
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
- తమ ఉత్తర్వులను అమలు చేయని అధికారికి నోటీసులు జారీ
- వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఛైర్‌పర్సన్, ఇతర సభ్యుల నియామకం విషయంలో తానిచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం పట్ల హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో వివరించాలంటూ అప్పటి పౌరపరఫరాల శాఖ కార్యదర్శి పార్థసారథికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆయనకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఏర్పాటు చేయకపోవడంపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ వినియోదారుల ఫోరాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఫోరానికి ఇప్పటి వరకూ ఛైర్‌పర్సన్, ఇతర సభ్యులను నియమించకపోవడంతో ప్రభుత్వంపై విశ్వేశ్వరరావు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం దీనిని విచారించిన ధర్మాసనం అప్పటి పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.