సాక్షి, హైదరాబాద్ : హే డ్యూడ్ ఇది నవంబర్.. నా గడ్డం ఎలా ఉంది..? అంటూ పలువురు విద్యార్థులు, యువత తమ కొత్త గెటప్ లుక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు? అలా ఒకరిని చూసి మరొకరు గడ్డంతో ఉన్న ఫొటోలను మూడు వారాలుగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ డీపీలు, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌లలో ఉంచుతున్నారు. ఇంతకీ నవంబర్ నెలకీ.. గడ్డానికీ ఏం సంబంధం అనుకుంటున్నారా..?
అలా మొదలైంది..
2009లో అమెరికాకు చెందిన ‘మొవంబర్ ఫౌండేషన్’అనే సంస్థ పురుషుల్లో కనిపించే కేన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని చేపట్టింది. అదే ఏడాది షికాగోకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి కేన్సర్‌తో మరణించడంతో చలించిపోయిన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ‘నో షేవ్ నవంబర్’పేరుతో ఫేస్‌బుక్‌లో ప్రత్యేక ప్రచార పేజీని ప్రారంభించారు. ఆరంభంలో పశ్చిమదేశాలకే పరిమితమైనా.. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఐదారేళ్లుగా ఈ ఉద్యమానికి ఆదరణ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది యువకులు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పైగా గడ్డం పెంచడం కొన్నేళ్లుగా ఫ్యాషన్‌గా కూడా మారడంతో యువత ఈ ఉద్యమానికి తమ వంతు మద్దతుగా గడ్డం పెంచి అవగాహన కల్పిస్తున్నారు. ‘నో షేవ్ నవంబర్’హ్యాష్‌ట్యాగ్‌కు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.
అవగాహన.. విరాళం..
నెల మొత్తం గడ్డం చేసుకోకుండా ఆ డబ్బులను కేన్సర్ పేషెంట్లకు విరాళంగా ఇవ్వడమే ‘నో షేవ్ నవంబర్’ఉద్యమం. సాధారణంగా అక్టోబర్ నెలను మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించే నెలగా నిర్వహిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తారు. అదే విధంగా పురుషుల్లో కనిపించే టెస్టికల్, ప్రొస్టేట్ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నవంబర్ నెల మొత్తం పురుషులంతా ఇలా గడ్డం పెంచాలన్నది ఈ ఉద్యమ ధ్యేయం. కేన్సర్ చికిత్స తీసుకుంటున్న వారు వినియోగించే మందులు చాలా శక్తివంతమైనవి. వాటి వల్ల తలెత్తే దుష్ప్రభావాల కారణంగా కేన్సర్ రోగులకు జుట్టు మొత్తం రాలిపోతుంది. అందుకే కేన్సర్ ట్రీట్‌మెంట్ రోగుల్లో చాలామంది గుండుతో కనిపించడం చూస్తుంటాం. ఇలాంటి పేషెంట్లకు విగ్గుల కోసం చాలా మంది తమ జుట్టును కూడా ఇస్తుంటారు. ఇలా కేన్సర్ పేషెంట్లు పడే ఇబ్బందులన్నింటిపై అవగాహన కల్పించేందుకు నవంబర్ నెల మొత్తం షేవింగ్ మానేసి మీసాలు, గడ్డాలు పెంచేస్తున్నారు.
ఏం చేయాలి?
ఈ ఉద్యమంలో రెండు భాగాలున్నాయి. మొదటిది నెల మొత్తం ముఖంపై రేజర్, కత్తెరలు పడకుండా గుబురు గడ్డం, మీసాలు పెంచాలి. షేవింగ్ కోసం మిగిలిన డబ్బును విరాళంగా ఇవ్వాలి. అది ఎంత మొత్తం అన్న విషయంలో ఎలాంటి షరతులు లేవు. నో షేవ్ నవంబర్ షాపింగ్ అని గూగుల్‌లో టైప్ చేయగానే.. పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన నో షేవ్ నవంబర్ లోగోలు ఉన్న ఉంగరాలు, రిస్ట్ బ్యాండ్లు, టీషర్టులు, గాగుల్స్ కనిపిస్తాయి. వీటిని కొంటే అందులో కొంతమొత్తాన్ని కేన్సర్ రోగుల వైద్యానికి, కేన్సర్‌పై ప్రయోగాలు చేసే సంస్థలకు విరాళంగా పంపుతారు. 2013లో అమెరికన్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ కూడా తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా దాతలు స్పందించి మిలియన్ డాలర్లు సమకూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment