ప్చ్.. వీసా..రీ
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయ హోదా పొందినా విశాఖలో వీసా పొందే యత్నాలు ఇంకా ఫలించలేదు. గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఇప్పుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన వారే కావడంతో కేంద్రం ఏ మేరకు దృష్టి సారిస్తుందోనని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా విదేశీ ప్రయాణం సాగించడానికి వీసా పొందాలంటే పదిహేను రోజుల నుంచి 45 రోజులు పడుతుంది. చెన్నైలోనో, ముంబయి, హైదరాబాదు, ఢిల్లీ పట్టణాలకెళ్లి ఇండియన్ ఎంబసీల ద్వారా వీటిని పొందాలి. శరవేగంగా అభివృద్ధి చెంది అంత ర్జాతీయ విమానాశ్రయ హోదా సాధించినా విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా వీసా పొందే అవకాశం మాత్రం లేకపోతోంది.
లక్షల ప్రయాణికులున్నా: విశాఖ విమానాశ్రయం నుంచి దేశ, విదేశీ ప్రయాణికులు, పర్యాటకులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. అందులోనూ విశాఖ నుంచి దుబాయ్, సింగపూర్ విమానాలు వచ్చినప్పటి నుంచి విదేశీ పర్యాటకుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఏటా దాదాపు పన్నెండు లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖకు 200 కిలోమీటర్ల పరిధిలో 33 బౌద్ధ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. కేవలం శ్రీలంక , గయా, సారనాథ్ , సాంచిల నుంచి 20 వేలమంది పర్యాటకులు ఏటా వస్తుంటారు. వీరు వీసా పొందడానికి ఆర్థిక వ్యయంతో నెలలు, ఆరునెలలూ పడుతున్న సందర్భాలు ఉన్నాయి.
ఇమిగ్రేషన్ ఉన్నా వెనకబాటేనా: దేశంలో పేరొందిన విమానాశ్రయాలుగా ఉన్న ఢిల్లీ, ముంబయి, హైదరాబాదు, చెన్నై, తిరువానంతపురం విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే పర్యాటకులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, విమానయానశాఖ అద్భుత అవకాశాన్నిచ్చాయి. ఆయా విమానాశ్రయాల నుంచి ప్రయాణించే పర్యాటకులు వీసా కోసం ఎక్కడెక్కడికో తిరగకుండా ఆయా విమానాశ్రయాల్లోనే వెంటనే వీసా పొందే అవకాశం ఇచ్చాయి. ఈ రకంగా ఇమిగ్రేషన్ సదుపాయం ఉన్న విశాఖ విమానాశ్రయానికీ అనుమతి ఇవ్వాలని లోగడ కేంద్రహోంమంత్రిత్వశాఖ, పౌరవిమానయాన శాఖ మంత్రిత్వశాఖల వద్ద ప్రస్తావన నడిచింది. తర్వాత హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రాక ప్రతిపాదన అలాగే ఉండిపోయింది.
పెరుగుతున్న దళారులు: విశాఖలో వీసా సదుపాయం లేక ఏజెంట్లు, దళారులను జనం ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా గుర్తింపు ఉన్న ఏజెంట్లు పదుల సంఖ్యలో ఉంటే దళారులు వందల సంఖ్యలో ఉన్నారు. అవగాహన ఉన్న వారు వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్, ముంబయి, చెన్నైకో దరఖాస్తు చేసుకోడానికి తిరుగుతుంటే...అవగాహన లేనివారు దళారులను ఆశ్రయిస్తున్నారు.