North East Railway
-
రైళ్లను వదిలేసి వెళ్లిపోయిన లోకోపైలట్లు.. ప్రయాణికులకు గంటలకొద్దీ నరకం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని బుర్వాల్ జంక్షన్లో బుధవారం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆగిపోయాయి. తమ డ్యూటీ అయిపోయిందని ఒక లోకోపైలట్, ఒంట్లో నలతగా ఉందని మరో లోకోపైలట్ రైళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రెండు రైళ్లలోని సుమారు 2,500 మంది ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చేశారు. రైలు లోపల నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. రైలు పట్టాల మీదకు వచ్చి ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ఫేర్ ఛత్ పూజ స్పెషల్ (04021), బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (15203) రైళ్లలో ఈ సంఘటన జరిగింది. కొన్ని గంటల తర్వాత పరిస్థితిని శాంతింపజేయడానికి ఈశాన్య రైల్వే ఆగిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గోండా జంక్షన్ నుంచి సిబ్బందిని పంపించింది. రైల్వే ప్రకారం.. సహర్సా నుంచి నవంబర్ 27న రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సిన సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్ నవంబరు 28న ఉదయం 9.30 గంటలకు బయలుదేరింది. దీంతో ఈ రైలు 19 గంటలు ఆలస్యంగా గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు బుర్వాల్ జంక్షన్లో హాల్ట్ లేదు, కానీ మధ్యాహ్నం 1:15 గంటలకు షెడ్యూల్ లేకుండా ఆగింది. మరో రైలు బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ అప్పటికే 5.30 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 4.04 గంటలకు ఈ ట్రైన్ బుర్వాల్ జంక్షన్‌కు చేరుకుంది. ఇక్కడే ఈ రైలు సిబ్బంది కూడా వెళ్లిపోయారు. 25 గంటల 20 నిమిషాల్లో తమ ప్రయాణం ముగియాల్సి ఉండగా రైలు ఆలస్యం కారణంగా మూడో రోజూ రైలులోనే గడపాల్సి వచ్చిందని సహర్సా నుంచి తన బంధువులతో కలిసి న్యూఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు వాపోయారు. నిద్రమత్తు కారణంగా లోకో పైలట్లు, రైలు గార్డ్ రైలు వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. రైల్లో నీరు, ఆహారం కోసం ప్యాంట్రీ కారు లేదని, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవులు!
చెన్నై: కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కేరళలో ఈ రెండు రోజులు(బుధ, గురువారాలు) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు.. తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కేరళ, తమిళనాడులో గత నాలుగు రోజులుగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెం.మీ, 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా జనం అవస్థలు పడుతున్నాయి. కాలనీల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
50 జతల రైళ్లు అదనంగా నడిపే యోచనలో ఈ.కో. రైల్వే తాకిడిని బట్టి మరికొన్ని... పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్ ? ప్లాట్‌ఫాంలపై అదనపు సహాయక, విచారణ కేంద్రాలు సివిల్ డిఫెన్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్కి అదనపు సిబ్బంది గోదావరి పుష్కరాలతో పోలిస్తే.. ప్రయాణికుల సంఖ్య తగ్గొచ్చని అంచనా... తాటిచెట్ల పాలెం(విశాఖ) : పవిత్ర కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు కూతపెట్టనున్నాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకూ జరిగే ఈ పుష్కరాలకు 50 జతల రైళ్లు నడిపే యోచనలో ఈస్టుకోస్టు రైల్వే కార్యాచరణను సిద్ధం చేస్తోంది. విశాఖ నుంచి ఇటు భువనేశ్వర్, అటు విజయవాడ మీదుగా ప్రస్తుతం 97 జతల రైళ్లు నడుస్తుండగా, అందులో 37 రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీలేని సమయాల్లో నిత్యం 5 వేలు, పండగ సమయాల్లో 15 నుంచి 20 వేల మంది విజయవాడ వైపు ప్రయాణం సాగిస్తున్నారు. పుష్కరాల సమయంలో ఆ సంఖ్య 40 వేలకు చేరే అవకాశాలున్నందున ప్రత్యేక రైళ్ల విషయంలో రైల్వే అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరి పుష్కరాల ఆదాయం: రూ.5.2 కోట్లు గతేడాది జూలైలో జరిగిన గోదావరి మహా పుష్కరాలకు విశాఖ మీదుగా పరుగుతీసిన 168 రైళ్లలో 6.1 లక్షల మంది ప్రయాణం సాగించగా ఈ.కో.రైల్వేకు రూ.5.2 కోట్ల ఆదాయం వచ్చింది. కృషా ్ణపుష్కరాల విషయంలో ఆ ఆదాయం తగ్గేసూచనలు ఉన్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. పుష్కర సమయంలో టికెట్ ధరపై మేళా చార్జీని 5 శాతం అదనంగా కలుపుతారు. గోదావరి వర్సెస్ కృష్ణా! రాజమండ్రి స్టేషన్లో మొత్తం 5 ప్లాట్‌ఫాంలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు నుంచి వెళ్లే రైళ్లు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవ్వడానికి 2 గంటల అదనపు సమయం పట్టేది. విజయవాడలో మొత్తం 10 ప్లాట్‌ఫాంలున్నాయి కనుక.. విశాఖ నుంచి వెళ్లే రైళ్లు త్వరితగతిన తిరిగివచ్చే సూచనలున్నాయి. రైళ్లరాక పోకల విషయంలో ఇబ్బందులెదురయ్యే అవకాశమే ఉండదని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్? ఇప్పటికే విశాఖ రైల్వేస్టేషన్లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న డబుల్ డెక్కర్ కృష్ణా పుష్కరాలకు పట్టాలెక్కే సూచనలు కన్పిస్తున్నాయి. రైల్వే బోర్డు అనుమతే తరువాయి.. టికెట్ధర దాదాపు ఖరారైనట్టు కనిపిస్తోంది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్‌కార్ టికెట్ ధర రూ.535 కాగా, డబుల్ డెక్కర్ రైలుకూ అదే ఫేర్ ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. పుష్కర ఏర్పాట్లు ఇవీ... 1, 8 నంబరు ప్లాట్‌ఫాంలపై అదనంగా 5 చొప్పున సహాయక్ బూత్, ఎంక్వైరీ, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.సివిల్ డిఫెన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రయాణికులకు గైడ్ చేయనున్నారు. పలు డివిజన్ల నుంచి కమర్షియల్ సిబ్బందితోపాటు, ఆర్పీఎఫ్, జీఆర్పీ అదనపు సిబ్బందిని నియమించనున్నారు.టోల్ ఫ్రీ నంబర్లతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఫ్లెక్సీల రూపంలో 139, 138, 183 నంబర్ల సహాయక అవసరాలను ప్రదర్శించనున్నారు.