గీకకోయి.. గ్రీకువీరుడా! | No Shave November about telugu film industry | Sakshi
Sakshi News home page

గీకకోయి.. గ్రీకువీరుడా!

Published Mon, Nov 7 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

గీకకోయి.. గ్రీకువీరుడా!

గీకకోయి.. గ్రీకువీరుడా!

వన్స్ అపాన్ ఏ టైమ్
గీకితే గ్రీకువీరుడు..
ఇప్పుడు గీకకపోతే క్లీన్ హిట్!
హీరోలు.. దర్శకులు.. గడ్డాలు పెంచుతున్నారు.
మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు.. మన హీరోల పుల్లింగ్ పవర్ అంతా గడ్డంలోనే ఉంది.
గడ్డం ఎందుకు పెంచుతున్నారనే చిక్కు ప్రశ్న వీడింది.
పెంచితే చాలు.. అందరూ చిక్కుతారట.
ఈ గడ్డం బాబుల చిక్కు విప్పుదాం రండి!!

 
‘మాసిన గడ్డం.. పెరిగిన మీసం.. ఎంత చిరాగ్గా ఉందో ఓసారి అద్దంలో చూసుకోరా!’ - నాన్న క్లాస్ పీకడం కామన్. అమ్మయితే... ‘ఈ అవతారం ఏంట్రా’ అంటుంది. ‘ప్రేమలో ఫెయిలైన పార్వతీశంలా ఎలా ఉన్నావో! ఈ మీసాలు.. గడ్డం.. తీసేయొచ్చుగా’ - గాళ్‌ఫ్రెండ్ కూడా ఆర్డర్ పాస్ చేస్తుంది. ఎవరేమన్నా.. ఏదేమైనా.. యూత్ ఆన్సర్ మాత్రం నో షేవ్. ఎందుకంటే.. అదొక స్టైల్! ఆ స్టైల్‌కి సోషల్ కాజ్ కూడా యాడ్ అయితే.. సూపర్ కదా! ఆ సూపర్ ట్రెండ్‌కి ఈ మంత్ మంచి చాన్స్ గురూ! ‘నో షేవ్ నవంబర్’... ఇప్పుడీ ట్రెండ్... తెలుగులోనూ పాపులర్.

మన తెలుగు హీరోలు అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ‘నో షేవ్’తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నారు. గడ్డంలో మనోళ్లు హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తుంటే.. కుర్రకారు కూడా ఫాలో అయిపోతున్నారు. రీసెంట్‌గా ‘నో షేవ్’తో నయా లుక్‌లో మన హీరోలు-దర్శకులు అందర్నీ ఆకట్టుకుంటున్నారు!!

ఎప్పుడూ సోగ్గాడిలా చక్కగా క్లీన్ షేవ్‌తో కనిపించే మన్మథుడు నాగార్జునను ఈ మధ్య చూశారా? మీసాలు.. గడ్డాలు.. బాగా పెంచేశారు. నాగార్జున మ్యాన్లీ లుక్ మహిళాభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా కోసం గడ్డం పెంచారాయన. గడ్డంతో గ్రీకు వీరుడు భలే ఉన్నాడంటున్నారు. మహిళాభిమానులు ఎక్కువున్న మరో స్టార్ హీరో ‘విక్టరీ’ వెంకటేశ్ సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ గడ్డంతో కనిపించడం తక్కువే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే షేవింగ్‌కి నో చెప్పేస్తారు.

ఇప్పుడు సెట్స్‌పై ఉన్న ‘గురు’ సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి వచ్చేశారు. మొన్నీమధ్య విడుదలైన మారుతి సినిమా చూసినోళ్లు వెంకటేశ్ ‘బాబు లుక్ బంగారం’ అన్నారు. సడన్‌గా ‘గురు’ ఫస్ట్‌లుక్ చూసి ‘వావ్.. వాట్ ఏ ఛేంజ్ గురూ’ అంటూ క్లాప్స్ కొట్టారు. ఇక, విలన్‌గా టర్న్ అయిన మరో సీనియర్ హీరో జగపతిబాబు అయితే గడ్డంతో నయా ట్రెండ్ సెట్ చేశారు. హీరోగా ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో.. ఇప్పుడీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కి అంతకు మించి అభిమానులున్నారు. ముఖ్యంగా ఇప్పటి అమ్మాయిల్లో జగపతిబాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఓ కారణం ఈ గడ్డం లుక్కే.
 
యంగ్ హీరోల పద్ధతులూ మారాయ్!

పదిహేనేళ్ల కెరీర్‌లో లుక్ పరంగా చిన్న ఎన్టీఆర్ ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు. ఈ ఏడాది విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ - రెండు సినిమాల్లోనూ రెండు డిఫరెంట్ ‘నో షేవ్’ లుక్స్‌లో కనిపించారాయన. ప్రస్తుతం ఎన్టీఆర్ గడ్డంతోనే ఉన్నారు. బహుశా కొత్త సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టున్నారు. ‘బాహుబలి’ ప్రభాస్ సంగతి ప్రత్యేకించి చెప్పాలా? ఆ మీసకట్టు.. గడ్డం.. రాజసానికి ప్రతీకగా కనిపిస్తున్నారు.  ‘బాహుబలి’తో పాటు మధ్యలో విడుదలైన సినిమాలకు, ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న దర్శకుడు తేజ సినిమా కోసం రానా దగ్గుబాటి రఫ్ అండ్ టఫ్ గడ్డం మెయిన్‌టైన్ చేస్తున్నారు.

ఇక, ఎప్పుడూ ప్రయోగాలకు ముందుండే మంచు మనోజ్ రానున్న ‘ఒక్కడు మిగిలాడు’లో చనిపోయిన ఎల్.టి.టి.ఇ. అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ లాంటి గెటప్‌లో గడ్డంతో రఫ్‌గా కనిపించనున్నారు. సెట్స్‌పై ఉన్న ‘గుంటూరోడు’లో గడ్డంతోనే లవ్లీగా కనిపించనున్నారు. ‘హైపర్’ తర్వాత కొత్త సినిమా ఏదీ అంగీకరించని రామ్.. మరికొంతమంది హీరోలు గడ్డంతో దర్శనమిస్తున్నారు. చూడబోతుంటే... ఈ గడ్డం గ్యాంగ్ లిస్ట్‌లో చాలామంది చేరేట్లు ఉన్నారు. - సత్య పులగం
 
‘గడ్డం గ్యాంగ్’లో వీళ్లు పర్మినెంట్!
నయా ట్రెండ్ సెట్ చేయాలనో.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో.. ఆ మ్యాన్లీ లుక్‌లో ఓ కిక్కుందనో.. హీరోలు మీసాలు, గడ్డాలు పెంచుతారు. దర్శకులు కూడా పెంచవలసిన అవసరం ఉందా? లేదు కదూ! కానీ, కొందరు దర్శకులు ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తూ.. గడ్డం గ్యాంగ్‌లో పర్మినెంట్ మెంబర్‌షిప్ తీసేసుకున్నారు. దర్శకుల గడ్డం గ్యాంగ్‌లో ఎవరెవరున్నా.. పేటెంట్ రైట్స్ మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏదైనా సినిమా మొదలెడితే, అది పూర్తయ్యేంత వరకూ గడ్డం తీయరాయన.
 

‘బహుశా.. ఈ గడ్డం తీసేస్తే ప్రేక్షకులు నన్ను గుర్తు పట్టరేమో!’ అనేంతలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. ‘సెలూన్‌కి వెళ్లి షేవింగ్ చేయించుకోవడానికి బద్ధకం. నా గడ్డం వెనక కారణం ఇదే’ అని త్రివిక్రమ్ చెప్పినా.. ఆయన్ను చూసి కొంతమంది ఆ స్టైల్ ఫాలో అవుతున్నారంటే అందులో అబద్ధమేమీ లేదు.


దర్శక ధీరుడు రాజమౌళికి సెట్స్‌పై ఉన్న సినిమాలోని హీరో లుక్‌ను మెయిన్‌టైన్ చేయడం అలవాటు. మూడేళ్ల నుంచీ ‘బాహుబలి’ తీస్తున్నారు కదా. ఆ సినిమా హీరో ప్రభాస్, విలన్ రానాలతో పాటు ఆయన కూడా గడ్డం పెంచుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచినవాళ్లకు ప్రత్యేకంగా ఓ ‘కిట్’ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో ఏం ఉంటాయో తెలుసా? గడ్డం, మీసాలు చక్కగా మెయిన్‌టైన్ చేయడానికి కావల్సిన క్రీములూ, లోషన్లూ. ఆ విషయం పక్కన పెడితే... ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి గడ్డం తీసేస్తారో? ఉంచుతారో చూడాలి. ఆయన వాటం చూస్తుంటే మాత్రం అలాగే కంటిన్యూ అయ్యేట్లే కనిపిస్తున్నారు.
 
ఎక్కడ మొదలైందీ ట్రెండ్!
ఆస్ట్రేలియాలో... 1999లో కొంతమంది అడిలైడ్
సిటీ యూత్ రెబెక్కాహిల్, బ్రెట్‌రింగ్‌దాల్ ఈ ‘నో షేవ్ నవంబర్’
ట్రెండ్ స్టార్ట్ చేశారు. దీన్నే ‘మువంబర్’ అంటారు.
ఈ నెల రోజులూ షేవింగ్ చేయకుండా సేవింగ్ చేసిన డబ్బును
క్యాన్సర్‌పై అవగాహన కల్పించిన సంస్థలకు అందిస్తారు.
ఈ ఒక్క నెల షేవింగ్ మానేయడం మాత్రమే దీని ఉద్దేశం కాదు.
వివిధ రకాల క్యాన్సర్‌ల కారణంగా మగవారు
అనారోగ్యం పాలవుతుంటారు.
దీనిపై అవగాహన కల్పించడమే
ఈ ‘మువంబర్’ టార్గెట్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement