అతి భారీ వర్షాలు.. హైదరాబాద్ అస్తవ్యస్తం
జంటనగరాలలో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు మౌలాలి ప్రాంతంలో అత్యధికంగా 22.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధి మొత్తం శుక్రవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న నాలాలో నుంచి వర్షం నీరు పొంగి పారుతోంది. అంబర్‌పేట బ్రిడ్జి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. దాంతో అటువైపు రాకపోకలకు బాగా ఇబ్బందిగా మారింది. చాదర్‌ఘాట్ వైపు వాహనాల రాకపోకలను నియంత్రిస్తుండటంతో చాలావరకు బస్సులు, ఇతర వాహనాలు అంబర్‌పేట, గోల్నాక మీదుగా ముషీరాబాద్ వెళ్తున్నాయి. కానీ, ఇప్పుడు అంబర్‌పేట వంతెన కూడా ప్రమాదకరంగా ఉండటంతో కోఠి నుంచి దిల్‌సుఖ్ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారేలా ఉంది.
న్యూ మలక్‌పేట గంజ్ ఎదురుగా గల అక్షయ హోటల్ పక్కన నీరు పెద్దమొత్తంలో నిలిచిపోయింది. దాదాపు వంద మీటర్ల వరకు రోడ్డు బాగా పాడైంది. దాంతో అటువైపుగా వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. మలక్‌పేట ఆర్‌యూబీ వద్ద కూడా రోడ్డు మీద గుంతలు పడ్డాయి. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నీరు వంతెనకు ఒక అడుగు కిందగా ప్రవహిస్తోంది.
వాటర్‌బోర్డు ఎమర్జెన్సీ సెల్
భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, మ్యాన్‌హోళ్లతో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో వాటర్‌బోర్డు ఒక ఎమర్జెన్సీ సెల్‌ను ఏర్పాటుచేసింది. ఈ ఎమర్జెన్సీ సెల్ ఫోన్ నెంబరు.. 99899 96948. వర్షాల కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని ఖైరతాబాద్‌లోని వాటర్ బోర్డు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి...
మౌలాలి - 22 సెం.మీ, మల్కాజిగిరిలో 9, నారాయణగూడలో 8, చిలకలగూడలో 8, అంబర్‌పేటలో 7, చార్మినార్, తిరుమలగిరి, మోండా మార్కెట్, ఉప్పల్, కాప్రాలలో 7 సెంటీమీటర్లు, బాలానగర్‌లో 6, వెస్ట్ మారేడ్‌పల్లిలో 6, అమీర్‌పేటలో 5, మాదాపూర్‌లో 5, బొల్లారంలో 5, ఎల్బీనగర్‌లో 4, కుత్బుల్లాపూర్‌లో 4, షేక్‌పేటలో 4, కూకట్‌పల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.