ధూపదీప నైవేద్యాలకు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం లేని దేవాలయాలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. ధూపదీప నైవేద్యాల పథకం కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,500ను రూ.6 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వు రేపోమాపో వెలువడనుంది. వరంగల్‌లో ఐదు నెలల క్రితం జరిగిన ఓ బహిరంగ సమావేశంలోనే సీఎం కేసీఆర్ దీనికి సానుకూలత వ్యక్తం చేసినా.. ఉత్తర్వు మాత్రం వెలువడలేదు.
తమకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయ ఉద్యోగులు సమ్మెకు దిగిన నేపథ్యంలో దీనికి కూడా మోక్షం లభించింది. సమ్మె విరమణ కోసం శుక్రవారం రాత్రి అర్చక సంఘం, ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చర్చలు జరిపిన సందర్భంలో ధూపదీప నైవేద్యాల మొత్తం పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు.
ఖజానా నుంచి వేతనాలు చెల్లించే విషయంలో కమిటీని వేసి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రధాన హామీలకు సంబంధించి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సీఎం కేసీఆర్‌ను కలసి వివరించారు. స్వయంగా తాను ఇచ్చిన హామీ కావటంతో ధూపదీప నైవేద్యాల మొత్తం పెంచే అంశాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఖజానా వేతనాలపై కమిటీ ఏర్పాటు చేసి నెలరోజుల్లో నివేదిక అందజేసేలా ఆదేశించాలని పేర్కొన్నారు.
డిమాండ్లు నెరవేరుస్తాం: ఇంద్రకరణ్
అర్చకుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అర్చకులకు, దేవాదాయశాఖ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న డిమాండ్ అధ్యయనానికి కమిటీ వేస్తున్నామని, రెండు నెలల్లో దాన్ని కొలిక్కి తెస్తామన్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఐదు జిల్లాలో చేస్తున్న పనులు 75 శాతం పూర్తయ్యాయని, జూలై తొలివారం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. అర్చకుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించినందుకు సీఎం కేసీఆర్‌కు అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, భాస్కరభట్ల రామశర్మ కృతజ్ఞతలు తెలిపారు.
ఖజానా వేతనాలపై కమిటీ
అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయిప్రసాద్, రెవెన్యూ(దేవాదాయ) ఉప కార్యదర్శి వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రామకృష్ణారావు ఇందులో సభ్యులుగా ఉన్నారు. జూన్ చివరి నాటికి కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.