కార్యక్రమంలో మాట్లాడుతున్న నోరి దత్తాత్రేయుడు
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌కు ఎన్నో కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా.. భారతీయ రోగుల విషయంలో ఇమ్యునోథెరపీ (రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి కేన్సర్ కణాలను నాశనం చేసేలా చేయడం) ఎక్కువ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ కేన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యాధి బాగా ముదిరినా ఇమ్యునోథెరపీ ద్వారా పరిస్థితిని చక్కదిద్దే అవకాశముందని చెప్పారు.
కేన్సర్‌కు ఒకప్పుడు రేడియేషన్ లేదా కీమోథెరపీ, శస్త్రచికిత్సల ద్వారా చికిత్స చేసేవారని పేర్కొన్నారు. ఐదారేళ్లుగా అమెరికాతో పాటు యూరప్‌లోనూ అందుబాటులో ఉన్న ఇమ్యునోథెరపీకి రేడియేషన్‌ను జోడించడం ద్వారా కొన్ని రకాల కేన్సర్లను దీర్ఘకాలం పాటు రాకుండా చేయొచ్చని వివరించారు. కణితులున్న చోటే రేడియోధార్మికతను అందించడం ద్వారా చేసే బ్రాకియాథెరపీలోనూ కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పుడు బసవతారకం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి వచ్చిందని, ఆరోగ్యకరమైన అవయవాలకు ఇబ్బంది కలగకుండానే మెరుగైన చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ చికిత్సను మరిన్ని ఎక్కువ రకాల కేన్సర్ల చికిత్సకు వాడేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
బ్రెజిల్ వైద్య సమాఖ్యతో భాగస్వామ్యం
కేన్సర్ రోగులకు మరిన్ని ఎక్కువ చికిత్స పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు బ్రెజిల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అసోసియేషన్‌తో కలసి పనిచేయనున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ టి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. హైపెక్ కీమో చికిత్స ద్వారా వివిధ చికిత్సల తర్వాత శరీరంలో మిగిలి ఉండే అతిసూక్ష్మమైన కణితులు, కేన్సర్ కణాలను తొలగించవచ్చన్నారు. ఇమ్యునోథెరపీ వల్ల వచ్చే దుష్పరిణామాల నియం త్రణకు అవసరమైన సాంకేతికత కూడా అందుబాటులో ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment