మిజోరం కాంగ్రెస్‌కే..
ఐజ్వాల్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ మిజోరంలో మాత్రం తీపి విజయం సాధించింది. మూడింట రెండు వంతులకుపైగా భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరగడం తెలిసిందే. ఈవీఎంలో సమస్య కారణంగా ఒక స్థానం మినహా 39 స్థానాల ఫలితాలను సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ 33 స్థానాలను కైవసం చేసుకుంది.
2008 నాటి ఎన్నికల్లో ఆ పార్టీకి 32 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో మూడు సీట్లు సాధించిన ప్రధాన విపక్షం మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) ఈసారి ఐదు సీట్లు కైవసం చేసుకుంది. మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్(ఎంపీసీ) ఒక చోట గెలిచింది. 17 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ రిక్తహస్తాలతో మిగిలింది. లాంగ్ట్‌లాయ్ తూర్పు స్థానంలో ఓ పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంలో సాంకేతిక సమస్య వల్ల కౌంటింగ్ పూర్తి కాలేదు. ఈ బూత్‌లో ఈ నెల 11న రీపోలింగ్ జరిపి, 12న కౌంటింగ్ చేపడతారు. క్రైస్తవుల ప్రాబల్యమున్న మిజోరంలో ‘హస్తం’ తాజా విజయంతో సీఎం లాల్ తాన్‌హవ్లా ఐదో పర్యాయం మళ్లీ గద్దెనెక్కనున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన తాను పోటీ చేసిన రెండు చోట్లా(సెర్చిప్, రంగ్‌టర్జో) గెలిచారు. తాన్‌హవ్లా అసెంబ్లీకి ఎన్నికవడం ఇది తొమ్మిదోసారి.
కాంగ్రెస్ మల్లయోధుడు..!: ఈశాన్య పర్వత రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌ను మళ్లీ గద్దెనెక్కించిన ముఖ్యమంత్రి లాల్ తాన్‌హవ్లా (71) తాను ఆ పార్టీ ‘పోస్టర్ బాయ్’నని మరోసారి నిరూపించుకున్నారు. గత 30 ఏళ్లలో నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన ఐదోసారి మళ్లీ ఆ పీఠాన్ని అధిష్టించనున్నారు. 1987లో మిజోరంకు రాష్ట్ర హోదా లభించినప్పటినుంచి ‘హస్తం’ గెలుపుల్లో ఆయనదే కీలక పాత్ర. ఆయన 1973 నుంచి రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా పనిచేస్తున్నారంటే రాష్ట్ర పార్టీలో ఆయన స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చిన్న ప్రభుత్వ ఉద్యోగి స్థాయి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇంత స్థాయికి ఎదిగారు.