ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న జాతివివక్షపై మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తాను చాలాసార్లు జాతివివక్షను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ‘జాతివివక్ష అనేది మన దేశంలో చాలా దారుణంగా ఉంది. నేనే స్వయంగా చాలాసార్లు దీనిని ఎదుర్కొన్నాను. సొంత దేశం గురించి తెలియని మూర్ఖులు కొంతమంది ఉన్నారు’ అని ఐదుసార్లు ముఖ్యమంత్రి అయిన తన్హావాలా అన్నారు. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘ 20-25 ఏళ్ల కిందట ఓ విందులో ఓ వ్యక్తి వచ్చి ‘నువ్వు భారతీయుడిలా కనిపించడం లేదే’ అన్నాడు. నేను వెంటనే భారతీయుడు ఎలా కనిపిస్తాడో ఒక్క ముక్కలో చెప్తారా? అని అడిగాను’ అని అన్నారు.
దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో ఈశాన్య భారతీయులపై జాతివివక్ష దాడులు జరగడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఒక ప్రాంతం పట్ల ఇలాంటి వివక్ష, సవతి తల్లి ప్రేమవల్ల ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘అందువల్లే ఈశాన్య భారతంలో ప్రాంతీయవాదం చాలా అధికంగా ఉంది. వేర్పాటువాద భావన కూడా ఇక్కడ ఎక్కువే. ఎందుకంటే ఈశాన్య భారతం ఆవల మమ్మల్ని ఆమోదించడం లేదు. భారతీయులుగా చెప్పుకొనే వాళ్లు మాపై వివక్ష చూపుతున్నారు’ అని అన్నారు.