వారణాసిలో కేజ్రీపై రాళ్లు
పలు చోట్ల ఘెరావ్
వారణాసి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై వారణాసిలో మళ్లీ దాడి జరిగింది. గురువారం రాత్రి ఆయనపై పదిమందికిపైగా యువకులు రాళ్లు, ఇటుకపెళ్లలు విసిరారు. ‘హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ’ అంటూ నినాదాలు చేశారు. అయితే దాడిలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదు. పోలీసులు దుండగులను చెదరగొట్టారు. వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న కేజ్రీవాల్ బెనారస్ హిందూ వర్సిటీ దగ్గర్లోని కేశవ్ పాన్ షాపు వద్ద ప్రచారం చేస్తుండగా ఈ ఉదంతం చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. ఈ షాపు.. వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరచనున్న కేశవ్ చౌరాసియాది కావడం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శుక్రవారం కూడా వారణాసిలో కేజ్రీవాల్‌ను, ఆప్ నేతలను నిరసనకారులు ఘెరావ్ చేసి, ‘హర్ హర్ మోడీ’ అని నినదించారు. కేజ్రీవాల్ ప్రచారాన్ని బీజేపీ అడ్డుకుంటోందని, దానిపై చర్యలు తీసుకోవాలని ఆప్ ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనికి బీజేపీ స్పందిస్తూ.. కేజ్రీవాల్ నాటకాలాడుతున్నారని, కావాలంటే ఆయనకు తామే రక్షణ కల్పిస్తామంది. తాను బడా స్వార్థపరులతో ఢీకొం టున్నందున ఇలాంటి నిరసనలు అసాధారణమేమీ కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరసనకారులు దారితప్పిన యువకులని, వారు తనతో చర్చకు ముందుకు రావాలన్నారు. కాగా, కేజ్రీవాల్‌కు భద్రతపెంచాలని వారణాసి పోలీసులు నిర్ణయించారు.