notices to officers
-
ఇన్చార్జి కలెక్టర్ గరంగరం
విజయవాడ : విధి నిర్వహణలో అలసత్వంగా ఉన్న జిల్లా అధికారులపై ఇన్చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకోసం కార్యక్రమానికి జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన జిల్లాలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం వారం జరిగే మీకోసం కార్యక్రమానికి సోమవారం హాజరు కాని ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఎస్ఈలు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి, ఏడి మార్కెటింగ్, ఏపీ ఎంఐసీ జోనల్ మేనేజర్, మైనారిటీస్ ఈడీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 500 గ్రామాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాల్సి ఉందన్నారు. కొన్ని మండలాల్లో జీరో ప్రగతి గ్రామాలు ఉన్నాయన్నారు. పోతనపల్లి, చాట్రాయి, లోకుమూడి, పెదలంక, పొన్నూరులంక, మండవల్లి గ్రామాల్లో ఒక టాయిలెట్ కూడా నిర్మాణం చేపట్టలేదన్నారు. మైలవరం ఎంఈవో రాజశేఖర్, ఆర్‌డబ్లూఎస్ సీనియర్ అసిస్టెంట్ ప్రకాశరావుల ఇంక్రిమెంట్ కోతకు ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్లో కొన్ని మండలాల్లో ఒక్క పనిదినం చూపని గ్రామాలు ఉన్నాయన్నారు. ఆయా మండలాల్లో ఎంపీడీఓలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసాధికార సర్వేలో నూజివీడు మున్సిపాలిటీ, విజయవాడ వీఎంసీ బాగా వెనకబడి ఉన్నాయన్నారు. కాన్ఫరెన్స్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృజన పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
- తమ ఉత్తర్వులను అమలు చేయని అధికారికి నోటీసులు జారీ - వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఛైర్పర్సన్, ఇతర సభ్యుల నియామకం విషయంలో తానిచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం పట్ల హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో వివరించాలంటూ అప్పటి పౌరపరఫరాల శాఖ కార్యదర్శి పార్థసారథికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆయనకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఏర్పాటు చేయకపోవడంపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ వినియోదారుల ఫోరాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఫోరానికి ఇప్పటి వరకూ ఛైర్పర్సన్, ఇతర సభ్యులను నియమించకపోవడంతో ప్రభుత్వంపై విశ్వేశ్వరరావు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం దీనిని విచారించిన ధర్మాసనం అప్పటి పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.