ఎన్పీఎస్ టైర్–2 ఖాతా అంటే ఏమిటి ?
నేను కొన్నేళ్ళుగా హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సిప్ ముగిసింది. మళ్లీ కొత్తగా దీన్లోనే సిప్ మొదలు పెట్టాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? లేకుంటే సిప్ కోసం వేరే మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోమంటారా?
– భవానీ, విజయవాడ
హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్‌లో కొన్నేళ్లుగా మీరు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే దీర్ఘకాలంలో ఈ ఫండ్ మంచి రాబడులే ఇచ్చి ఉంటుందనే విషయాన్ని మీరు గమనించి ఉంటారు. ఇతర పోటీ ఫండ్స్‌తో పోల్చితే కొన్ని సంవత్సరాల్లో ఈ ఫండ్ పనితీరు బాగాలేకపోయినా, మొత్తం మీద ఈ ఫండ్ సంతృప్తికరమైన పనితీరునే కనబరిచింది. అయితే ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరులో మరింత మెరుగుదల కనిపిస్తోంది. ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా ఈ ఫండ్‌లో మీ సిప్‌ను కొనసాగించండి. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నా, పతన బాటలో ఉన్నా సిప్‌ను కొనసాగించడానికి వెనకాడవద్దు. స్వల్పకాలంలో ఈ ఫండ్ పనితీరు ఒడిదుడుకులమయంగా ఉన్నప్పటికీ, సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. అందుకని నిరభ్యంతరంగా ఈ ఫండ్‌లో సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొత్తగా మొదలు పెట్టవచ్చు.
ఎన్పీఎస్ టైర్–2 ఖాతా అంటే ఏమిటి ? దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయని మిత్రులంటున్నారు. ఇది నిజమేనా?
– శ్రీనివాస్, విశాఖపట్టణం
ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) టైర్ వన్ అకౌంట్ ఉన్నవాళ్లే, ఎన్పీఎస్ టైర్–2 అకౌంట్‌ను ప్రారంభించడానికి అర్హులు. ఎన్పీఎస్ టైర్ –2 ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎలాంటి లాక్–ఇన్ పీరియడ్ ఉండదు. కాబట్టి ఈ అకౌంట్ నుంచి ఎప్పుడైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కూడా ఇది మెరుగైన ప్రత్యామ్నాయం. అయితే బ్యాంక్ ఎఫ్డీ అయితే తక్షణం ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ టైర్–2 ఖాతాలో మాత్రం డబ్బుల ఉపసంహరణకు మూడు రోజులు పడుతుంది. ఇదొక్కటే దీనికి ఉన్న ప్రతికూలాంశం. మూడేళ్ల కాలానికి గాను ఎన్పీఎస్ టైర్–2 ఖాతా నుంచి 11.5 శాతం నుంచి 14 శాతం రేంజ్లో రాబడులు పొందవచ్చు. అయితే ఎన్పీఎస్ టైర్–వన్ ఖాతాకు లభించినట్లుగా ఈ ఎన్పీఎస్–టైర్–2 ఖాతా రాబడులపై ఎలాంటి పన్ను రాయితీలు లభించవు. దీంట్లో ఏడాదికి కనీసం రూ.6,000 ఇన్వెస్ట్ చేయాలి. స్వల్పకాల అవసరాలకు డెట్ ఫండ్స్‌లో కన్నా టైర్ –2 ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీంట్లో వ్యయాలు తక్కువగా ఉంటాయి. పైగా, రాబడులు కూడా మెరుగ్గానే ఉంటాయి. అయితే ఎన్పీఎస్ టైర్–2లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లకు మించి కొనసాగిస్తే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నప్పుడు కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పన్ను భారం స్వల్పంగానే ఉంటుంది.
డెట్ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవచ్చా?
– జగన్, ఈ మెయిల్ ద్వారా
ఈక్విటీ మ్యూచువల్ఫండ్స్లో ఒకేసారి పెట్టుబడులు పెట్టడం సరికాదు. కానీ డెట్ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల మాదిరి డెట్ ఫండ్స్ భారీ ఒడిదుడుకులకు గురికావు. అందుకని డెట్ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇలా ఒకేసారి డెట్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా ఈక్విటీ, లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. డెట్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ ఫండ్స్‌లో పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
నేను గడువులోపల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయలేకపోయాను. ఈ అసెస్మెంట్ ఇయర్(2017–18)కు ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం లేదా?
– నిహారిక, హైదరాబాద్
ఈ అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీఆర్ దాఖలును ఈ ఏడాది జూలై 31లోపు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5 వరకూ పొడిగించింది. ఈ గడువులోగా కూడా ఐటీఆర్‌ను దాఖలు చేయలేని వాళ్లు బిలేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. ఈ అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి ఈ బిలేటెడ్ రిటర్న్‌లను వచ్చే ఏడాది మార్చి 31లోపు దాఖలు చేసుకోవచ్చు. అయితే గడువు తేదీ తర్వాత ఐటీఆర్‌లు దాఖలు చేయని వాళ్లు.. అంటే ఈ నెల 5 లోపు ఐటీఆర్‌లను దాఖలు చేయలేనివాళ్లు కొన్ని ప్రయోజనాలు కోల్పోతారు. కొంత జరిమానా చెల్లించాల్సి రావచ్చు. గడువులోపు ఐటీఆర్‌లు దాఖలు చేస్తే లభించే ప్రయోజనాలు గడువు తీరిన తర్వాత దాఖలు చేసే ఐటీఆర్‌లకు లభించవు. అంతకు ముందు సంవత్సరాల్లో పొందిన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకొని తర్వాతి సంవత్సరాల్లో వచ్చే లాభాలతో రద్దు చేసుకునే అవకాశం కోల్పోతారు. మరోవైపు ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటే, వాటిపై వడ్డీకూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఒకవేళ ట్యాక్స్ రిఫండ్ వచ్చే అవకాశాలున్నట్లయితే, ట్యాక్స్ రిఫండ్ల్లో సాధారణం కంటే అధిక కాలం జాప్యం జరగవచ్చు.