విదేశీ పర్యటనలో బీమా ధీమా..!
రాము చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రితో కలిసి స్విట్జర్లాండ్‌కి వెళ్తుండడమే కారణం. తల్లి బట్టలు సర్దే పనిలో బిజీగా ఉంది. ప్రత్యేకించి స్విట్జర్లాండ్ చలి వాతావరణాన్ని తట్టుకుని ఉండడానికి కావాల్సిన మందపాటి ఉన్ని స్వెటర్ల ప్యాకింగ్‌పై ఆమె నిమగ్నమైంది. తండ్రి ఇప్పటికే టిక్కెట్లు సైతం బుక్‌చేసి, వీసాకోసం దరఖాస్తు పెట్టుకున్నారు. రేపోమాపో వీసా కూడా వచ్చే తరుణమది. అయితే అప్పుడే రాము తండ్రికి కలవరపెట్టే విషయమొకటి తెలిసింది. స్విట్జర్లాండ్‌సహా, షెంజన్ ఒప్పందం కింద సంతకాలు చేసిన 26 దేశాల యూరోపియన్ గ్రూప్‌లో ఏ ఒక్కదేశంలో పర్యటించాలన్నా... పర్యాటక బీమా తప్పదన్నదే దీని సారాంశం.
ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు సమర్పించనిదే.. వీసా ఆమోద ప్రక్రియ ముందుకు జరగదని తెలుసుకున్న రాము తండ్రి ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. ఇందుకు కావాల్సిన పర్యాటక బీమా వివరాలను తెలుసుకోడానికి హుటాహుటిన తాను వీసా దరఖాస్తు చేసిన కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లాడు. స్విట్జర్లాండ్ అధికారులు నిర్దేశిస్తున్న పర్యటన బీమా అవసరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా లభ్యమవుతున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయడానికి వెంటనే నెట్ సర్ఫింగ్ ప్రారంభించాడు. షెంజెన్ దేశాల్లో పర్యటనకు వీసా దరఖాస్తుకు ముందస్తుగానే పర్యటన బీమా తప్పనిసరన్న అంశం... మొత్తంగా రాము కుటుంబం విదేశీ పర్యటన షెడ్యూల్‌ను గందరగోళంలో, అనిశ్చితిలో పడేసింది.
ఆ 26 దేశాల పర్యటనకు...
షెంజన్ దేశాల్లో పర్యటనకు వీసాకు దరఖాస్తు చేసే ముందు కనీసం 30,000 యూరోలు లేదా సరిసమానమైన కరెన్సీని వైద్య వ్యయాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. షెంజన్ ఏరియాలో పర్యటన సమయంలో పర్యాటకుడు ఏదైనా జబ్బు పడితే, తీసుకున్న పాలసీ మొత్తం పరిధికి లోబడి సంబంధిత పర్యాటకుడు ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని పొందగలుగుతాడు.
ఏ దేశమేగినా...
నిజానికి అమెరికా, కెనడాలాంటి కొన్ని దేశాల్లో పర్యటనకు ముందు పర్యటన బీమా చేయించుకోవడం తప్పనిసరి కాదు. అయితే ఆయా దేశాల్లో పర్యటన సందర్భంగా ఏదైనా జబ్బు పడితే వైద్య ఖర్చులు తడిచిమోపెడవుతాయి. ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యయం భారత్‌కన్నా అత్యధికం కావడం ఇక్కడ మరో కీలకాంశం. ఇలాంటి పరిస్థితి దేశం కాని దేశంలో ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. ఈ అనుకోని ఇబ్బందులను ఎదుర్కొనాలంటే ఏ దేశంలో పర్యటనకైనా ముందు పర్యటన బీమా తప్పనిసరిగా చేయించుకోవడం ఎంతో ప్రయోజనం.
పలు ప్రొడక్టులు...
భారత్‌లోని పలు బీమా కంపెనీలు ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా పలు రకాలు పర్యటన బీమా పథకాలను విక్రయిస్తున్నాయి. పర్యటనకు సంబంధించి ఆయా దేశాల్లో పరిస్థితుల అవసరాలకు అనుగుణమైన అంశాలు పొందుపరచిన బీమా పథకాలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఒక్క వైద్యమే కాకుండా, ఇతర అవసరాలకు తగిన బీమా పథకాలను సైతం కంపెనీలు విక్రయిస్తున్నాయి. విదేశీ పర్యటనలో ‘ముందు జాగ్రత్త’ అపరిమిత ప్రయోజనాలను చేకూర్చుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. మీ విదేశీయానంలో దురదృష్టవశాత్తూ... అనుకోకుండా వచ్చే వ్యయ ప్రయాసలకు కొండత ధీమా... పర్యటన బీమా... బెస్ట్ ఆఫ్ లక్..!