పరిషత్ సైన్యం రెడీ
ఆదిలాబాద్‌అర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చే నెలలో నిర్వహించనున్న ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు సిబ్బంది రెడీ అయ్యారు. ఆయా జిల్లాలో నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందిని నియమించి సిద్ధంగా ఉంచారు. మూడు విడతలుగా నిర్వహించే పరిషత్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధిక మొత్తంలో సిబ్బందికి ఎన్నికల బాధ్యతలు అప్పగించి పరిషత్ పోరును విజయవంతం చేసేం దుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను ఇది వరకే నోడల్ అధికారులుగా, రిటర్నింగ్ సహాయ అధికారులుగా నియమించగా, తాజాగా పీవో, ఏపీవో, ఓపీవోలను కూడా నియమించారు. వీరికి ఎన్నికల విధుల్లో భాగంగా ఆయా జిల్లా, మండలాల్లో రెండు రోజుల శిక్షణ కూడా ఇచ్చారు.
ఉమ్మడి జిల్లాలో 17,512మంది సిబ్బంది
ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు మే నెలలో జరుగనున్న ఎన్నికల నిర్వహణకు మొత్తం 17,512 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 6212 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఉండగా, 10940 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారు. వచ్చే నెల 6, 10, 14తేదీల్లో మూడు విడతలుగా జరిగే పోలింగ్ రోజున వీరు విధులు నిర్వర్తించనున్నారు. 400 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రానికి ముగ్గురు ఓపీవోలను నియమించగా, ఒక్కొక్కరు చొప్పున ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
ఇక 400 నుంచి 600 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రానికి నలుగురు వోపీవోలను నియమించారు. వీరితో పాటు ఒక ప్రిసైడింగ్, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి విధుల్లో ఉండేట్లు అధికారులు బాధ్యతలు అప్పగించారు. అంటే 400 మంది ఓటర్లు ఉన్న ఒక పీఎస్‌లో మొత్తం ఐదురుగురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తే 400 నుంచి 600 మంది ఓటర్లు ఉన్న పీఎస్‌లలో ఆరుగురు సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో పీవో, ఏపీవో, వోపీవోలను కలుపుకొని మొత్తం 4844 మంది సిబ్బందిని నియమించగా, మంచిర్యాలలో 4297 మంది, నిర్మల్‌లో 4983 మంది, ఆసిఫాబాద్‌లో 3028 మంది సిబ్బందిని నియమించారు.
293 ఆర్వోలు, 243 ఏఆర్వోల నియామకం..
పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరష్కరణ, అభ్యర్థుల ప్రకటన తదితర పనులు సక్రమంగా పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 293 మంది రిటర్నింగ్ అధికారులను, 243 సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఇందులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులు కలిపి ఉన్నారు. ఆదిలాబాద్‌కు మొత్తం 83 మంది రిటర్నింగ్ అధికారులను నియమించగా 60 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. నిర్మల్‌లో 75 మంది రిటర్నింగ్, 84 మంది ఏఆర్వోలు, మంచిర్యాలలో 65 మంది ఆర్వోలు, 49 మంది ఏఆర్వోలు, ఆసిఫాబాద్‌లో 70మంది ఆర్వోలు, 50 మంది ఏఆర్వోలను నియమించారు. ఎన్నికల మొదటి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
ఉమ్మడి జిల్లాలో 14.55 లక్షల ఓటర్లు..
జనవరిలో పంచాయతీ పోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైన విషయం తెలిసిందే. అప్పుడే పరిషత్ ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, ఓటరు కార్డుల్లో చేర్పులు, మార్పులకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసి ఓటరు లిస్టు తమతమ పేర్లను చూసుకునే విధంగా వీలు కల్పించారు. దీంతో జాబితాలో లేని వారు చాలా మంది వరకు నమోదు చేసుకున్నారు.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు మార్చి 25న పంచాయతీల వారీగా పరిషత్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. అనంతరం వాటిని మళ్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా విభజన చేసిన అదే నెల 30న పరిషత్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఈ ప్రక్రియ నాలుగు జిల్లాల పరిధిలో జరిగింది. ఈలోగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సీఈసీ నోటిఫికేషన్ చేయడంతో పరిషత్ ప్రక్రియ మందగించింది. అయితే ఓటర్ల తుది జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 14,55,877 మంది గ్రామీణ ప్రాంత ఓటర్లు ఉన్నారు. ఇందులో ఆదిలాబాద్‌లో 3,90,882 మంది ఓటర్లు ఉండగా, నిర్మల్‌లో 4,08,301 మంది, మంచిర్యాలలో 3,51,310 మంది, ఆసిఫాబాద్‌లో 3,05,384 మంది ఓటర్లు ఉన్నారు.