
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని బుర్వాల్ జంక్షన్‌లో బుధవారం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆగిపోయాయి. తమ డ్యూటీ అయిపోయిందని ఒక లోకోపైలట్, ఒంట్లో నలతగా ఉందని మరో లోకోపైలట్ రైళ్లను వదిలేసి వెళ్లిపోయారు.
దీంతో రెండు రైళ్లలోని సుమారు 2,500 మంది ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చేశారు. రైలు లోపల నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. రైలు పట్టాల మీదకు వచ్చి ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ఫేర్ ఛత్ పూజ స్పెషల్ (04021), బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (15203) రైళ్లలో ఈ సంఘటన జరిగింది. కొన్ని గంటల తర్వాత పరిస్థితిని శాంతింపజేయడానికి ఈశాన్య రైల్వే ఆగిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గోండా జంక్షన్ నుంచి సిబ్బందిని పంపించింది.
రైల్వే ప్రకారం.. సహర్సా నుంచి నవంబర్ 27న రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సిన సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్ నవంబరు 28న ఉదయం 9.30 గంటలకు బయలుదేరింది. దీంతో ఈ రైలు 19 గంటలు ఆలస్యంగా గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు బుర్వాల్ జంక్షన్‌లో హాల్ట్ లేదు, కానీ మధ్యాహ్నం 1:15 గంటలకు షెడ్యూల్ లేకుండా ఆగింది.
మరో రైలు బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ అప్పటికే 5.30 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 4.04 గంటలకు ఈ ట్రైన్ బుర్వాల్ జంక్షన్‌కు చేరుకుంది. ఇక్కడే ఈ రైలు సిబ్బంది కూడా వెళ్లిపోయారు.
25 గంటల 20 నిమిషాల్లో తమ ప్రయాణం ముగియాల్సి ఉండగా రైలు ఆలస్యం కారణంగా మూడో రోజూ రైలులోనే గడపాల్సి వచ్చిందని సహర్సా నుంచి తన బంధువులతో కలిసి న్యూఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు వాపోయారు. నిద్రమత్తు కారణంగా లోకో పైలట్లు, రైలు గార్డ్ రైలు వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. రైల్లో నీరు, ఆహారం కోసం ప్యాంట్రీ కారు లేదని, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment