108 సేవలు ఇంత అధ్వానమా?
♦ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం
♦ పాడేరు ఆస్పత్రిలో తల్లీబిడ్డల ఆరోగ్యం ఆందోళనకరం
♦ విశాఖ తరలింపునకు అందుబాటులో లేని అంబులెన్స్
♦ జిల్లా కో-ఆర్డినేటర్‌తో మాట్లాడి రప్పించిన ఎమ్మెల్యే
పాడేరు రూరల్ : ఏజెన్సీలో 108 సేవలు సక్రమంగా లేవని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. మన్యంలో మాతా,శిశు మరణాలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు ప్రకటిస్తున్నా ఆచరణలో కానరావడంలేదన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే విశాఖపట్నం ఆస్పత్రికి తరలించాలని వైద్యులు చెప్పినప్పటికి 108 వాహనం సకాలంలో అందుబాటులో లేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఉదయం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా విశాఖపట్నం తరలించాలని వైద్యులు సూచించారు. కానీ 108 అంబులెన్స్ అందుబాటులో లేదు. దీనిని బాధితులు పాడే రు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె వెంటనే పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకుని తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. 108 సేవల జిల్లా కో-ఆర్డినేటర్‌తో ఫోన్లో మాట్లాడారు. అంబులెన్స్‌ను రప్పించి దగ్గరుండి తల్లి, బిడ్డలను విశాఖపట్నం పంపారు. ఏజెన్సీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలో అంబులెన్స్‌లు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేకంగా రెండింటిని ఏర్పాటుకు ప్రభుత్వంతో పోరాడుతానన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఏపీటీఎఫ్ నేత గోవింద్, ఇన్చార్జి డాక్టర్ దుర్గారాజు, వైద్యులు శోభరాణి ఉన్నారు.