Cancer Awareness Rally
-
లండన్‌లో సెర్వికల్ కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం!
ఆడవారిలో కేన్సర్ కేసులు సంఖ్య విపరీతం గా పెరుపోతున్న సంగతి తెలిసిందే. అందులోనూ సెర్వికల్ కేన్సర్ మహిళలకు మరింత ప్రాణాంతకంగా మారింది. ఈ నేపథ్యంలో యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ భారత కమ్యూనిటీ(బీబీసీ) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన ఆధ్వరంలో ఆడవారికి వచ్చే కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడవారికి వచ్చే ఈ సెర్వికల్ కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వంహిచారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా మహిళలు పాల్గొని ఈ కేన్సర్ రాకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూలంకషంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే గత నెల మార్చిలో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అప్పుడే ఇలా మహిళ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నట్లు బీబీజీ ఛారిటబుల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా దాదాపు £1,655 పౌండ్లను (సుమారు 1.70 లక్షల రూపాయలు) ఒవేరియన్ కేన్సర్ యాక్షన్ (Ovarian Cancer Action)’ అనే ఛారిటీకి అందజేశామని నిర్వాహకులు తెలిపారు. (చదవండి: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!) -
సర్వైకల్ క్యాన్సర్ అవగాహనలో గిన్నిస్ రికార్డు.. విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా
గుంటూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ పౌండేషన్, విజ్ఞాన్ యూనివర్సిటీ, కలెక్టివ్ పవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూఎస్ఏ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా అతిపెద్ద సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ద్వారానికి సంబంధించింది) కార్యక్రమాన్ని నిర్వహించాయి. తానా ఫౌండేషన్ తరఫున ట్రస్టీ విద్యాధర్ గారపటి ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ఈ అవగాహన కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించడం విశేషం. గతంలో 1919 మందితో సర్వైకల్ అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఇప్పుడు 4000 మంది పాల్గొనడంతో పాత గిన్నిస్ రికార్డు చెరిగిపోయింది. మార్చి 18న నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ వేదిక కావడం తెలుగువారికి గర్వకారణమని యాజమాన్యం పేర్కొంది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోతోంది. 2030 నాటికి మరణాల సంఖ్య 50 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ కారణంగా మరణించేవారిలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారే ఉండటం ఆందోళనకర విషయం. చదవండి: అకాల వర్షాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు -
AP: క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు
సాక్షి, అమరావతి: ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ‘ప్రాజెక్ట్ టీల్’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర వైద్య శాఖ ప్రవేశపెట్టిందన్నారు. డీఎంహెచ్వోలు, డీసీహెచ్ఎస్, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్ట్ టీల్లో భాగంగా పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రి వరకూ అన్ని ఆస్పత్రుల్లోని ప్రముఖ ప్రదేశంలో ముదురు నీలం–ఆకు పచ్చ లైటింగ్‌ను ప్రదర్శించాలన్నారు. -
విజయవాడలో 5k రన్
-
నో షేవ్ నవంబర్.. ఎలా మొదలైందంటే?
సాక్షి, హైదరాబాద్ : హే డ్యూడ్ ఇది నవంబర్.. నా గడ్డం ఎలా ఉంది..? అంటూ పలువురు విద్యార్థులు, యువత తమ కొత్త గెటప్ లుక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు? అలా ఒకరిని చూసి మరొకరు గడ్డంతో ఉన్న ఫొటోలను మూడు వారాలుగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ డీపీలు, ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్‌లలో ఉంచుతున్నారు. ఇంతకీ నవంబర్ నెలకీ.. గడ్డానికీ ఏం సంబంధం అనుకుంటున్నారా..? అలా మొదలైంది.. 2009లో అమెరికాకు చెందిన ‘మొవంబర్ ఫౌండేషన్’అనే సంస్థ పురుషుల్లో కనిపించే కేన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని చేపట్టింది. అదే ఏడాది షికాగోకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి కేన్సర్‌తో మరణించడంతో చలించిపోయిన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ‘నో షేవ్ నవంబర్’పేరుతో ఫేస్బుక్లో ప్రత్యేక ప్రచార పేజీని ప్రారంభించారు. ఆరంభంలో పశ్చిమదేశాలకే పరిమితమైనా.. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఐదారేళ్లుగా ఈ ఉద్యమానికి ఆదరణ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది యువకులు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పైగా గడ్డం పెంచడం కొన్నేళ్లుగా ఫ్యాషన్‌గా కూడా మారడంతో యువత ఈ ఉద్యమానికి తమ వంతు మద్దతుగా గడ్డం పెంచి అవగాహన కల్పిస్తున్నారు. ‘నో షేవ్ నవంబర్’హ్యాష్‌ట్యాగ్‌కు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. అవగాహన.. విరాళం.. నెల మొత్తం గడ్డం చేసుకోకుండా ఆ డబ్బులను కేన్సర్ పేషెంట్లకు విరాళంగా ఇవ్వడమే ‘నో షేవ్ నవంబర్’ఉద్యమం. సాధారణంగా అక్టోబర్ నెలను మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించే నెలగా నిర్వహిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తారు. అదే విధంగా పురుషుల్లో కనిపించే టెస్టికల్, ప్రొస్టేట్ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నవంబర్ నెల మొత్తం పురుషులంతా ఇలా గడ్డం పెంచాలన్నది ఈ ఉద్యమ ధ్యేయం. కేన్సర్ చికిత్స తీసుకుంటున్న వారు వినియోగించే మందులు చాలా శక్తివంతమైనవి. వాటి వల్ల తలెత్తే దుష్ప్రభావాల కారణంగా కేన్సర్ రోగులకు జుట్టు మొత్తం రాలిపోతుంది. అందుకే కేన్సర్ ట్రీట్మెంట్ రోగుల్లో చాలామంది గుండుతో కనిపించడం చూస్తుంటాం. ఇలాంటి పేషెంట్లకు విగ్గుల కోసం చాలా మంది తమ జుట్టును కూడా ఇస్తుంటారు. ఇలా కేన్సర్ పేషెంట్లు పడే ఇబ్బందులన్నింటిపై అవగాహన కల్పించేందుకు నవంబర్ నెల మొత్తం షేవింగ్ మానేసి మీసాలు, గడ్డాలు పెంచేస్తున్నారు. ఏం చేయాలి? ఈ ఉద్యమంలో రెండు భాగాలున్నాయి. మొదటిది నెల మొత్తం ముఖంపై రేజర్, కత్తెరలు పడకుండా గుబురు గడ్డం, మీసాలు పెంచాలి. షేవింగ్ కోసం మిగిలిన డబ్బును విరాళంగా ఇవ్వాలి. అది ఎంత మొత్తం అన్న విషయంలో ఎలాంటి షరతులు లేవు. నో షేవ్ నవంబర్ షాపింగ్ అని గూగుల్‌లో టైప్ చేయగానే.. పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన నో షేవ్ నవంబర్ లోగోలు ఉన్న ఉంగరాలు, రిస్ట్ బ్యాండ్లు, టీషర్టులు, గాగుల్స్ కనిపిస్తాయి. వీటిని కొంటే అందులో కొంతమొత్తాన్ని కేన్సర్ రోగుల వైద్యానికి, కేన్సర్‌పై ప్రయోగాలు చేసే సంస్థలకు విరాళంగా పంపుతారు. 2013లో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా దాతలు స్పందించి మిలియన్ డాలర్లు సమకూరుస్తున్నారు. -
క్యాన్సర్‌పై క్విస్ విద్యార్థుల అవగాహన
ఒంగోలు : క్విస్ ఫార్మసీ విద్యార్థులు నగరంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్‌పై ఆదివారం అవగాహన కల్పించారు. బ్లడ్, బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ లక్షణాలపై ప్రజలను చైతన్యపరిచారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుందని, క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలో వివరిస్తూ లక్షణాలను తెలియజేశారు. కార్యక్రమాన్ని క్విస్ ఫార్మశీ కాలేజీ ప్రధానాచార్యులు డాక్టర్ డి.దక్షిణామూర్తి, ఫార్మశీ ప్రాక్టీసు విభాగం అధికారి డాక్టర్ జి.పిచ్చయ్య పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ద్యార్థులను క్విస్ విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నిడమానూరి సూర్య కళ్యాణ చక్రవర్తి, క్విస్ విద్యాసంస్థల అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావులు అభినందించారు. -
పొగాకుతో కేన్సర్ ముప్పు
నెల్లూరు(అర్బన్): పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా నోటి, గొంతు, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, తదితర రకాల కేన్సర్లు సోకుతాయని వైద్యశాఖ శిక్షణా మండలి అధికారి పెద్దిశెట్టి రమాదేవి తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గాంధీ నగర్ మహిళా ప్రాంగణం నుంచి వేదాయపాళెం సెంటర్ వరకు ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బందితో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేదాయపాళెం సెంటర్లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఊబకాయం, గుండె, ఊపిరితిత్తుల జబ్బులు, పక్షవాతం, తదితర సమస్యలు వస్తాయన్నారు. పొగాకు తీసుకోవడం ద్వారా ప్రతి సెకనుకు ఇద్దరు చొప్పున, ఏటా 10లక్షల మందికిపైగా మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ లక్ష్మీనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్, డీసీఎం సునీత, సిబ్బంది శ్రీనివాసులు, జ్యోతి, ఉష, శిరీష, సక్కుబాయి, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్‌ను నియంత్రిద్దాం
సాక్షి, చెన్నై:క్యాన్సర్ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు వేగవంతం చేద్దామని నటుడు సూర్య పిలుపునిచ్చారు. చెన్నైలో ఆదివారం నిర్వహించిన క్యాన్సర్ అవగాహన మారథాన్ విజయవంతం అయింది. క్యాన్సర్ నివారణే లక్ష్యంగా నగరంలోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీవ్రంగా శ్రమిస్తోంది. పేద రోగులకు వరంగా, అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్ ఆదివారం 60వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగర ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించే విధంగా భారీ మారథాన్‌కు ఆ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ శాంత ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే ఐలాండ్ గ్రౌండ్ వద్దకు పెద్ద ఎత్తున యువతీ యువకులు, క్రీడాకారులు, క్యాన్సర్ నుంచి బయట పడిన చిన్నారులు మొత్తం మూడు వేల మందికి పైగా జనం చేరుకున్నారు. మారథాన్: క్యాన్సర్‌ను నియంత్రిద్దాం... అనే నినాదంతో కూడిన టీ షర్టుల్ని అందరూ ధరించి, ఫ్లకార్డుల్ని చేత బట్టి మారథాన్‌కు తరలి వచ్చారు. నటుడు సూర్య ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మారథాన్‌ను డాక్టర్ శాంతతో కలసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్‌ను నియంత్రిద్దాం అనే నినాదాన్ని హోరెత్తిస్తూ ఐలాండ్ గ్రౌండ్ నుంచి పెరియార్ తిడల్ వరకు ఈ మారథాన్ సాగింది. ఉత్సాహంగా యువతీ, యువకులు పరుగులు తీస్తూ, నగరవాసులకు అవగాహన కల్పించారు. పొగ తాగొద్దని సూచిస్తూ, ప్రాథమిక దశలో వైద్య సేవలు తీసుకోవాలని సూచనలిచ్చారు. అడయార్ సేవలు : క్యాన్సర్ రోగులకు వరంగా ఉన్న అడయార్ ఇన్స్టిట్యూట్ సేవలను గుర్తు చేస్తూ నటుడు సూర్య ప్రసంగించారు. డాక్టర్ ముత్తు లక్ష్మి, డాక్టర్ శాంత కనీసం జీతాలు కూడా తీసుకోకుండా పేద రోగుల కోసం సేవలు అందిస్తున్నారంటూ వారిని అభినందించారు. రోగులకు 60 శాతం మేరకు సేవలను ఉచితంగా అందించడం అన్నది ఎంతో సాహసంతో కూడుకున్నదన్నారు. ఇక్కడికి వచ్చే రోగుల కోసం డోనర్లు, స్పాన్సర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృత పరిచే విధంగా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నియంత్రణకు భాగస్వాములు కావాలని కోరారు. డాక్టర్ శాంత మాట్లాడుతూ, క్యాన్సర్ ముదిరిన తర్వాత అనేక మంది ఆస్పత్రులకు వస్తున్నారని వివరించారు. ప్రాథమిక దశలోనే తమను సంప్రదిస్తే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వంద శాతం నయం చేయగలుగుతామన్నారు. తమ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న అవకాశాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని క్యాన్సర్‌ను నియంత్రిద్దామని పిలుపు నిచ్చారు.