normal life affected
-
సామాన్యుడి ముసుగులో ఉగ్రదందా!
మనం రోజూ పండ్లు కొనే వ్యక్తి పచి్చనెత్తురు తాగే ఉగ్రవాదని, మనకు రోజూ ఎదురయ్యే ఎంబీఏ నిరుద్యోగి ఎంతకైనా తెగించే టెర్రరిస్టని ఎవరైనా ఊహించగలరా! సరిగ్గా ఈ పాయింటును పట్టుకొని పాక్ ఐఎస్ఐ కుటిల కుట్రకు పాల్పడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతీయ సమాజంలో సాధారణ జీవనం గడపమని పంపింది, అవకాశం చూసి విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసుల పుణ్యమా అని ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. అరెస్టయిన వారంతా కరడు కట్టిన టెర్రరిస్టులమని వారి ఇరుగుపొరుగు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం సాధారణ జీవనం గడుపుతూ సమాజంలో కలిసిపోయారు. అదును చూసి పెట్రేగాలని ఆలోచించారు కానీ చివరకు దొరికిపోయారు. వీరిలో యూపీకి చెందిన జీషన్ ఖమర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. కరోనా లాక్డౌన్ సందర్భంగా భారత్‌కు తిరిగివచ్చి ఖర్జూరాలమ్మే వ్యాపారం ఆరంభించాడు. లక్నోకు చెందిన మొహ్మద్ అమీర్ జావెద్, జీషన్‌కు దగ్గర చుట్టం. జెడ్డాలో చాలా సంవత్సరాలు గడిపాడు. భారత్‌కు వచ్చాక మతబోధకుడి అవతారం ఎత్తాడు. అబూ బకర్ సైతం జెడ్డా నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు. దీయోబంద్లోని ఒక మదర్సాలో చదువుకున్నాడు. కుట్రలో కీలకమైన మూల్‌చంద్ అలియాస్ లాలాకు డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం దందా)తో దగ్గర సంబంధాలున్నాయి. కానీ బయటకు మాత్రం రైతుగా కనిపించేవాడు. ఇక ఒసామా సమీ కుటుంబం డ్రైఫ్రూట్ బిజినెస్‌లో ఉంది. ఇతను చాలాసార్లు మధ్యాసియా దేశాలకు వెళ్లి వచ్చాడు. మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు జలమార్గంలో చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలో నివశిస్తున్న ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. పోలీసులు అరెస్టు చేసేవరకు వీరి గురించి పక్కింటివారికి కూడా తెలియదంటే ఎంత పకడ్బందిగా వ్యవహరించారో అర్ధం అవుతోంది. డీ కంపెనీతో లింకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిర్వహించే ముఠాతో అరెస్టయిన వారికి దగ్గర సంబంధాలున్నాయి. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాగా, దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరవాడు. అంటే వీరికి డీ కంపెనీతో పాటు పాక్ అండదండలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల ప్రకారం సమీర్ పేలుడు పదార్ధాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించాలని ప్లాన్ చేశారు. గతేడాది ముంబై పోలీసులు ఫజుల్ రహమన్ ఖాన్ అలియాస్ ముజ్జుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక వ్యాపారవేత్తను చంపమని వీరికి అనీస్ ఆదేశాలిచ్చాడు. దావూద్ అనుచరుడు ఫహీమ్ మాచ్మచ్కు ముజ్జు సన్నిహితుడు. అతనితో పనిచేసేవారు, కిరాయి హంతకుల గురించిన సమాచారాన్ని పోలీసులు మజ్జు నుంచి రాబట్టారు. ఇతని విచారణలోనే జాన్ మహ్మద్ పేరు బయటపడింది. అప్పటినుంచి ఇతని కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారు. కానీ జాన్ సాధారణ డ్రైవర్‌గా గడుపుతున్నట్లు నటించడంతో ఎలాంటి ఉగ్రకుట్ర గురించి తొలుత బయటపడలేదు. గతనెల ఫహీమ్ మరణించిన తర్వాత అనీస్ ఇతనికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఆరంభించాడు. దీంతో ఇతని గుట్టు రట్టయింది, అప్పటివరకు ముంబైలో స్లీపర్ సెల్‌గా జాన్ పనిచేస్తున్నాడని, గ్యాంగుకు ఆయుధాలు సరఫరా చేసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మొత్తం ఉగ్ర కుట్ర బయటపడింది. యూపీపై కన్ను యూపీలో వరుస పేలుళ్లను జరిపాలని ప్లాన్ చేశారు. ప్రయాగ్ రాజ్‌లో ఒక ఐఈడీ(పేలుడు పదార్ధం)ని టెర్రరిస్టులు అమర్చారని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడ ఈ బాంబు పెట్టారో తెలియకపోవడంతో ఆందోళన అధికమైంది. దీనికితోడు యూపీలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండడంతో సోదాలు నిర్వహించడం, దర్యాప్తు చేయడం ఎంతో కష్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేడితో రాష్ట్రంలో హడావుడి పెరిగింది. ఈ నేపథ్యంలో బాంబున్న ప్రదేశాన్ని కనుగొనడం సముద్రంలో సూదిని వెతికినట్లయింది. దీనికితోడు టెర్రరిస్టులు తప్పించుకోవడానికి అనువుగా నేపాల్ బోర్డర్‌ను ఆనుకొనే యూపీ ఉంది. కానీ ముమ్మర సోదాలు, లోతైన విచారణతో ఎట్టకేలకు బాంబు లొకేషన్ కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. ఆపరేషన్ తొలిదశలోనే ఉగ్రవాదులు పట్టుబడడంతో ఎంతో ప్రాణనష్టాన్ని నివారించినట్లయింది. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే చివరిసారి కాదని, అప్రమత్తతే దేశానికి రక్ష అని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
అతి భారీ వర్షాలు.. హైదరాబాద్ అస్తవ్యస్తం
జంటనగరాలలో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు మౌలాలి ప్రాంతంలో అత్యధికంగా 22.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధి మొత్తం శుక్రవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న నాలాలో నుంచి వర్షం నీరు పొంగి పారుతోంది. అంబర్‌పేట బ్రిడ్జి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. దాంతో అటువైపు రాకపోకలకు బాగా ఇబ్బందిగా మారింది. చాదర్‌ఘాట్ వైపు వాహనాల రాకపోకలను నియంత్రిస్తుండటంతో చాలావరకు బస్సులు, ఇతర వాహనాలు అంబర్‌పేట, గోల్నాక మీదుగా ముషీరాబాద్ వెళ్తున్నాయి. కానీ, ఇప్పుడు అంబర్‌పేట వంతెన కూడా ప్రమాదకరంగా ఉండటంతో కోఠి నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారేలా ఉంది. న్యూ మలక్‌పేట గంజ్ ఎదురుగా గల అక్షయ హోటల్ పక్కన నీరు పెద్దమొత్తంలో నిలిచిపోయింది. దాదాపు వంద మీటర్ల వరకు రోడ్డు బాగా పాడైంది. దాంతో అటువైపుగా వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. మలక్‌పేట ఆర్యూబీ వద్ద కూడా రోడ్డు మీద గుంతలు పడ్డాయి. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నీరు వంతెనకు ఒక అడుగు కిందగా ప్రవహిస్తోంది. వాటర్‌బోర్డు ఎమర్జెన్సీ సెల్ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, మ్యాన్‌హోళ్లతో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో వాటర్‌బోర్డు ఒక ఎమర్జెన్సీ సెల్‌ను ఏర్పాటుచేసింది. ఈ ఎమర్జెన్సీ సెల్ ఫోన్ నెంబరు.. 99899 96948. వర్షాల కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని ఖైరతాబాద్‌లోని వాటర్ బోర్డు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... మౌలాలి - 22 సెం.మీ, మల్కాజిగిరిలో 9, నారాయణగూడలో 8, చిలకలగూడలో 8, అంబర్‌పేటలో 7, చార్మినార్, తిరుమలగిరి, మోండా మార్కెట్, ఉప్పల్, కాప్రాలలో 7 సెంటీమీటర్లు, బాలానగర్‌లో 6, వెస్ట్ మారేడ్‌పల్లిలో 6, అమీర్‌పేటలో 5, మాదాపూర్‌లో 5, బొల్లారంలో 5, ఎల్బీనగర్లో 4, కుత్బుల్లాపూర్‌లో 4, షేక్‌పేటలో 4, కూకట్‌పల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.