North East Delhi
-
BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..
దేశరాజధాని ఢిల్లీలో అందరినీ ఆకర్షిస్తున్న సీటు ఈశాన్య ఢిల్లీ. హ్యట్రిక్‌పై కన్నేసిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై, యువనాయకుడు కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. గత ఎన్నికల్లో బెగుసరాయ్‌లో ఓడిపోయిన కన్హయ్యకుమార్‌ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింపడం చర్చనీయాంశంగా మారింది. 20శాతం ముస్లింలు, 11శాతం ఎస్సీల సమీకరణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్రయోగానికి దిగిందనే చర్చ జరుగుతోంది.ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్‌కు చెందినవారే. ఈ లోక్‌సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్‌తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా, ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువగా ఉంది.ఈ లోక్‌సభ స్థానంలో భజన్‌పురా, బురారీ, తిమర్పూర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకల్‌పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్‌లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3 శాతం షెడ్యూల్డ్ కులాలు, 11.61 శాతం బ్రాహ్మణులు, 20.74 శాతం ముస్లింలు, 4.68 శాతం వైశ్య (బనియా), 4 శాతం పంజాబీ, 7.57 శాతం గుర్జార్ మరియు 21.75 శాతం ఓబీసీ కమ్యూనిటీ వారి వాటాను కలిగి ఉంది.గతంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ 59.03 శాతం ఓట్లతో భారీ ఆధిక్యం సాధించగా బీజేపీకి 33.71 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 నుంచి వరుసగా బీజేపీ విజయకేతనం ఎగరేస్తోంది. 2014లో సినీ నటులు మనోజ్ తివారీకి 45.38 శాతం ఓట్లతో గెలుపొందగా, 2019లో 53.86 శాతం రెండోసారి విజయకేతనం అందుకున్నారు. ఈ సీటులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది.ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్ అయితే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్‌గా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుక్డేతుక్డే గ్యాంగ్ నాయకుడని బీజేపీ.. కన్హయ్య కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి మారేందుకు ఈ ఎన్నిక మనోజ్ తివారీకి కీలకంగా మారనుంది. ఇప్పటికే రెండుసార్లు గెలిచి సత్తా చాటిన తివారీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీకి నాయకుడు లేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడుతున్న పార్టీకి తివారీ సారథ్యం వహించడానికి ఇదొక అవకాశమనే అంచనాలొస్తున్నాయి.ఇటు షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడర్ కరువయ్యారు. కన్హయ్య కుమార్ గనుక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయన కూడా ఢిల్లీ కాంగ్రెస్‌కు ఫ్యూచర్ సీఎం లీడర్‌గా ఎదిగే అవకాశముంది. మరి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో కమలం ఉదయిస్తుందా? హస్త రేఖలు మారతాయా? అన్నది ఓటరు చేతిలో ఉంది. -
‘కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురు మద్దతుదారు’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ మంగళవారం ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ హాట్ కామెంట్లు చేశారు. కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు అని మండిపడ్డారు. మనోజ్ తివారీ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.‘తన ప్రత్యర్థి కన్హయ్య కుమార్‌తో పోటీ ఆసక్తికంగా మారనుంది. కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించటం.. ప్రతిపక్షాల కుట్రను వెల్లడిస్తుంది. ఈశాన్య ఢిల్లీలో కన్హయ్య కుమార్‌ను పోటీ చేయించి కాంగ్రెస్, ఆప్ పార్టీలు వాటి అసలు రంగు బయటపెట్టాయి. ప్రతిపక్షాల అభ్యర్థిపై గతంలో ఉన్న వివాదాలను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలు భద్రత కోరుకుంటాన్నారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎల్లప్పుడు దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటారు.కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు. గతంలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఓటర్లు మర్చిపోతారా?’ అని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు ఇక.. ఈశాన్య ఢిల్లీలో మైనార్జీ జనాభా అధికంగా ఉంటుంది. మరోవైపు.. మనోజ్ కుమార్, కన్హయ్య కుమార్ ఇద్దరూ బిహార్‌కు చెందినవాళ్లే కావటం గమనార్హం.2001 డిసెంబరు 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి దాడి జరిగింది. ఐదుగురు ఉగ్రవాదుల పార్లమెంట్‌లోకి చొరబడి తొమ్మిది మంది భద్రతాసిబ్బందిని బలితీసుకున్నారు. ఆ మరుసటి రోజే దాడికి సూత్రధారి అయిన ఉగ్రవాది అఫ్జల్ గురును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 12ఏళ్లకు అతడు దోషిగా తేలడంతో ఉరితీసిన విషయం తెలిసిందే. -
కన్నయ్య కుమార్ vs మనోజ్ తివారి.. ఎవరి సత్తా ఎంత?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బీహార్ రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించిన కన్నయ్య కుమార్ ఇప్పుడు రాజధాని ఢిల్లీలో తన హవా చాటేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై కన్నయ్య కుమార్ పోటీకి దిగారు. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం యూపీకి ఆనుకుని ఉండటానికి తోడు ఇక్కడ బీహార్, హర్యానాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. బీజేపీ వరుసగా మూడోసారి మనోజ్ తివారీని ఇక్కడ నుండి పోటీకి నిలబెట్టింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. మనోజ్ తివారీ భోజ్‌పురి సినిమా నటుడు కావడంతో అతనికి జనాదరణ అధికంగానే ఉంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అతనికి పోటీగా బీహార్‌కు చెందిన కన్నయ్య కుమార్‌కు అవకాశం కల్పించింది. ఈయనకు యువత మద్దతు ఉంది. 2020 ఢిల్లీ అల్లర్లు ఈశాన్య ప్రాంతంలోనే మొదలయ్యాయి. ఈ ప్రాంతంలోని సీలంపూర్, ముస్తఫాబాద్, బాబర్పూర్, కార్గిల్ నగర్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉంటోంది. దీంతో ఇండియా కూటమి అక్కడి ముస్లిం ఓట్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కన్నయ్య కుమార్ ప్రసంగాలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం. జేఎన్‌యూలో కన్నయ్య కుమార్ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువతలో అతని పాపులారిటీ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు అదే పాపులారిటీని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. మరి ఈశాన్య ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కన్నయ్యను ఆదరిస్తారో, బీజేపీ మనోజ్‌ను అక్కున చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే! -
ఈశాన్య ఢిల్లీ అల్లర్లు.. మృతులు 45
న్యూఢిల్లీ: వారం క్రితం అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే, సోమవారం అల్లర్లు జరిగిన ప్రాంతంలో మరో నాలుగు మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 45కు చేరుకుందని అధికారులు తెలిపారు. అల్లర్ల కారణంగా వాయిదాపడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను సోమవారం పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించారు. 98 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింప జేస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి సాయం అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారంగా అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు. అల్లర్లపై రేపు సుప్రీం విచారణ ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పిటిషన్లపై 4న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. రాజకీయ నాయకులు, ఇతరుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగాయని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీనిపై పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘అల్లర్ల కారణంగా ప్రజలు చనిపోతుంటే వాయిదా ఎలా వేయగలరు ?’ అంటూ పిటిషన్‌దారుల తరఫున లాయర్ కోలిన్ గొంజాల్వెజ్ సుప్రీంకోర్టును అడిగారు. అయితే అల్లర్లను నియంత్రించడం తమ పని కాదని, దానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. బుధవారం విచారణ జరుపుతామని తెలిపింది. -
చావబాది.. జాతీయగీతం పాడాలంటూ..
-
పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..
న్యూఢిల్లీ: వారం ప్రారంభంలో అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీ క్రమంగా తేరుకుంటోంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు శుక్రవారం ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి, నిత్యావసరాలను కొనుగోలు చేశారు. వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు విధులకు వెళ్లడం ప్రారంభించారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా భద్రతాదళాలు అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘాను పెట్టాయి. మసీదుల్లో మౌల్వీలు శాంతి సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వదంతులకు, తప్పుడు వార్తలకు స్పందించవద్దని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు ప్రకటించారు. అయితే, చెత్త, వ్యర్థ వస్తువులను ఏరుకునేందుకు శుక్రవారం ఉదయం బయటకు వెళ్లిన తన తండ్రి తలపై గాయాలతో చనిపోయారని సల్మాన్ అన్సారీ అనే వ్యక్తి తెలిపారు. ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలు ఈశాన్య ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ బైజాల్ సీనియర్ పోలీసు అధికారులతో కలిసి మౌజ్‌పూర్, జఫ్రాబాద్, గోకుల్పురిల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. దాదాపు 630 మందిని అరెస్ట్ చేయడమో లేక అదుపులోకి తీసుకోవడమో చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు 7 వేల మంది పారా మిలటరీ దళాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య శుక్రవారానికి 42కి చేరింది. వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం నలుగురు చనిపోయారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 9 ప్రాంతాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 25 వేల చొప్పున అందజేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఐపీఎస్ శ్రీవాస్తవకు అదనపు బాధ్యతలు అల్లర్ల సమయంలో శాంతి భద్రతల విభాగం స్పెషల్ కమిషనర్‌గా నియమితుడైన ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవకు శుక్రవారం అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆదివారం నుంచి ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా విధులు చేపట్టనున్నారు. అల్లర్లను గుర్తించడంలో, అరికట్టడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొన్న ప్రస్తుత కమిషనర్ అమూల్య పట్నాయక్ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ‘ప్రజల్లో భద్రతా భావాన్ని, మా కోసం పోలీసులున్నారనే ధైర్యాన్ని పాదుకొల్పడమే ప్రస్తుతం నా ప్రధాన బాధ్యత’ అని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో 331 శాంతి సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ కమిటీ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఐదుగురితో కూడిన కమిటీని శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ పైనుంచి దూకేశాం ‘బుధవారం రాత్రి ఇంట్లో ఉండగా, అకస్మాత్తుగా ఒక గుంపు మా ఇంట్లోకి జొరబడింది. నన్ను, నా ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించడం ప్రారంభించారు. భయంతో దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశాం’ అని ఒక బాధిత మహిళ తెలిపింది. ఆమె ఒక ఎన్జీవోను నిర్వహిస్తున్నారు. ‘గాంధీ’లపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి! అల్లర్ల తర్వాత తండ్రి ఆచూకీ తెలీకపోవడంతో తల్లితో కలసి ఢిల్లీలో ఓ ఆస్పత్రి మార్చురీ బయట వేచి ఉన్న బాలిక విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక వాద్రాలపై కేసులను నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, అమానతుల్లా ఖాన్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌లపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ‘లాయర్స్ వాయిస్’ సంస్థ తమ పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారించింది. విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్లలో తాము భాగస్వాములమవుతామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది. సీబీఎస్సీ పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ప్రతిపక్షాల వల్లే అల్లర్లు: అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన దుష్ప్రచారమే ఢిల్లీలో మత ఘర్షణలకు దారితీసిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. భువనేశ్వర్‌లో జరిగిన ర్యాలీలో శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ.. ‘సీఏఏ అమలుతో ముస్లింలు దేశ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం సాగించాయి. ప్రజలను రెచ్చగొట్టడం గొడవలకు దారితీసింది’ అని అన్నారు. సీఏఏతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు. పైపెచ్చు దీనితో మరికొందరికి పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం చారిత్రక నిర్ణయం. అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, మమతా దీదీ అబద్ధాలు ప్రచారం చేశారు’ అని ఆరోపించారు. రెచ్చగొట్టిన వారిపై చర్యలు తీసుకోండి: విపక్షాల లేఖ ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతవాతావరణం నెలకొనేలా యంత్రాంగాన్ని ఆదేశించాలని, విద్వేషాలను ప్రేరేపించేలా ప్రసంగించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసేతర ప్రతిపక్షాల నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన వారి కోసం సహాయ శిబిరాలను ప్రారంభించాలని, రక్షణ కల్పించడంతోపాటు నిత్యావసర సరుకులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పరిస్థితులపై చర్చించేందుకు తమకు సమయమివ్వాలని వారు రాష్ట్రపతిని కోరారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, లోక్తాంత్రిక్ జనతా దళ్‌కు చెందిన శరద్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్, ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి టీఆర్ బాలు, సీపీఐ నేత డి.రాజా, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మనోజ్ ఝా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఆ లేఖపై సంతకాలు చేశారు. ఢిల్లీ అల్లర్లను ప్రస్తావించా: మమతా ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్(ఈజెడ్‌సీ) సమావేశంలో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని ప్రస్తావించినట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన ఈజెడ్‌సీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ సమావేశంలో సీఏఏ, ఎన్నార్సీల ప్రస్తావన రాలేదు. అవి సమావేశం ఎజెండాలో లేవు. ఢిల్లీలో ఘర్షణలను మాత్రం నేను ప్రస్తావించా. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు మరింత విషమించకుండా చర్యలు తీసుకోవాలని, బాధితులకు పరిహారం అందించాలని కోరా’ అని తెలిపారు. పేరు అడిగి.. కొట్టి చంపారు! ఉదయం చెత్త ఏరేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి తీవ్ర గాయాలతో తిరిగివచ్చి, అనంతరం చనిపోయిన ఘటన శుక్రవారం ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకుంది. అయూబ్ షబ్బీర్ ఢిల్లీ శివార్లలోని గజియాబాద్‌లోని నస్బంది కాలనీవాసి. రోజూ చెత్త, ఇతర వ్యర్థ వస్తువులు ఏరుకుని, వాటిని అమ్మి జీవనం సాగిస్తుంటారు. ఆయన శుక్రవారం ఉదయం చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లాడని, సాయంత్రం కొందరు ఆయనను తలపై తీవ్ర గాయాలతో తీసుకువచ్చారని ఆయన కుమారుడు సల్మాన్ తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మరణించాడన్నారు. ‘వెళ్లొద్దని చెప్పాను. అయినా వినలేదు. పరిస్థితులు బాగానే ఉన్నాయి. సంపాదన లేకుండా ఎంతకాలం ఉంటాం? అని చెప్పి ఉదయమే బయటకు వెళ్లాడు’ అని సల్మాన్ వివరించాడు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో కొందరు పేరు, మతం అడిగి, ఆ తరువాత దారుణంగా కొట్టారని తన తండ్రి తనకు చెప్పాడని సల్మాన్ వివరించాడు. పోలీసులకు సమాచారమిచ్చానని, అయినా, వారు తన తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సహకరించలేదని చెప్పారు. తాను దివ్యాంగుడినని, తండ్రి తప్ప తనకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
ఈశాన్య ఢిల్లీలో కేజ్రీవాల్ రోడ్ షో
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం నార్త్ ఈస్ట్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ ఆప్ అభ్యర్థి ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్‌తోపాటు ఓపెన్‌టాప్ జిప్సీ వాహనంలో ప్రయాణించారు. ఉదయం యమునా విహార్‌లో ప్రారంభమైన రోడ్ షో మధ్యాహ్నం పూసారోడ్డు వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యల గురించి మాట్లాడడంతోపాటు తాను వారణాసి నుంచి పోటీ చేయడానికి గల కారణాలను వివరించారు. వారణాసిలో నరేంద్ర మోడీని తాను ఓడించాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడడానికి తాను ఇక్కడే ఉన్నానని ఆయన చెప్పారు. ‘గ్యాస్ ధర పెంచడానికి అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌కు అనుమతిస్తే పేదలపై భారం పడుతుంది కాబట్టే ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాను. బీజేపీ, కాంగ్రెస్ అంబానీ మద్దతుదారులు కాబట్టే ఆప్ ప్రభుత్వాన్ని కూలగొట్టాయి. గ్యాస్ ధరల పెంపునకు కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, మాజీమంత్రి మిలింద్ దేవరా, అంబానీ కుట్రపన్నారు. అందుకే వారిపై ఎఫ్ఐఆర్ నమోదుకు సీఎం హోదాలో ఆదేశించాను’ అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. ఈ రోడ్డు షోకు పలువురు గృహిణులు, వీధి వ్యాపారులు, కూలీలు, వ్యాపారులు, వయోధికులు, యువతులు హాజరయ్యారు. కొందరు మహిళలు కేజ్రీవాల్‌కు హారతులు పట్టారు.