కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
50 జతల రైళ్లు అదనంగా నడిపే యోచనలో ఈ.కో. రైల్వే
తాకిడిని బట్టి మరికొన్ని... పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్ ?
ప్లాట్‌ఫాంలపై అదనపు సహాయక, విచారణ కేంద్రాలు
సివిల్ డిఫెన్స్, జీఆర్పీ, ఆర్‌పీఎఫ్‌కి అదనపు సిబ్బంది
గోదావరి పుష్కరాలతో పోలిస్తే.. ప్రయాణికుల సంఖ్య తగ్గొచ్చని అంచనా...
తాటిచెట్ల పాలెం(విశాఖ) : పవిత్ర కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు కూతపెట్టనున్నాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకూ జరిగే ఈ పుష్కరాలకు 50 జతల రైళ్లు నడిపే యోచనలో ఈస్టుకోస్టు రైల్వే కార్యాచరణను సిద్ధం చేస్తోంది. విశాఖ నుంచి ఇటు భువనేశ్వర్, అటు విజయవాడ మీదుగా ప్రస్తుతం 97 జతల రైళ్లు నడుస్తుండగా, అందులో 37 రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీలేని సమయాల్లో నిత్యం 5 వేలు, పండగ సమయాల్లో 15 నుంచి 20 వేల మంది విజయవాడ వైపు ప్రయాణం సాగిస్తున్నారు. పుష్కరాల సమయంలో ఆ సంఖ్య 40 వేలకు చేరే అవకాశాలున్నందున ప్రత్యేక రైళ్ల విషయంలో రైల్వే అధికారులు సమాయత్తమవుతున్నారు.
గోదావరి పుష్కరాల ఆదాయం: రూ.5.2 కోట్లు
గతేడాది జూలైలో జరిగిన గోదావరి మహా పుష్కరాలకు విశాఖ మీదుగా పరుగుతీసిన 168 రైళ్లలో 6.1 లక్షల మంది ప్రయాణం సాగించగా ఈ.కో.రైల్వేకు రూ.5.2 కోట్ల ఆదాయం వచ్చింది. కృషా ్ణపుష్కరాల విషయంలో ఆ ఆదాయం తగ్గేసూచనలు ఉన్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. పుష్కర సమయంలో టికెట్ ధరపై మేళా చార్జీని 5 శాతం అదనంగా కలుపుతారు.
గోదావరి వర్సెస్ కృష్ణా!
రాజమండ్రి స్టేషన్లో మొత్తం 5 ప్లాట్‌ఫాంలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు నుంచి వెళ్లే రైళ్లు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవ్వడానికి 2 గంటల అదనపు సమయం పట్టేది. విజయవాడలో మొత్తం 10 ప్లాట్‌ఫాంలున్నాయి కనుక.. విశాఖ నుంచి వెళ్లే రైళ్లు త్వరితగతిన తిరిగివచ్చే సూచనలున్నాయి. రైళ్లరాక పోకల విషయంలో ఇబ్బందులెదురయ్యే అవకాశమే ఉండదని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్?
ఇప్పటికే విశాఖ రైల్వేస్టేషన్‌లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న డబుల్ డెక్కర్ కృష్ణా పుష్కరాలకు పట్టాలెక్కే సూచనలు కన్పిస్తున్నాయి. రైల్వే బోర్డు అనుమతే తరువాయి.. టికెట్‌ధర దాదాపు ఖరారైనట్టు కనిపిస్తోంది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్‌కార్ టికెట్ ధర రూ.535 కాగా, డబుల్ డెక్కర్ రైలుకూ అదే ఫేర్ ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
పుష్కర ఏర్పాట్లు ఇవీ...
1, 8 నంబరు ప్లాట్‌ఫాంలపై అదనంగా 5 చొప్పున సహాయక్ బూత్, ఎంక్వైరీ, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.సివిల్ డిఫెన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రయాణికులకు గైడ్ చేయనున్నారు. పలు డివిజన్ల నుంచి కమర్షియల్ సిబ్బందితోపాటు, ఆర్‌పీఎఫ్, జీఆర్పీ అదనపు సిబ్బందిని నియమించనున్నారు.టోల్ ఫ్రీ నంబర్లతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఫ్లెక్సీల రూపంలో 139, 138, 183 నంబర్ల సహాయక అవసరాలను ప్రదర్శించనున్నారు.