trains stopped
-
రైళ్లను వదిలేసి వెళ్లిపోయిన లోకోపైలట్లు.. ప్రయాణికులకు గంటలకొద్దీ నరకం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని బుర్వాల్ జంక్షన్లో బుధవారం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆగిపోయాయి. తమ డ్యూటీ అయిపోయిందని ఒక లోకోపైలట్, ఒంట్లో నలతగా ఉందని మరో లోకోపైలట్ రైళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రెండు రైళ్లలోని సుమారు 2,500 మంది ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చేశారు. రైలు లోపల నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. రైలు పట్టాల మీదకు వచ్చి ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ఫేర్ ఛత్ పూజ స్పెషల్ (04021), బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (15203) రైళ్లలో ఈ సంఘటన జరిగింది. కొన్ని గంటల తర్వాత పరిస్థితిని శాంతింపజేయడానికి ఈశాన్య రైల్వే ఆగిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గోండా జంక్షన్ నుంచి సిబ్బందిని పంపించింది. రైల్వే ప్రకారం.. సహర్సా నుంచి నవంబర్ 27న రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సిన సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్ నవంబరు 28న ఉదయం 9.30 గంటలకు బయలుదేరింది. దీంతో ఈ రైలు 19 గంటలు ఆలస్యంగా గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు బుర్వాల్ జంక్షన్లో హాల్ట్ లేదు, కానీ మధ్యాహ్నం 1:15 గంటలకు షెడ్యూల్ లేకుండా ఆగింది. మరో రైలు బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ అప్పటికే 5.30 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 4.04 గంటలకు ఈ ట్రైన్ బుర్వాల్ జంక్షన్‌కు చేరుకుంది. ఇక్కడే ఈ రైలు సిబ్బంది కూడా వెళ్లిపోయారు. 25 గంటల 20 నిమిషాల్లో తమ ప్రయాణం ముగియాల్సి ఉండగా రైలు ఆలస్యం కారణంగా మూడో రోజూ రైలులోనే గడపాల్సి వచ్చిందని సహర్సా నుంచి తన బంధువులతో కలిసి న్యూఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు వాపోయారు. నిద్రమత్తు కారణంగా లోకో పైలట్లు, రైలు గార్డ్ రైలు వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. రైల్లో నీరు, ఆహారం కోసం ప్యాంట్రీ కారు లేదని, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడినట్లు ఆయన పేర్కొన్నారు. -
రైళ్లను ఆపిన నత్త!
టోక్యో : సాంకేతికతకు, సమయపాలనకు చిరునామా జపాన్. ముఖ్యంగా ఇక్కడి రైళ్లు, బస్సులు ఒకటేమిటి ప్రభుత్వ రవాణా వ్యవస్థ మొత్తం సమయానికి అనుగుణంగా నడవాల్సిందే. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే సంబంధిత రవాణా వ్యవస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సందర్భాలు సైతం బోలెడు. అలాంటి దేశంలో అనేక రైళ్లు ఎక్కడికక్కడ నిల్చిపోయాయి. దాదాపు 12వేల మంది తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ఇంతకీ అన్ని రైళ్లను ఆపింది ఏంటో తెలుసా.. ఓ నత్త!. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దక్షిణ జపాన్‌లోని క్యూషూ రైల్వే కార్పొరేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. మే 30న అనుకోకుండా రైల్వే వ్యవస్థలో ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కారణమేంటా అని వెతికిన అధికారులు ఎంతో శ్రమ తరవాత చివరకు రైల్వే ట్రాక్‌లకు సమీపంలోని ఓ విద్యుత్తు బాక్స్‌లో నత్త చనిపోయి ఉండడం గమనించారు. అది విద్యుత్ తీగల మధ్యకు వెళ్లడం వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రైళ్లన్నీ స్తంభించిపోయాయి. -
నిలిచిపోయిన పల్నాడు రైలు.. ప్యాసింజర్స్ అవస్థలు
గుంటూరు: సాంకేతిక లోపం తలెత్తడంతో పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పల్నాడు నిలిచిపోవడంతో ఆ మార్గంలో వెళ్లవలసిన పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా రైలు కదలకపోవడంతో గమ్యస్థానాలకు ఆలస్యం అవుతుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఎక్స్ ప్రెస్ రైలు ఆగిపోయిన ప్రాంతానికి చేరుకున్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. -
దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. పలు రైళ్ల నిలిపివేత
తాటిచెట్లపాలెం (విశాఖ): విశాఖ నగరం సమీపంలోని గోపాలపట్నం వద్ద మంగళవారం తెల్లవారుజామున పలు రైళ్లు నిలిచిపోయాయి. క్రాసింగ్‌లో ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మెరాయించింది. దాంతో విశాఖకు వచ్చే నరసాపురం ప్యాసింజర్ రైలు, గోదావరి, ఫలక్‌నుమా, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు సుమారు రెండు గంటల మేర గోపాలపట్నం వద్దే నిలిచిపోయాయి. ఉదయం 7.30 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ సిబ్బంది రంగంలోకి దిగి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సమస్యను సరిచేయడంతో రైళ్లు ముందుకు కదిలాయి. -
పనులతో ఆగిన రైళ్లు..నిలిచిన ట్రాఫిక్
దేవరకద్ర(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర రైల్వే గేటు వద్ద కొనసాగుతున్న ఆర్వోబీ పనులతో మంగళవారం రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. క్రేన్లు తిరగడానికి తరచూ గేటు వేయడం వల్ల అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి. ట్రాక్‌కు రెండు వైపులా పిల్లర్ల నిర్మాణం పూర్తి కావడంతో వాటిపైకి ఇనుప దిమ్మెలను చేర్చడానికి భారీ క్రేన్లను రప్పించారు. వాటిని గేటు మధ్యలో ట్రాక్‌పై నిలపడంత్లో రైళ్ల రాకపోకలను నాలుగు గంటల పాటు ఆపేశారు. కర్నూలు, కాచిగూడల వైపు వెళ్లే రైళ్లను మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తిగా నిలిపి వేశారు. అలాగే, గంట పాటు గేటు వేసి క్రేన్లతో స్టీల్ దిమ్మెలను పిల్లర్ల పైకి చేర్చారు. తరువాత ట్రాఫిక్‌ను మధ్య మధ్యలో క్లియర్ చేస్త్తూ పనులు కొనసాగించారు. సాయంత్రం 4 గంటల వరకు పనులు కొనసాగాయి. తరువాత రైళ్ల రాక పోకలను కొనసాగించారు. ఆర్వోబీ పనుల సందర్భంగా గేటును మధ్య మధ్యలో గంట, అరగంట వేయడం వల్ల ట్రాఫిక్ నిలిచి పోయింది. పనులు జరుగుతున్న సమయంలో పోలీసు బందోబస్తు చేశారు. అలాగే, గేటు దగ్గరకు వాహనాలు రాకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. -
విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల నిలిపివేత
కావలి: నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. చెన్నై ఎక్స్ ప్రెస్ ను గూడూరులో నిలిపివేశారు. సర్కార్, తిరుమల, నారాయణాద్రి, జీటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యుత్ లైన్లను పునరుద్ధరించేవరకు రైళ్ల రాకపోకలు సాగే అవకాశం కనిపించడంలేదు. అసలే సంక్రాంతి సీజన్ కావడంతో రైళ్లన్నీ కిక్కిరిసి ఉంటున్నాయి. ఈ సమయంలో ఇలా జరగడంతో పిల్లా పాపలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.