No visa issue
-
వీసా లేకున్నా ఇరాన్ వెళ్లొచ్చు
టెహ్రాన్: ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇరాన్‌కు వెళ్లేందుకు ఇక వీసా అవసరమే లేదు. విదేశీ పర్యాటకులు, సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులివ్వనున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇరాన్ వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్‌తోపాటు రష్యా, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ, ఖతార్, కువాయిట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ తదితరాలున్నాయి. మార్చి 21తో ప్రారంభమైన ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే ఇరాన్‌ను సందర్శించిన విదేశీయుల సంఖ్య 44 లక్షలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 48.5% ఎక్కువ. భారతీయులు ఇకపై తమ దేశానికి వీసాతో పనిలేకుండా రావొచ్చంటూ ఇటీవలే మలేసియా, శ్రీలంక, వియత్నాం దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
జపాన్ పాస్‌పోర్ట్.. మోస్ట్ పవర్ఫుల్
పాస్‌పోర్ట్‌కు పవర్ ఏంటి అనుకుంటున్నారా? పాస్‌పోర్ట్‌లకు కూడా పవర్ ఉంటుంది. అంటే.. పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా అవసరం లేని ప్రయాణాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ దేశానికైతే అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదో ఆ దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. ఆ ప్రాతిపదికన ప్రస్తుతం జపాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. జపాన్ పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 190 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు. జపాన్ దేశస్తులు వీసా అవసరం లేకుండా వెళ్లే 190వ దేశంగా మయన్మార్‌కు ఇటీవలే గుర్తింపు లభించింది. అంటే, జపాన్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 190 దేశాలకు వీసా లేకుండా కానీ, ఆ దేశంలో దిగగానే విమానాశ్రయంలోనే వీసా పొందే అవకాశంతో కానీ ప్రయాణం చేయొచ్చు. ఈ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ దేశాల జాబితాలో రెండో స్థానంలో 189 దేశాలతో సింగపూర్, మూడో స్థానంలో 188 దేశాలతో ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికాలు నిలిచాయి. మన భారత్ స్థానం ఏంటని ఆలోచిస్తున్నారా? మన పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా కానీ, వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా కానీ 59 దేశాలకు వెళ్లొచ్చు. అంటే పవర్ఫుల్ పాస్ పోర్ట్ ఉన్న దేశాల జాబితాలో మన స్థానం 76. ఈ మధ్యే 78 నుంచి 76వ స్థానానికి ఎదిగాం. అగ్రదేశాలైన అమెరికా లేదా బ్రిటన్ల పాస్‌పోర్ట్‌తో 186 దేశాలను వీసా లేకుండా చుట్టేయొచ్చు. ప్రస్తుతం ఈ దేశాల స్థానం ఐదు కాగా, 2015లో ఈ రెండే అగ్రస్థానంలో ఉన్నాయట. విశేషమేంటంటే.. ఈ రేసులో ముందంజలో ఉంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశం 2006లో ఉన్న 62వ స్థానం నుంచి వేగంగా ముందంజ వేసి ఇప్పుడు 21వ స్థానానికి చేరింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ ర్యాంకింగ్‌లు రూపొందించింది. లాభాలేంటి? సాధారణంగా వీసా లేనిదే విదేశీ పర్యటనలు సాధ్యం కాదు. దాని కోసం డబ్బు కట్టి దరఖాస్తు చేసుకుని అవసరమైతే ఇంటర్వ్యూ, ఆపై ప్రాసెసింగ్ పూర్తయితే వీసా వస్తుంది. అలాంటి వీసా అవసరమే లేకుండా పాస్‌పోర్ట్‌తోనే విదేశీ పర్యటనలకు వెళ్లడం ఈజీ కదా. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య ఈ సదుపాయం ఏర్పడుతుంది. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో వీసా ఫ్రీ పర్యటనకు అవకాశం లభిస్తుంది. -
ప్చ్.. వీసా..రీ
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయ హోదా పొందినా విశాఖలో వీసా పొందే యత్నాలు ఇంకా ఫలించలేదు. గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఇప్పుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన వారే కావడంతో కేంద్రం ఏ మేరకు దృష్టి సారిస్తుందోనని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా విదేశీ ప్రయాణం సాగించడానికి వీసా పొందాలంటే పదిహేను రోజుల నుంచి 45 రోజులు పడుతుంది. చెన్నైలోనో, ముంబయి, హైదరాబాదు, ఢిల్లీ పట్టణాలకెళ్లి ఇండియన్ ఎంబసీల ద్వారా వీటిని పొందాలి. శరవేగంగా అభివృద్ధి చెంది అంత ర్జాతీయ విమానాశ్రయ హోదా సాధించినా విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా వీసా పొందే అవకాశం మాత్రం లేకపోతోంది. లక్షల ప్రయాణికులున్నా: విశాఖ విమానాశ్రయం నుంచి దేశ, విదేశీ ప్రయాణికులు, పర్యాటకులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. అందులోనూ విశాఖ నుంచి దుబాయ్, సింగపూర్ విమానాలు వచ్చినప్పటి నుంచి విదేశీ పర్యాటకుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఏటా దాదాపు పన్నెండు లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖకు 200 కిలోమీటర్ల పరిధిలో 33 బౌద్ధ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. కేవలం శ్రీలంక , గయా, సారనాథ్ , సాంచిల నుంచి 20 వేలమంది పర్యాటకులు ఏటా వస్తుంటారు. వీరు వీసా పొందడానికి ఆర్థిక వ్యయంతో నెలలు, ఆరునెలలూ పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇమిగ్రేషన్ ఉన్నా వెనకబాటేనా: దేశంలో పేరొందిన విమానాశ్రయాలుగా ఉన్న ఢిల్లీ, ముంబయి, హైదరాబాదు, చెన్నై, తిరువానంతపురం విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే పర్యాటకులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, విమానయానశాఖ అద్భుత అవకాశాన్నిచ్చాయి. ఆయా విమానాశ్రయాల నుంచి ప్రయాణించే పర్యాటకులు వీసా కోసం ఎక్కడెక్కడికో తిరగకుండా ఆయా విమానాశ్రయాల్లోనే వెంటనే వీసా పొందే అవకాశం ఇచ్చాయి. ఈ రకంగా ఇమిగ్రేషన్ సదుపాయం ఉన్న విశాఖ విమానాశ్రయానికీ అనుమతి ఇవ్వాలని లోగడ కేంద్రహోంమంత్రిత్వశాఖ, పౌరవిమానయాన శాఖ మంత్రిత్వశాఖల వద్ద ప్రస్తావన నడిచింది. తర్వాత హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రాక ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. పెరుగుతున్న దళారులు: విశాఖలో వీసా సదుపాయం లేక ఏజెంట్లు, దళారులను జనం ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా గుర్తింపు ఉన్న ఏజెంట్లు పదుల సంఖ్యలో ఉంటే దళారులు వందల సంఖ్యలో ఉన్నారు. అవగాహన ఉన్న వారు వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్, ముంబయి, చెన్నైకో దరఖాస్తు చేసుకోడానికి తిరుగుతుంటే...అవగాహన లేనివారు దళారులను ఆశ్రయిస్తున్నారు.