అబూ బకర్, జాన్ మహ్మద్ షేక్, ఒసామా, మహ్మద్ అమీర్ జావెద్, జీషన్ ఖమర్, మూల్‌చంద్ (ఎడమ నుంచి కుడికి)
మనం రోజూ పండ్లు కొనే వ్యక్తి పచి్చనెత్తురు తాగే ఉగ్రవాదని, మనకు రోజూ ఎదురయ్యే ఎంబీఏ నిరుద్యోగి ఎంతకైనా తెగించే టెర్రరిస్టని ఎవరైనా ఊహించగలరా! సరిగ్గా ఈ పాయింటును పట్టుకొని పాక్ ఐఎస్‌ఐ కుటిల కుట్రకు పాల్పడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతీయ సమాజంలో సాధారణ జీవనం గడపమని పంపింది, అవకాశం చూసి విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసుల పుణ్యమా అని ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది.
నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. అరెస్టయిన వారంతా కరడు కట్టిన టెర్రరిస్టులమని వారి ఇరుగుపొరుగు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం సాధారణ జీవనం గడుపుతూ సమాజంలో కలిసిపోయారు. అదును చూసి పెట్రేగాలని ఆలోచించారు కానీ చివరకు దొరికిపోయారు.
వీరిలో యూపీకి చెందిన జీషన్ ఖమర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా భారత్‌కు తిరిగివచ్చి ఖర్జూరాలమ్మే వ్యాపారం ఆరంభించాడు. లక్నోకు చెందిన మొహ్మద్ అమీర్ జావెద్, జీషన్‌కు దగ్గర చుట్టం. జెడ్డాలో చాలా సంవత్సరాలు గడిపాడు. భారత్‌కు వచ్చాక మతబోధకుడి అవతారం ఎత్తాడు. అబూ బకర్ సైతం జెడ్డా నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు. దీయోబంద్‌లోని ఒక మదర్సాలో చదువుకున్నాడు.
కుట్రలో కీలకమైన మూల్‌చంద్ అలియాస్ లాలాకు డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం దందా)తో దగ్గర సంబంధాలున్నాయి. కానీ బయటకు మాత్రం రైతుగా కనిపించేవాడు. ఇక ఒసామా సమీ కుటుంబం డ్రైఫ్రూట్ బిజినెస్‌లో ఉంది. ఇతను చాలాసార్లు మధ్యాసియా దేశాలకు వెళ్లి వచ్చాడు. మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు జలమార్గంలో చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలో నివశిస్తున్న ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. పోలీసులు అరెస్టు చేసేవరకు వీరి గురించి పక్కింటివారికి కూడా తెలియదంటే ఎంత పకడ్బందిగా వ్యవహరించారో అర్ధం అవుతోంది.
డీ కంపెనీతో లింకు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిర్వహించే ముఠాతో అరెస్టయిన వారికి దగ్గర సంబంధాలున్నాయి. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్‌ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాగా, దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరవాడు. అంటే వీరికి డీ కంపెనీతో పాటు పాక్ అండదండలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల ప్రకారం సమీర్ పేలుడు పదార్ధాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించాలని ప్లాన్ చేశారు. గతేడాది ముంబై పోలీసులు ఫజుల్ రహమన్ ఖాన్ అలియాస్ ముజ్జుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక వ్యాపారవేత్తను చంపమని వీరికి అనీస్ ఆదేశాలిచ్చాడు.
దావూద్ అనుచరుడు ఫహీమ్ మాచ్‌మచ్‌కు ముజ్జు సన్నిహితుడు. అతనితో పనిచేసేవారు, కిరాయి హంతకుల గురించిన సమాచారాన్ని పోలీసులు మజ్జు నుంచి రాబట్టారు. ఇతని విచారణలోనే జాన్ మహ్మద్ పేరు బయటపడింది. అప్పటినుంచి ఇతని కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారు. కానీ జాన్ సాధారణ డ్రైవర్‌గా గడుపుతున్నట్లు నటించడంతో ఎలాంటి ఉగ్రకుట్ర గురించి తొలుత బయటపడలేదు. గతనెల ఫహీమ్ మరణించిన తర్వాత అనీస్ ఇతనికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఆరంభించాడు. దీంతో ఇతని గుట్టు రట్టయింది, అప్పటివరకు ముంబైలో స్లీపర్ సెల్‌గా జాన్ పనిచేస్తున్నాడని, గ్యాంగుకు ఆయుధాలు సరఫరా చేసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మొత్తం ఉగ్ర కుట్ర బయటపడింది.
యూపీపై కన్ను
యూపీలో వరుస పేలుళ్లను జరిపాలని ప్లాన్ చేశారు. ప్రయాగ్ రాజ్‌లో ఒక ఐఈడీ(పేలుడు పదార్ధం)ని టెర్రరిస్టులు అమర్చారని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడ ఈ బాంబు పెట్టారో తెలియకపోవడంతో ఆందోళన అధికమైంది. దీనికితోడు యూపీలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండడంతో సోదాలు నిర్వహించడం, దర్యాప్తు చేయడం ఎంతో కష్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేడితో రాష్ట్రంలో హడావుడి పెరిగింది.
ఈ నేపథ్యంలో బాంబున్న ప్రదేశాన్ని కనుగొనడం సముద్రంలో సూదిని వెతికినట్లయింది. దీనికితోడు టెర్రరిస్టులు తప్పించుకోవడానికి అనువుగా నేపాల్ బోర్డర్‌ను ఆనుకొనే యూపీ ఉంది. కానీ ముమ్మర సోదాలు, లోతైన విచారణతో ఎట్టకేలకు బాంబు లొకేషన్ కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. ఆపరేషన్ తొలిదశలోనే ఉగ్రవాదులు పట్టుబడడంతో ఎంతో ప్రాణనష్టాన్ని నివారించినట్లయింది. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే చివరిసారి కాదని, అప్రమత్తతే దేశానికి రక్ష అని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
–నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment