జార్ఖండ్ సీఎం రేసులో ముగ్గురు!
పోటీలో ఒక గిరిజన, ఇద్దరు గిరిజనేతర నేతలు
రఘువర్, సరయూరాయ్, సుదర్శన్లలో ఒకరికి చాన్స్
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న బీజేపీ... ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో గత సంప్రదాయానికి భిన్నంగా గిరిజనేతరుడి కి సీఎం పగ్గాలు అప్పగించాలా? లేక సంప్రదాయాన్ని గౌరవిస్తూ గిరిజనుడికే ఆ అవకాశం ఇవ్వాలా? అనే ప్రశ్న బీజేపీ నాయకత్వాన్ని వేధిస్తోంది.
ఒకవేళ గిరిజనేతర సీఎంకు పదవి కట్టబెట్టాలనుకుంటే బీజేపీ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్తోపాటు పార్టీ సీనియర్ నేత సరయూరాయ్లు ముందంజలో ఉన్నారు. గిరిజన నేతను గద్దెనెక్కించాలనుకుంటే మాత్రం కేంద్ర మంత్రి సుదర్శన్ భగత్‌కు అవకాశం దక్కనుంది. రాష్ట్రంలో బీజేపీ గిరిజన ముఖంగా పేరుగాంచిన మాజీ సీఎం అర్జున్ ముండా ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ గిరిజన నాయకుడిగా సుదర్శన్ భగత్ ఉన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాస్...సీఎం పదవిపై కొన్నేళ్ల కిందటే తన ఆకాంక్షను బయటపెట్టారు.
సీఎం రేసులో ఉన్నారా? అని దాస్‌ను విలేకరులు మంగళవారం ప్రశ్నించగా సీఎం ఎంపిక అంశాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికే అప్పగించినట్లు చెప్పారు. ఇక సరయూ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడనే పేరుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేసిన సుదర్శన్ భగత్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కె.సి. సుదర్శన్ ఎక్కడ సమావేశాలు నిర్వహించినా భగత్ ఉండేవారు. ఆయన 2005-06లో అర్జున్ ముండా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో గిరిజనేతర నేతకు సీఎం పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఎమ్మెల్యేలు (మొత్తం 37 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 10 మంది గిరిజనులు) వ్యతిరేకిస్తేభగత్ పేరు సీఎం రేసులో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా, వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, శివ్‌శంకర్ ఒరావోన్లు కూడా రేసులో ఉండొచ్చని తెలుస్తోంది.