మూకదాడులపై దేశవ్యాప్త నిరసన
ముంబై/న్యూఢిల్లీ: ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మూకదాడులపై బుధవారం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వెల్లువెత్తింది. దాడులకు పాల్పడేవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వేలాది సాధారణ ప్రజలతోపాటు పలురంగాల ప్రముఖులు రోడ్లెక్కారు. ముంబైలో జరిగిన నిరసనలో సినీతారలు షబానా ఆజ్మీ, కొంకణాసేన్ గుప్తా, రజత్ కపూర్ తదితరులు వర్షాన్ని లెక్కచేయకుండా పాల్గొన్నారు. ‘నా పేరుతో కాకుండా నా తిండి పేరుతో చంపుతున్నారు’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు.
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో.. రైల్లో హత్యకు గురైన జునైద్ సోదరుడు అసరుద్దీన్, కాంగ్రెస్, లెఫ్ట్ నేతలు పాల్గొన్నారు. మూకదాడులు ఉండని స్వర్గంలో ఉన్నానంటూ జునైద్ తన తల్లికి రాసినట్లు ఓ మిత్రుడు రాసిన లేఖను అసరుద్దీన్ చదివి వినిపించారు. దీంతో అక్కడివారు కన్నీటిపర్యంతమయ్యారు. బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పట్నా, తిరువనంతపురం తదితర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ప్రేమ్‌సింగ్ ఈ నెల 25 నుంచి వారం రోజుల నిరాహార దీక్ష ప్రారంభించారు. మరోపక్క.. జునైద్ హత్య కేసులో 50 ఏళ్ల ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి సహా నలుగురిని అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని హరియాణా పోలీసులు తెలిపారు.