క్యాన్సర్‌ను నియంత్రిద్దాం
సాక్షి, చెన్నై:క్యాన్సర్ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు వేగవంతం చేద్దామని నటుడు సూర్య పిలుపునిచ్చారు. చెన్నైలో ఆదివారం నిర్వహించిన క్యాన్సర్ అవగాహన మారథాన్ విజయవంతం అయింది. క్యాన్సర్ నివారణే లక్ష్యంగా నగరంలోని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ తీవ్రంగా శ్రమిస్తోంది. పేద రోగులకు వరంగా, అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందిస్తున్న ఈ ఇన్‌స్టిట్యూట్ ఆదివారం 60వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగర ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించే విధంగా భారీ మారథాన్‌కు ఆ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ శాంత ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే ఐలాండ్ గ్రౌండ్ వద్దకు పెద్ద ఎత్తున యువతీ యువకులు, క్రీడాకారులు, క్యాన్సర్ నుంచి బయట పడిన చిన్నారులు మొత్తం మూడు వేల మందికి పైగా జనం చేరుకున్నారు.
మారథాన్: క్యాన్సర్‌ను నియంత్రిద్దాం... అనే నినాదంతో కూడిన టీ షర్టుల్ని అందరూ ధరించి, ఫ్లకార్డుల్ని చేత బట్టి మారథాన్‌కు తరలి వచ్చారు. నటుడు సూర్య ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మారథాన్‌ను డాక్టర్ శాంతతో కలసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్‌ను నియంత్రిద్దాం అనే నినాదాన్ని హోరెత్తిస్తూ ఐలాండ్ గ్రౌండ్ నుంచి పెరియార్ తిడల్ వరకు ఈ మారథాన్ సాగింది. ఉత్సాహంగా యువతీ, యువకులు పరుగులు తీస్తూ, నగరవాసులకు అవగాహన కల్పించారు. పొగ తాగొద్దని సూచిస్తూ, ప్రాథమిక దశలో వైద్య సేవలు తీసుకోవాలని సూచనలిచ్చారు. అడయార్ సేవలు : క్యాన్సర్ రోగులకు వరంగా ఉన్న అడయార్ ఇన్‌స్టిట్యూట్ సేవలను గుర్తు చేస్తూ నటుడు సూర్య ప్రసంగించారు. డాక్టర్ ముత్తు లక్ష్మి, డాక్టర్ శాంత కనీసం జీతాలు కూడా తీసుకోకుండా పేద రోగుల కోసం సేవలు అందిస్తున్నారంటూ వారిని అభినందించారు.
రోగులకు 60 శాతం మేరకు సేవలను ఉచితంగా అందించడం అన్నది ఎంతో సాహసంతో కూడుకున్నదన్నారు. ఇక్కడికి వచ్చే రోగుల కోసం డోనర్లు, స్పాన్సర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృత పరిచే విధంగా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నియంత్రణకు భాగస్వాములు కావాలని కోరారు. డాక్టర్ శాంత మాట్లాడుతూ, క్యాన్సర్ ముదిరిన తర్వాత అనేక మంది ఆస్పత్రులకు వస్తున్నారని వివరించారు. ప్రాథమిక దశలోనే తమను సంప్రదిస్తే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వంద శాతం నయం చేయగలుగుతామన్నారు. తమ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న అవకాశాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని క్యాన్సర్‌ను నియంత్రిద్దామని పిలుపు నిచ్చారు.