ఈశాన్య ఢిల్లీలో కేజ్రీవాల్ రోడ్ షో
Published Fri, Apr 4 2014 12:16 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం నార్త్ ఈస్ట్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ ఆప్ అభ్యర్థి ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్‌తోపాటు ఓపెన్‌టాప్ జిప్సీ వాహనంలో ప్రయాణించారు. ఉదయం యమునా విహార్‌లో ప్రారంభమైన రోడ్ షో మధ్యాహ్నం పూసారోడ్డు వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యల గురించి మాట్లాడడంతోపాటు తాను వారణాసి నుంచి పోటీ చేయడానికి గల కారణాలను వివరించారు. వారణాసిలో నరేంద్ర మోడీని తాను ఓడించాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడడానికి తాను ఇక్కడే ఉన్నానని ఆయన చెప్పారు. ‘గ్యాస్ ధర పెంచడానికి అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌కు అనుమతిస్తే పేదలపై భారం పడుతుంది కాబట్టే ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాను. బీజేపీ, కాంగ్రెస్ అంబానీ మద్దతుదారులు కాబట్టే ఆప్ ప్రభుత్వాన్ని కూలగొట్టాయి. గ్యాస్ ధరల పెంపునకు కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, మాజీమంత్రి మిలింద్ దేవరా, అంబానీ కుట్రపన్నారు. అందుకే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు సీఎం హోదాలో ఆదేశించాను’ అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. ఈ రోడ్డు షోకు పలువురు గృహిణులు, వీధి వ్యాపారులు, కూలీలు, వ్యాపారులు, వయోధికులు, యువతులు హాజరయ్యారు. కొందరు మహిళలు కేజ్రీవాల్‌కు హారతులు పట్టారు.
Advertisement
Advertisement