* ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
* జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారాలి
* పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ వినియోగం తగ్గాలి
* గర్భాశయ కేన్సర్‌తో పోటీపడుతున్న రొమ్ము కేన్సర్
* క్షేత్రస్థాయిలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించాలి
* అమెరికాలోకంటే భారత్‌లోనే మందులు చౌక
* ‘విస్టా ఇమేజింగ్ సెంటర్’లో ఎంఆర్ ఎలాస్ట్రోగ్రఫీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాలేయ కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఇక్కడ హెపటైటిస్ బీ, సీ కారక వైరస్ ఎక్కువగా ఉండటం, అధికంగా ఆల్కహాల్‌ను వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది వ్యాధి ముదిరిన తర్వాత వైద్యులను ఆశ్రయించడం వల్ల ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కాలేయ కేన్సర్ రాకుండా జాగ్రత్తపడవచ్చని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ‘విస్టా ఇమేజింగ్ మెడికల్ సెంటర్’లో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన ‘ఎంఆర్ ఎలాస్ట్రోగ్రఫీ’ యంత్ర పరికరాన్ని ఆదివారం నోరి దత్తాత్రేయుడు ఆవిష్కరించారు.
విస్టా ఇమేజింగ్ సెంటర్ సీఈవో గోపీకృష్ణ, డెరైక్టర్ డాక్టర్ వైఎస్ అరుణ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ విజయ్‌భాస్కర్ నోరి, పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ డాక్టర్ పరిణితతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేన్సర్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని, ఏటా కొత్తగా అనేక రకాల మందులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల కేన్సర్‌కు కారణమవుతున్న కణాలను చంపే ‘టోర్సివా’ మాత్ర అందుబాటులోకి వచ్చిందన్నారు. అయితే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే కేన్సర్ మందుల ధరలు భారత్‌లోనే తక్కువగా ఉన్నట్లు నోరి తెలిపారు. అయితే దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ధరలు ఇంకా తగ్గాల్సిన అవసరముందన్నారు. నోరు, గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్‌కు పొగాకు ఉత్పత్తుల వినియోగమే ప్రధాన కారణమని, గుట్కా, సిగరెట్, బీడీ వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని తెలిపారు.
బీపీ, షుగర్‌లాగే కేన్సర్..
బీపీ, షుగర్‌లాగే కేన్సర్ కూడా సర్వసాధారణమైనదని నోరి వివరించారు. ‘‘దేశంలో ఏటా 13 నుంచి 15 లక్షల మంది కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడు కేన్సర్ వస్తే చావు తప్పదని భావించేవారు. నేడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేన్సర్ రాకుండా ఉండేందుకు ముందస్తు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మందులతో బీపీ, షుగర్ మాదిరే కేన్సర్‌ను కూడా నియంత్రించి, జీవి తకాలాన్ని పెంచుకునే అవకాశముంది. అమెరికాలో ఇప్పటికే ఈ తరహా వైద్యసేవలు ఉన్నాయి. త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి వస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు. దేశం లో ఇప్పటివరకు గర్భాశయ ముఖద్వారా కేన్సర్లే ఎక్కువగా నమోదయ్యేవని, కానీ ఇప్పుడు రొమ్ము కేన్సర్ కేసులు సర్వసాధారణంగా మారిపోయాయని నోరి దత్తాత్రేయుడు తెలిపారు.
‘‘దేశంలో నిత్యం 200 మంది మహిళలు రొమ్ము కేన్సర్‌తో చనిపోతున్నారు. 50 ఏళ్లు దాటిన ప్రతి మహిళ విధిగా ‘మమ్మోగ్రామ్’ పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ కేన్సర్ సోకకుండా ఉండేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కేన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే నయం చేయడం చాలా సులువు. క్షేత్రస్థాయిలోని మహిళలకు ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించడం ఒక్కటే దీనికి పరిష్కారం’’ అని నోరి సూచించారు. ఇంట్లో ఒక్కరు కేన్సర్ బారినపడినా ఆ ప్రభావం మొత్తం కుటుం బంపై పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ కేన్సర్ విభాగాలను అభివృద్ధి పరి చి వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాలకు సూచించారు.
కాలేయ కేన్సర్ తెలుగు రాష్ట్రాల్లో అధికం
Published Mon, Feb 23 2015 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement