
ఇన్‌చార్జి కలెక్టర్ గరంగరం
విజయవాడ : విధి నిర్వహణలో అలసత్వంగా ఉన్న జిల్లా అధికారులపై ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకోసం కార్యక్రమానికి జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన జిల్లాలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం వారం జరిగే మీకోసం కార్యక్రమానికి సోమవారం హాజరు కాని ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఎస్‌ఈలు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి, ఏడి మార్కెటింగ్, ఏపీ ఎంఐసీ జోనల్ మేనేజర్, మైనారిటీస్ ఈడీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 500 గ్రామాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాల్సి ఉందన్నారు. కొన్ని మండలాల్లో జీరో ప్రగతి గ్రామాలు ఉన్నాయన్నారు. పోతనపల్లి, చాట్రాయి, లోకుమూడి, పెదలంక, పొన్నూరులంక, మండవల్లి గ్రామాల్లో ఒక టాయిలెట్ కూడా నిర్మాణం చేపట్టలేదన్నారు. మైలవరం ఎంఈవో రాజశేఖర్, ఆర్‌డబ్లూఎస్ సీనియర్ అసిస్టెంట్ ప్రకాశరావుల ఇంక్రిమెంట్ కోతకు ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో కొన్ని మండలాల్లో ఒక్క పనిదినం చూపని గ్రామాలు ఉన్నాయన్నారు. ఆయా మండలాల్లో ఎంపీడీఓలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసాధికార సర్వేలో నూజివీడు మున్సిపాలిటీ, విజయవాడ వీఎంసీ బాగా వెనకబడి ఉన్నాయన్నారు. కాన్ఫరెన్స్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృజన పాల్గొన్నారు.