బెంగళూరుకు షాక్
చెన్నై: పీబీఎల్‌లో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అసాధారణ ఆటతీరు కనబరిచిన బెంగళూరు బ్లాస్టర్స్‌కు నార్త్ ఈస్టర్న్ వారియర్స్ షాకిచ్చింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ మూడో సీజన్లో శుక్రవారం జరిగిన పోరులో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 3–2తో బ్లాస్టర్స్‌ను కంగుతినిపించింది. రెండు ట్రంప్ మ్యాచ్‌ల విజయంతో వారియర్స్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. టోర్నీలో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత బోణీకొట్టింది. మొదట పురుషుల డబుల్స్‌లో మథియాస్ బోయె–కిమ్ సా రంగ్ (బ్లాస్టర్స్) ద్వయం 15–12, 7–15, 15–12తో కిమ్ జి జంగ్–షిన్ బెక్ చియోల్ (వారియర్స్) జోడీపై గెలిచి బెంగళూరుకు శుభారంభాన్నిచ్చింది. అయితే పురుషుల సింగిల్స్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కోలుకోలేకపోయింది. అజయ్ జయరామ్ (వారియర్స్) 15–8, 15–13తో చోంగ్ వీ ఫెంగ్ (బ్లాస్టర్స్)ను కంగుతినిపించాడు. దీంతో 1–0తో ఉన్న బెంగళూరు 0–1 స్కోరుతో వెనుకబడింది.
తర్వాత మహిళల సింగిల్స్ నార్త్ ఈస్టర్న్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో మిచెల్లీ లీ (వారియర్స్) 7–15, 15–14, 15–13తో గిల్మోర్ (బ్లాస్టర్స్)పై గెలవడంతో బెంగళూరు 0–3తో పరాజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత అక్సెల్సన్ (బ్లాస్టర్స్) 9–15, 15–13, 15–14తో వాంగ్ జు వే (వారియర్స్)పై గెలుపొందగా... మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రి–సిక్కిరెడ్డి జోడి 12–15, 15–8, 15–9తో షిన్ బెక్ చియోల్–ప్రజక్తా సావంత్ జంటపై గెలిచింది. నేడు జరిగే పోరులో చెన్నై స్మాషర్స్‌తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తలపడుతుంది.