నామినేషన్ ఉపసంహరించుకుంటున్న జెడ్పీటీసీ అభ్యర్థి
కరీంనగర్: మొదటి విడత ఎన్నికలు జరిగే జిల్లా, మండల పరిషత్ సంగ్రామంలో ఏడు జెడ్పీటీసీ స్థానాలకు 34 మంది అభ్యర్థులు, 89 ఎంపీటీసీ స్థానాలకు 304 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూర్, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక జెడ్పీటీసీ స్థానాలకు 72 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణకు చివరి రోజైన ఆదివారం 38 మంది బరి నుంచి తప్పుకున్నారు. పోటీలో 34 మంది మిగిలారు. ఇల్లందకుంటలో నలుగురు, హుజూరాబాద్‌లో 5, జమ్మికుంటలో 5, మానకొండూర్‌లో 4, శంకరపట్నంలో 8, సైదాపూర్‌లో 3, వీణవంకలో 5 అభ్యర్థులు పోటీలో మిగిలారు. అత్యధికంగా శంకరపట్నం స్థానానికి ఎనిమిది మంది.. అత్యల్పంగా సైదాపూర్ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నారు.
ఎంపీటీసీ స్థానాలకు 304 మంది పోటీ..
మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని 89 ఎంపీటీసీ స్థానాలకు 304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు రోజుల పాటు మొత్తం 478 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు 174 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఎంపీటీసీ స్థానాలకు 304 మంది పోటీలో ఉన్నారు. ఇల్లందకుంటలో 33 మంది, హుజూరాబాద్‌లో 42, జమ్మికుంటలో 34, మానకొండూర్‌లో 61, శంకరపట్నంలో 44, సైదాపూర్‌లో 44, వీణవంకలో 46 మంది ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా మానకొండూర్ మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు 61 మంది బరిలో నిలిచారు. అత్యల్పంగా ఇల్లందకుంట మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలకు 33 మంది పోటీలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment