ఎవరికి ఓటేశాడో చెప్పలేదని.. వృద్ధుడి హత్య!
ఉత్తరప్రదేశ్ గూండాల రాజ్యం అనే విషయం మరోసారి రుజువైంది. ఎవరికి ఓటేశాడో చెప్పనందుకు గాను 80 ఏళ్ల వృద్ధుడిని కొంతమంది గూండాలు కొట్టి చంపారు. ఝాన్సీ - లలిత్పూర్ లోక్సభ స్థానానికి చెందిన జంగీ లాల్ అనే ఈ వృద్ధుడిని ఆ గూండాలు అతడి గ్రామ సమీపంలోని ఓ ఆలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ దేవుడి మీద ప్రమాణం చేసి, ఎవరికి ఓటేసినదీ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, అతడు మాత్రం ఆ వివరాలు వెల్లడించడానికి నిరాకరించాడు. (చదవండి: బీజేపీకి ఓటేశానంటూ దొరికిపోయిన బాబు)
దాంతో వాళ్లు అతడిమీద క్రూరంగా దాడిచేసి విపరీతంగా కొట్టారు. దాంతో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి, దుండగులను అరెస్టు చేశారు. కానీ, కేసు ఉపసంహరించుకోవాలని వాళ్లు తమపై ఒత్తిడి తెస్తున్నట్లు వృద్ధుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.