How To Control The Cancer: 6 Principles For Cancer Control In Telugu - Sakshi
Sakshi News home page

లైట్‌ తీసుకోవద్దు.. సిగ్నల్స్‌ను పట్టించుకోవాలి..  క్యాన్సర్‌ నియంత్రణకు ఆరు సూత్రాల ప్రణాళిక

Published Tue, Mar 15 2022 5:02 AM | Last Updated on Wed, Mar 16 2022 9:36 AM

6 principles for cancer control - Sakshi

డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న వైద్య శాఖ స్పెషల్‌ సెక్రటరీ నవీన్‌కుమార్‌

సాక్షి, అమరావతి: ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చని ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్‌ కేర్‌) డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. రాష్ట్రంలోనూ ప్రాథమిక దశలో గుర్తించి, నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆరు సూత్రాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ప్రణాళిక ఇచ్చినట్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

నియంత్రిద్దామిలా..
ఈ సంవత్సరం దేశంలో 1.3 మిలియన్‌ కొత్త కేసులు వచ్చాయి. వచ్చే ఐదేళ్లలో 1.92 మిలియన్లకి పెరుగుతాయి. ఇలా పెరుగుతుంటే ఎప్పటికీ నియంత్రించలేం. కొన్ని చర్యలతో అమెరికాలో క్యాన్సర్‌ను అదుపులోకి తెచ్చారు. అవే పద్ధతులతో ఇక్కడా నియంత్రించవచ్చు. నివారణ (ప్రివెన్షన్‌), స్క్రీనింగ్, ముందే గుర్తించడం (ఎర్లీ డిటెక్షన్‌)కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్‌ చేపట్టాలి. పెద్ద వ్యాన్‌లలో మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌ వంటి సౌకర్యాలతో ప్రజల దగ్గరకు వెళ్లి, పరీక్షలు చేయాలి. దీనిద్వారా క్యాన్సర్‌ కారకాలను గుర్తించి తొలి దశలోనే నివారించొచ్చు. చికిత్స అక్కడే సులభంగా జరుగుతుంది. నేను నిజామాబాద్, గుంటూరులో శిబిరాలు నిర్వహించాను. జనం విపరీతంగా వచ్చారు. సర్వైకల్, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పరీక్షలు, మామోగ్రపీ, వ్యాక్సినేషన్‌ పెట్టాం. ఇలాంటివి ఒక యుద్ధంలా జరగాలి. ప్రభుత్వమే కాదు ఎన్జీవోలు, ఎన్నారైలు ఎవరైనా వీటిని నిర్వహించవచ్చు.

శరీరం ముందే చెబుతుంది
క్యాన్సర్‌ ఒక్కసారిగా రాదు. శరీరం ముందే చెబుతుంది. అది పంపే సిగ్నల్స్‌ని పట్టించుకోకపోవడం వల్ల ముదిరిపోతుంది. నొప్పి, దగ్గు వచ్చి వెంటనే తగ్గకపోయినా, శరీరంలో ఎక్కడైనా ఏదైనా తగులుతున్నా, అసాధారణ మార్పులు ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి. సరైన ఆహారం తినాలి. కొవ్వు పదార్ధాలు ఎక్కువ తింటే బ్రెస్ట్, యుటెరస్, ఓవరీ, ప్రొస్టేట్‌ క్యాన్సర్లు వస్తాయి. నిల్వ పచ్చళ్లు తినకూడదు. నూనె నిల్వ చేస్తే విషంగా మారుతుంది. నిల్వ నూనెల నుంచి వచ్చే పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తుంది. దేశంలో 60 శాతం కేసులు పొగాకు వల్ల వస్తున్నాయి. మరో 20 శాతం గర్భాశయ, ఇతర క్యాన్సర్లు. వీటిని ముందే గుర్తిస్తే కచ్చితమైన చికిత్స చేయవచ్చు. పిల్లలకు క్యాన్సర్‌ ఎందుకు వస్తుందో అధ్యయనం చేయాలి. పెస్టిసైడ్స్‌ కారణం కావచ్చు. వ్యవసాయంలో పెస్టిసైడ్స్‌ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

అవగాహన పెంచుకోవాలి
ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. జీవన శైలి మార్పు, సరైన ఆహారం, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువ తినడం, వ్యాయామం ద్వారా నివారించవచ్చు. ప్రతి ఒక్కరు కుటుంబ చరిత్ర తెలుసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గతంలో క్యాన్సర్‌ ఉంటే 40 ఏళ్లకే మామోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ ముదిరిందంటే నివారించడం కష్టం. అది సమాజానికి, ప్రభుత్వానికి భారం. కొన్ని క్యాన్సర్లకు వ్యాక్సిన్లు కూడా వచ్చాయి. సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ను నివారించవచ్చు. చికిత్స కూడా చేయవచ్చు. అయినా మరణాలు సంభవిస్తున్నాయంటే ముందే గుర్తించకపోవడమే కారణం. అమెరికాలో దీనిని దాదాపు నిర్మూలించారు. దీనికి వ్యాక్సిన్‌ కూడా ఉంది. 

ప్రభుత్వానికి ఇచ్చిన ఆరు సూత్రాల ప్రణాళిక..
► క్యాన్సర్‌ కేసులను నమోదు చేయాలి. పెద్ద, చిన్నా ఏ ఆస్పత్రిలో క్యాన్సర్‌ నిర్థారణ అయినా ప్రభుత్వ లెక్కల్లోకి రావాలి. ఇందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
► చిన్న చిన్న లోపాలు సవరించుకోవాలి. కొన్ని ఆస్పత్రుల్లో అన్నీ ఉన్నా, ఒక చిన్న మిషన్‌ ఉండదు.  గుంటూరు జీజీహెచ్‌లో అన్నీ ఉన్నాయి. ఒక చిన్న మెషిన్‌ పెడితే మెగా క్యాన్సర్‌ సెంటర్‌ అవుతుంది. ఇదే విషయం సీఎంకు చెప్పాను. పనిచేయని మెషీన్లు, లోపాలు, ఇతర అంశాలపై ఒక టాస్క్‌ఫోర్స్‌ వేయాలి.
► రాష్ట్రం మొత్తానికి ఒక రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ (ఆర్‌సీసీ), అన్ని జిల్లాలు కవర్‌ అయ్యేలా కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ సెంటర్‌లు (సీసీసీ)లు ఏర్పాటు చేయాలి. వీటిపై ప్రభుత్వానికి రోడ్‌ మ్యాప్‌ ఇచ్చాను.
► 90 శాతం పిల్లల క్యాన్సర్లను అడ్వాన్స్‌ స్టేజ్‌లో నియంత్రించవచ్చు. సీఎం జగన్‌కు ఇదే విషయం చెప్పాను. తిరుపతిలోని పిల్లల కార్డియాక్‌ ఆస్పత్రికి అనుబంధంగా అక్కడే క్యాన్సర్‌ ఆస్పత్రి పెట్టవచ్చని చెప్పా. సీఎం అంగీకరించారు.
► క్యాన్సర్‌ ముదిరిన వాళ్లకి నొప్పి తగ్గించేందుకు ఆర్‌సీసీలో ప్రత్యేక చికిత్స కేంద్రాలు పెట్టాలి. దానికి ప్రత్యేక డిపార్ట్‌మెంట్‌ ఉంది. సాధారణ డాక్టర్లకి ఆ నొప్పిని తగ్గించడం తెలియదు.
► అన్ని క్యాన్సర్లకీ ఒకటే వైద్యం ఉండకూడదు. మహిళల, పురుషుల క్యాన్సర్లకు వేర్వేరు విధానాలు ఉన్నాయి. హైరిస్క్‌ క్యాన్సర్లను గుర్తించాలి. ఏ క్యాన్సర్‌ ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో ఎలా వస్తుంది, ఎన్ని కేసులు వస్తున్నాయో చూడాలి. దానికి ప్రత్యేక విభాగాలు పెట్టి అధ్యయనం చేయించాలి.

క్యాన్సర్‌పై మూడు విభాగాల్లో టాస్క్‌ఫోర్స్‌: డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు
రాష్ట్రంలో క్యాన్సర్‌ నివారణకు పురుషులు, మహిళలు, పిల్లలు ఇలా మూడు విభాగాల్లో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా  క్యాన్సర్‌ నివారణకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై హైదరాబాద్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. టాస్క్‌ఫోర్స్‌ కమిటీల్లో నిపుణులైన వైద్యులు సభ్యులుగా ఉంటారన్నారు. వీరు పురుషులు, మహిళలు, పిల్లల్లో క్యాన్సర్‌ చికిత్స, ప్రారంభ దశలో గుర్తించడం, నివారణ చర్యలపై పర్యవేక్షించడంతో పాటు, సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు.  

డీఎంఈ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై ప్రత్యేక అవగాహన, స్క్రీనింగ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం, వ్యాక్సిన్‌ పంపిణీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ సెక్రటరీ నవీన్‌కుమార్, క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ శ్రీనివాసన్, డాక్టర్‌ సంజయ్‌ సిన్హా, మనీశ్‌ శర్మ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement