారు. మహిళాభిమానులు ఎక్కువున్న మరో స్టార్ హీరో ‘విక్టరీ’ వెంకటేశ్ సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ గడ్డంతో కనిపించడం తక్కువే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే షేవింగ్‌కి నో చెప్పేస్తారు. ఇప్పుడు సెట్స్‌పై ఉన్న ‘గురు’ సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి వచ్చేశారు. మొన్నీమధ్య విడుదలైన మారుతి సినిమా చూసినోళ్లు వెంకటేశ్ ‘బాబు లుక్ బంగారం’ అన్నారు. సడన్‌గా ‘గురు’ ఫస్ట్‌లుక్ చూసి ‘వావ్.. వాట్ ఏ ఛేంజ్ గురూ’ అంటూ క్లాప్స్ కొట్టారు. ఇక, విలన్‌గా టర్న్ అయిన మరో సీనియర్ హీరో జగపతిబాబు అయితే గడ్డంతో నయా ట్రెండ్ సెట్ చేశారు. హీరోగా ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో.. ఇప్పుడీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కి అంతకు మించి అభిమానులున్నారు. ముఖ్యంగా ఇప్పటి అమ్మాయిల్లో జగపతిబాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఓ కారణం ఈ గడ్డం లుక్కే. యంగ్ హీరోల పద్ధతులూ మారాయ్! పదిహేనేళ్ల కెరీర్లో లుక్ పరంగా చిన్న ఎన్టీఆర్ ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు. ఈ ఏడాది విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ - రెండు సినిమాల్లోనూ రెండు డిఫరెంట్ ‘నో షేవ్’ లుక్స్‌లో కనిపించారాయన. ప్రస్తుతం ఎన్టీఆర్ గడ్డంతోనే ఉన్నారు. బహుశా కొత్త సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టున్నారు. ‘బాహుబలి’ ప్రభాస్ సంగతి ప్రత్యేకించి చెప్పాలా? ఆ మీసకట్టు.. గడ్డం.. రాజసానికి ప్రతీకగా కనిపిస్తున్నారు. ‘బాహుబలి’తో పాటు మధ్యలో విడుదలైన సినిమాలకు, ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న దర్శకుడు తేజ సినిమా కోసం రానా దగ్గుబాటి రఫ్ అండ్ టఫ్ గడ్డం మెయిన్టైన్ చేస్తున్నారు. ఇక, ఎప్పుడూ ప్రయోగాలకు ముందుండే మంచు మనోజ్ రానున్న ‘ఒక్కడు మిగిలాడు’లో చనిపోయిన ఎల్.టి.టి.ఇ. అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ లాంటి గెటప్‌లో గడ్డంతో రఫ్‌గా కనిపించనున్నారు. సెట్స్‌పై ఉన్న ‘గుంటూరోడు’లో గడ్డంతోనే లవ్లీగా కనిపించనున్నారు. ‘హైపర్’ తర్వాత కొత్త సినిమా ఏదీ అంగీకరించని రామ్.. మరికొంతమంది హీరోలు గడ్డంతో దర్శనమిస్తున్నారు. చూడబోతుంటే... ఈ గడ్డం గ్యాంగ్ లిస్ట్‌లో చాలామంది చేరేట్లు ఉన్నారు. - సత్య పులగం ‘గడ్డం గ్యాంగ్’లో వీళ్లు పర్మినెంట్! నయా ట్రెండ్ సెట్ చేయాలనో.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో.. ఆ మ్యాన్లీ లుక్‌లో ఓ కిక్కుందనో.. హీరోలు మీసాలు, గడ్డాలు పెంచుతారు. దర్శకులు కూడా పెంచవలసిన అవసరం ఉందా? లేదు కదూ! కానీ, కొందరు దర్శకులు ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తూ.. గడ్డం గ్యాంగ్‌లో పర్మినెంట్ మెంబర్షిప్ తీసేసుకున్నారు. దర్శకుల గడ్డం గ్యాంగ్‌లో ఎవరెవరున్నా.. పేటెంట్ రైట్స్ మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏదైనా సినిమా మొదలెడితే, అది పూర్తయ్యేంత వరకూ గడ్డం తీయరాయన. ‘బహుశా.. ఈ గడ్డం తీసేస్తే ప్రేక్షకులు నన్ను గుర్తు పట్టరేమో!’ అనేంతలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. ‘సెలూన్‌కి వెళ్లి షేవింగ్ చేయించుకోవడానికి బద్ధకం. నా గడ్డం వెనక కారణం ఇదే’ అని త్రివిక్రమ్ చెప్పినా.. ఆయన్ను చూసి కొంతమంది ఆ స్టైల్ ఫాలో అవుతున్నారంటే అందులో అబద్ధమేమీ లేదు. దర్శక ధీరుడు రాజమౌళికి సెట్స్‌పై ఉన్న సినిమాలోని హీరో లుక్‌ను మెయిన్టైన్ చేయడం అలవాటు. మూడేళ్ల నుంచీ ‘బాహుబలి’ తీస్తున్నారు కదా. ఆ సినిమా హీరో ప్రభాస్, విలన్ రానాలతో పాటు ఆయన కూడా గడ్డం పెంచుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచినవాళ్లకు ప్రత్యేకంగా ఓ ‘కిట్’ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో ఏం ఉంటాయో తెలుసా? గడ్డం, మీసాలు చక్కగా మెయిన్టైన్ చేయడానికి కావల్సిన క్రీములూ, లోషన్లూ. ఆ విషయం పక్కన పెడితే... ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి గడ్డం తీసేస్తారో? ఉంచుతారో చూడాలి. ఆయన వాటం చూస్తుంటే మాత్రం అలాగే కంటిన్యూ అయ్యేట్లే కనిపిస్తున్నారు. ఎక్కడ మొదలైందీ ట్రెండ్! ఆస్ట్రేలియాలో... 1999లో కొంతమంది అడిలైడ్ సిటీ యూత్ రెబెక్కాహిల్, బ్రెట్రింగ్దాల్ ఈ ‘నో షేవ్ నవంబర్’ ట్రెండ్ స్టార్ట్ చేశారు. దీన్నే ‘మువంబర్’ అంటారు. ఈ నెల రోజులూ షేవింగ్ చేయకుండా సేవింగ్ చేసిన డబ్బును క్యాన్సర్‌పై అవగాహన కల్పించిన సంస్థలకు అందిస్తారు. ఈ ఒక్క నెల షేవింగ్ మానేయడం మాత్రమే దీని ఉద్దేశం కాదు. వివిధ రకాల క్యాన్సర్ల కారణంగా మగవారు అనారోగ్యం పాలవుతుంటారు. దీనిపై అవగాహన కల్పించడమే ఈ ‘మువంబర్’ టార్గెట్.