Nori datta threyudu
-
సిగ్నల్స్‌ను పట్టించుకోవాలి.. క్యాన్సర్ నియంత్రణకు 6 సూత్రాల ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చని ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్ కేర్) డాక్టర్ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. రాష్ట్రంలోనూ ప్రాథమిక దశలో గుర్తించి, నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆరు సూత్రాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ప్రణాళిక ఇచ్చినట్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నియంత్రిద్దామిలా.. ఈ సంవత్సరం దేశంలో 1.3 మిలియన్ కొత్త కేసులు వచ్చాయి. వచ్చే ఐదేళ్లలో 1.92 మిలియన్లకి పెరుగుతాయి. ఇలా పెరుగుతుంటే ఎప్పటికీ నియంత్రించలేం. కొన్ని చర్యలతో అమెరికాలో క్యాన్సర్‌ను అదుపులోకి తెచ్చారు. అవే పద్ధతులతో ఇక్కడా నియంత్రించవచ్చు. నివారణ (ప్రివెన్షన్), స్క్రీనింగ్, ముందే గుర్తించడం (ఎర్లీ డిటెక్షన్)కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ చేపట్టాలి. పెద్ద వ్యాన్లలో మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ వంటి సౌకర్యాలతో ప్రజల దగ్గరకు వెళ్లి, పరీక్షలు చేయాలి. దీనిద్వారా క్యాన్సర్ కారకాలను గుర్తించి తొలి దశలోనే నివారించొచ్చు. చికిత్స అక్కడే సులభంగా జరుగుతుంది. నేను నిజామాబాద్, గుంటూరులో శిబిరాలు నిర్వహించాను. జనం విపరీతంగా వచ్చారు. సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, మామోగ్రపీ, వ్యాక్సినేషన్ పెట్టాం. ఇలాంటివి ఒక యుద్ధంలా జరగాలి. ప్రభుత్వమే కాదు ఎన్జీవోలు, ఎన్నారైలు ఎవరైనా వీటిని నిర్వహించవచ్చు. శరీరం ముందే చెబుతుంది క్యాన్సర్ ఒక్కసారిగా రాదు. శరీరం ముందే చెబుతుంది. అది పంపే సిగ్నల్స్‌ని పట్టించుకోకపోవడం వల్ల ముదిరిపోతుంది. నొప్పి, దగ్గు వచ్చి వెంటనే తగ్గకపోయినా, శరీరంలో ఎక్కడైనా ఏదైనా తగులుతున్నా, అసాధారణ మార్పులు ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి. సరైన ఆహారం తినాలి. కొవ్వు పదార్ధాలు ఎక్కువ తింటే బ్రెస్ట్, యుటెరస్, ఓవరీ, ప్రొస్టేట్ క్యాన్సర్లు వస్తాయి. నిల్వ పచ్చళ్లు తినకూడదు. నూనె నిల్వ చేస్తే విషంగా మారుతుంది. నిల్వ నూనెల నుంచి వచ్చే పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. దేశంలో 60 శాతం కేసులు పొగాకు వల్ల వస్తున్నాయి. మరో 20 శాతం గర్భాశయ, ఇతర క్యాన్సర్లు. వీటిని ముందే గుర్తిస్తే కచ్చితమైన చికిత్స చేయవచ్చు. పిల్లలకు క్యాన్సర్ ఎందుకు వస్తుందో అధ్యయనం చేయాలి. పెస్టిసైడ్స్ కారణం కావచ్చు. వ్యవసాయంలో పెస్టిసైడ్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అవగాహన పెంచుకోవాలి ప్రాథమిక దశలోనే క్యాన్సర్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. జీవన శైలి మార్పు, సరైన ఆహారం, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువ తినడం, వ్యాయామం ద్వారా నివారించవచ్చు. ప్రతి ఒక్కరు కుటుంబ చరిత్ర తెలుసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గతంలో క్యాన్సర్ ఉంటే 40 ఏళ్లకే మామోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ ముదిరిందంటే నివారించడం కష్టం. అది సమాజానికి, ప్రభుత్వానికి భారం. కొన్ని క్యాన్సర్లకు వ్యాక్సిన్లు కూడా వచ్చాయి. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ను నివారించవచ్చు. చికిత్స కూడా చేయవచ్చు. అయినా మరణాలు సంభవిస్తున్నాయంటే ముందే గుర్తించకపోవడమే కారణం. అమెరికాలో దీనిని దాదాపు నిర్మూలించారు. దీనికి వ్యాక్సిన్ కూడా ఉంది. ప్రభుత్వానికి ఇచ్చిన ఆరు సూత్రాల ప్రణాళిక.. ► క్యాన్సర్ కేసులను నమోదు చేయాలి. పెద్ద, చిన్నా ఏ ఆస్పత్రిలో క్యాన్సర్ నిర్థారణ అయినా ప్రభుత్వ లెక్కల్లోకి రావాలి. ఇందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ► చిన్న చిన్న లోపాలు సవరించుకోవాలి. కొన్ని ఆస్పత్రుల్లో అన్నీ ఉన్నా, ఒక చిన్న మిషన్ ఉండదు. గుంటూరు జీజీహెచ్‌లో అన్నీ ఉన్నాయి. ఒక చిన్న మెషిన్ పెడితే మెగా క్యాన్సర్ సెంటర్ అవుతుంది. ఇదే విషయం సీఎంకు చెప్పాను. పనిచేయని మెషీన్లు, లోపాలు, ఇతర అంశాలపై ఒక టాస్క్‌ఫోర్స్ వేయాలి. ► రాష్ట్రం మొత్తానికి ఒక రీజినల్ క్యాన్సర్ సెంటర్ (ఆర్సీసీ), అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లు (సీసీసీ)లు ఏర్పాటు చేయాలి. వీటిపై ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ ఇచ్చాను. ► 90 శాతం పిల్లల క్యాన్సర్లను అడ్వాన్స్ స్టేజ్‌లో నియంత్రించవచ్చు. సీఎం జగన్‌కు ఇదే విషయం చెప్పాను. తిరుపతిలోని పిల్లల కార్డియాక్ ఆస్పత్రికి అనుబంధంగా అక్కడే క్యాన్సర్ ఆస్పత్రి పెట్టవచ్చని చెప్పా. సీఎం అంగీకరించారు. ► క్యాన్సర్ ముదిరిన వాళ్లకి నొప్పి తగ్గించేందుకు ఆర్‌సీసీలో ప్రత్యేక చికిత్స కేంద్రాలు పెట్టాలి. దానికి ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది. సాధారణ డాక్టర్లకి ఆ నొప్పిని తగ్గించడం తెలియదు. ► అన్ని క్యాన్సర్లకీ ఒకటే వైద్యం ఉండకూడదు. మహిళల, పురుషుల క్యాన్సర్లకు వేర్వేరు విధానాలు ఉన్నాయి. హైరిస్క్ క్యాన్సర్లను గుర్తించాలి. ఏ క్యాన్సర్ ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో ఎలా వస్తుంది, ఎన్ని కేసులు వస్తున్నాయో చూడాలి. దానికి ప్రత్యేక విభాగాలు పెట్టి అధ్యయనం చేయించాలి. క్యాన్సర్‌పై మూడు విభాగాల్లో టాస్క్‌ఫోర్స్: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకు పురుషులు, మహిళలు, పిల్లలు ఇలా మూడు విభాగాల్లో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ నివారణకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై హైదరాబాద్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో నిపుణులైన వైద్యులు సభ్యులుగా ఉంటారన్నారు. వీరు పురుషులు, మహిళలు, పిల్లల్లో క్యాన్సర్ చికిత్స, ప్రారంభ దశలో గుర్తించడం, నివారణ చర్యలపై పర్యవేక్షించడంతో పాటు, సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు. డీఎంఈ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై ప్రత్యేక అవగాహన, స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం, వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ నవీన్‌కుమార్, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ సంజయ్ సిన్హా, మనీశ్ శర్మ పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి
సాక్షి, అమరావతి: రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్ సంరక్షణ)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన్ని కేబినెట్ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని ముఖ్యమంత్రి కోరిన విషయం విదితమే. రేడియేషన్ ఆంకాలజీలో దేశంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు 43 ఏళ్ల అనుభవం ఉంది. బ్రెస్ట్ సెంటర్, గైనకాలజిక్ ఆంకాలజీ, హెడ్, మెడ, న్యూరో ఆంకాలజీ, థొరాసిక్ ప్రోగ్రాంల కోసం కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నిక్లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. న్యూయార్క్ హాస్పిటల్ క్వీన్స్‌లో ఆంకాలజీలో ప్రతి సబ్ స్పెషాలిటీలో ట్యూమర్ కాన్ఫరెన్స్‌లను ప్రారంభించారు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఆయన సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. -
భారతీయులకు ఇమ్యునోథెరపీతో మేలు
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌కు ఎన్నో కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా.. భారతీయ రోగుల విషయంలో ఇమ్యునోథెరపీ (రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి కేన్సర్ కణాలను నాశనం చేసేలా చేయడం) ఎక్కువ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ కేన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యాధి బాగా ముదిరినా ఇమ్యునోథెరపీ ద్వారా పరిస్థితిని చక్కదిద్దే అవకాశముందని చెప్పారు. కేన్సర్‌కు ఒకప్పుడు రేడియేషన్ లేదా కీమోథెరపీ, శస్త్రచికిత్సల ద్వారా చికిత్స చేసేవారని పేర్కొన్నారు. ఐదారేళ్లుగా అమెరికాతో పాటు యూరప్‌లోనూ అందుబాటులో ఉన్న ఇమ్యునోథెరపీకి రేడియేషన్‌ను జోడించడం ద్వారా కొన్ని రకాల కేన్సర్లను దీర్ఘకాలం పాటు రాకుండా చేయొచ్చని వివరించారు. కణితులున్న చోటే రేడియోధార్మికతను అందించడం ద్వారా చేసే బ్రాకియాథెరపీలోనూ కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పుడు బసవతారకం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి వచ్చిందని, ఆరోగ్యకరమైన అవయవాలకు ఇబ్బంది కలగకుండానే మెరుగైన చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ చికిత్సను మరిన్ని ఎక్కువ రకాల కేన్సర్ల చికిత్సకు వాడేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బ్రెజిల్ వైద్య సమాఖ్యతో భాగస్వామ్యం కేన్సర్ రోగులకు మరిన్ని ఎక్కువ చికిత్స పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు బ్రెజిల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అసోసియేషన్‌తో కలసి పనిచేయనున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ టి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. హైపెక్ కీమో చికిత్స ద్వారా వివిధ చికిత్సల తర్వాత శరీరంలో మిగిలి ఉండే అతిసూక్ష్మమైన కణితులు, కేన్సర్ కణాలను తొలగించవచ్చన్నారు. ఇమ్యునోథెరపీ వల్ల వచ్చే దుష్పరిణామాల నియం త్రణకు అవసరమైన సాంకేతికత కూడా అందుబాటులో ఉందని చెప్పారు. -
కాలేయ కేన్సర్ తెలుగు రాష్ట్రాల్లో అధికం
* ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు * జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారాలి * పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ వినియోగం తగ్గాలి * గర్భాశయ కేన్సర్‌తో పోటీపడుతున్న రొమ్ము కేన్సర్ * క్షేత్రస్థాయిలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించాలి * అమెరికాలోకంటే భారత్‌లోనే మందులు చౌక * ‘విస్టా ఇమేజింగ్ సెంటర్’లో ఎంఆర్ ఎలాస్ట్రోగ్రఫీ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాలేయ కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఇక్కడ హెపటైటిస్ బీ, సీ కారక వైరస్ ఎక్కువగా ఉండటం, అధికంగా ఆల్కహాల్‌ను వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది వ్యాధి ముదిరిన తర్వాత వైద్యులను ఆశ్రయించడం వల్ల ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కాలేయ కేన్సర్ రాకుండా జాగ్రత్తపడవచ్చని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ‘విస్టా ఇమేజింగ్ మెడికల్ సెంటర్’లో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన ‘ఎంఆర్ ఎలాస్ట్రోగ్రఫీ’ యంత్ర పరికరాన్ని ఆదివారం నోరి దత్తాత్రేయుడు ఆవిష్కరించారు. విస్టా ఇమేజింగ్ సెంటర్ సీఈవో గోపీకృష్ణ, డెరైక్టర్ డాక్టర్ వైఎస్ అరుణ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ విజయ్‌భాస్కర్ నోరి, పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ డాక్టర్ పరిణితతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేన్సర్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని, ఏటా కొత్తగా అనేక రకాల మందులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల కేన్సర్‌కు కారణమవుతున్న కణాలను చంపే ‘టోర్సివా’ మాత్ర అందుబాటులోకి వచ్చిందన్నారు. అయితే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే కేన్సర్ మందుల ధరలు భారత్‌లోనే తక్కువగా ఉన్నట్లు నోరి తెలిపారు. అయితే దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ధరలు ఇంకా తగ్గాల్సిన అవసరముందన్నారు. నోరు, గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్‌కు పొగాకు ఉత్పత్తుల వినియోగమే ప్రధాన కారణమని, గుట్కా, సిగరెట్, బీడీ వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని తెలిపారు. బీపీ, షుగర్‌లాగే కేన్సర్.. బీపీ, షుగర్‌లాగే కేన్సర్ కూడా సర్వసాధారణమైనదని నోరి వివరించారు. ‘‘దేశంలో ఏటా 13 నుంచి 15 లక్షల మంది కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడు కేన్సర్ వస్తే చావు తప్పదని భావించేవారు. నేడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేన్సర్ రాకుండా ఉండేందుకు ముందస్తు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మందులతో బీపీ, షుగర్ మాదిరే కేన్సర్‌ను కూడా నియంత్రించి, జీవి తకాలాన్ని పెంచుకునే అవకాశముంది. అమెరికాలో ఇప్పటికే ఈ తరహా వైద్యసేవలు ఉన్నాయి. త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి వస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు. దేశం లో ఇప్పటివరకు గర్భాశయ ముఖద్వారా కేన్సర్లే ఎక్కువగా నమోదయ్యేవని, కానీ ఇప్పుడు రొమ్ము కేన్సర్ కేసులు సర్వసాధారణంగా మారిపోయాయని నోరి దత్తాత్రేయుడు తెలిపారు. ‘‘దేశంలో నిత్యం 200 మంది మహిళలు రొమ్ము కేన్సర్‌తో చనిపోతున్నారు. 50 ఏళ్లు దాటిన ప్రతి మహిళ విధిగా ‘మమ్మోగ్రామ్’ పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ కేన్సర్ సోకకుండా ఉండేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కేన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే నయం చేయడం చాలా సులువు. క్షేత్రస్థాయిలోని మహిళలకు ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించడం ఒక్కటే దీనికి పరిష్కారం’’ అని నోరి సూచించారు. ఇంట్లో ఒక్కరు కేన్సర్ బారినపడినా ఆ ప్రభావం మొత్తం కుటుం బంపై పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ కేన్సర్ విభాగాలను అభివృద్ధి పరి చి వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాలకు సూచించారు.