NRI Academy
-
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని ఈనెల 23న సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సేవ డేస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి,సురేష్ రెడ్డి,గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్,మనోహర్ తదితరులు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. డిసెంబర్ 10 నుంచి ఈనెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వారు డిప్యూటీ సీఎంకు వివరించారు. వరంగల్ లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించగా 16,000 మంది హాజరయ్యారని ఇందులో 1500 మంది నిరుద్యోగులను ఎంపిక చేసామని చెప్పారు.అదే విధంగా 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ లో నిర్వహించే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు కూడా రావాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు!) -
అట్లాంటాలో 18వ ఆటా మహాసభల సన్నాహాలకు శ్రీకారం!
అమెరికా తెలుగు సంఘం ఆటా ద్వైవార్షికంగా నిర్వహించు 18వ మహాసభలను 2024న జూన్ 7,8, 9 తేదీలలో అట్లాంటాలో అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. అందుకోసం ఈ నెల సెప్టెంబరు 8,9,10తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా18వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబరు 8న, శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న ఆటా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగత సమారోహంతో ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం, అద్వితీయ విందు వినోదాలతో అలరించింది. ఇక సెప్టెంబర్ 9 శనివారం ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ఆరంభమయి, ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని సారథ్యంలో, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా ,పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల,హనుమంత్ రెడ్డి,కరుణాకర్ మాధవరం,సుధాకర్ పెరికారి మరియు పరమేష్ భీమ్‌రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ మరియు అట్లాంటా ఆటా బృందం ఆధ్వర్యంలో నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. ఆటా సభ్యుల ప్రోత్సాహభరిత సందేశాలు , మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారత దేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకల చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటి (ఏటీఎస్) సంస్థ విలీనం , సమావేశ సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక సేవా అభివృద్ధి సంబంధిత అజెండా, రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలు, వంటి పలు కీలక అంశాల అధ్యయనంతో ప్రభావాన్వితంగా సాగడం హర్షణీయం. ఆటా 18వ సభల కొరకు నియామికమైన కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం,కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదినిలు ప్రసంగిస్తూ అట్లాంటా తరుపున అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఆటా సభలకుగాను అందరి సహాయసహకారాలను సవినయంగా కోరుతూ, సభలను గూర్చి పలు అంశాల వివరణ అందించారు. ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసారు. వధూవరులు, తల్లితండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం కమ్మని విందుతో బోర్డు సమావేశం సంపూర్ణం అయ్యింది. మధ్యాహ్నం ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా 18వ కాన్ఫరెన్స్ బృందం , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, అట్లాంటా ఆటా బృందం 18వ మహాసభలను నిర్వహించు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్(జీడబ్ల్యూసీసీ)ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేసారు. సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్‌లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకోగా గణనాథుని ఆరాధనతో శుభారంభమయ్యింది. ఆ శుభవేళ కళారాధనతో మొదలైన నీలిమ గడ్డమనుగు నేపథ్యంలో వివిధ శాస్త్రీయ జానపద , చలన చిత్ర గీతికల నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలతో ఆద్యంతం సభాసదుల అలరించింది. ఆటా 18వ కాన్ఫరెన్స్ లోగో ను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ చైర్మన్ మరియు పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పీసీకే ఆవిష్కరించగా, మధు బొమ్మినేని, జయంత్ చల్లా కిరణ్, పాశం వేణు పీసీకేను సన్మానించారు. మధు బొమ్మినేని కాన్ఫరెన్స్ సాంగ్ ఆవిష్కరించగా ప్రసిద్ధ గాయకులు, అద్భుత సంగీత సహకారాన్ని అందించిన దర్శకులు మల్లికార్జున సాహిత్య సహకారం అందించిన మాధవి దాస్యంలను అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందించగా సభాసదులు ప్రతిధ్వనించు హర్షధ్వానాలతో ఆటా సభ అడ్హాక్ సభ్యులను, సలహాదారులను, పూర్వ అధ్యక్షులను, స్పాన్సర్సను హర్షధ్వానాలతో సత్కరించారు. ఈ సాయంకాలం సుమారు 600 గౌరవ అతిథులతో కార్యక్రమం ఆద్యంతం మధురానుభూతులతో ఉల్లాసభరితంగా కొనసాగింది. శ్రావణి రాచకుల్ల సారథ్యంలో సుందర నారీమణుల వస్త్రాలంకరణ ప్రదర్శన (ఫ్యాషన్ షో) వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగా నూతన మోహన, జనార్ధన్ పన్నేల గార్ల అద్భుత గానాలాపన మరియు స్థానిక గాయకుల గానాలాపానతో జనరంజకంగా సాగింది ఆ శుభ సాయంకాలం. కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18 వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతు అందరికీ అభినందనలు తెలియచేశారు. అట్లాంటాలోని స్థానిక తెలుగు సంస్థల TANA, GATA,GATeS, GTA, NATA,NATS,TTA, TDF, TAMA ప్రతినిధులను 18వ ఆటా మహాసభలకు ఆహ్వానించారు. తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా 18వ ఆటా మహాసభల విజయవంతంగా సాగడానికి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని తమ స్పందన తెలియచేస్తూ కార్యక్రమం అద్భుతంగా, అద్వితీయంగా కొనసాగడానికి కారకులైన విశిష్ఠ అతిథులకు, గౌరవ అతిథులకు, వదాన్యులకు , యూత్ వాలంటీర్స్‌కు, అట్లాంటా కోర్ సభ్యులకు, అట్లాంటా కోర్ కాన్ఫరెన్స్ దాతలకు తదితర మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. (చదవండి: ఐటీ అమెరికా నిర్వహించిన ఆత్మీయ సదస్సులో బండి సంజయ్!) -
విదేశాల్లో చదువు.. స్వదేశంలో సేవ
సాక్షి, పశ్చిమగోదావరి : విదేశాల్లో చదువుతూ స్వదేశంలో సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ఎన్ఆర్ఐ విద్యార్థులు. విజయవాడకు చెందిన శౌరీస్ జాస్తి (ఇంటర్ మొదటి సంవత్సరం), హైదరాబాద్‌కు చెందిన రాహుల్ (10వ తరగతి) న్యూజెర్సీలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులు పనికిరాని వ్యర్థపదార్థాలతో వాటర్ ప్యూరిఫైర్ ప్రక్రియను తయారు చేశారు. వీరు తయారు చేసిన ఈ ప్రక్రియకు మెచ్చి న్యూజెర్సీలోని అకాడమి సంస్థలు ఇండియన్ కరెన్సీ రూపంలో రూ.42 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ నగదుతో సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వాటర్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా శౌరీస్ జాస్తి, రాహుల్‌లు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నీటిశుద్ధి పరికరాలను పంపిణీ చేస్తున్నారు. వీరు అందిస్తున్న నీటిశుద్ధి పరికరం రూ.3 వేలు. ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 50 ప్రభుత్వ పాఠశాలలకు నీటిశుద్ధి పరికరాలు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఈ నీటిశుద్ధి పరికరాలు అందజేయాలని మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం పీవీ నాగమౌళి వారిని కోరారు. వెంటనే స్పందించిన శౌరీస్ జాస్తి, రాహుల్‌లు జంగారెడ్డిగూడెం మండలంలోని 15 ప్రభుత్వ పాఠశాలలకు నీటిశుద్ధి పరికరాలను ఉచితంగా అందజేశారు. విద్యార్థి దశలోనే వీరిద్దరు చేస్తున్న సేవలకు విద్యాశాఖాధికారులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. శౌరీస్ జాస్తి, రాహుల్ మాట్లాడుతూ తాగే నీరు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలు దరిచేరవని, ప్రభుత్వ పాఠ«శాలలను ఎంచుకుని నీటిశుద్ధి పరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మున్ముందు పేద విద్యార్థులు చేరువయ్యే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని విద్యార్థులు చెప్పుకొచ్చారు. విద్యార్థుల సేవ భేష్ విద్యార్థి దశలోనే శౌరీస్ జాస్తి, రాహుల్‌లకు సేవాదృక్పథం కలగడం నిజంగా అభినందించాల్సిందే. నా కోరిక మేరకు ఈ విద్యార్థులు మండలంలో ప్రభుత్వ పాఠశాలలకు నీటి శుద్ధి పరికరాలు అందిచేందుకు ముందుకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. సేవలోనే ఆత్మ సంతృప్తి ఉందని ఈ విద్యార్థులు చేస్తున్న సేవలు అభినందనీయం పీవీ నాగమౌళి, హెచ్ఎం, మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాల -
టీడీపీ ఎమ్మెల్యే విద్యాసంస్థల నిర్వాకం
సాక్షి, అమరావతి బ్యూరో: విద్యాసంస్థ ముసుగులో సేవాపన్ను ఎగ్గొట్టిన కేసులో తెనాలి టీడీపీ ఎమ్మెల్యే, ఎన్నారై అకాడమీ మేనేజింగ్ పార్టనర్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి రూ.వంద కోట్లకు పైగా వసూలు చేసేందుకు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఆయనకు ఇప్పటికే హైకోర్టులో చుక్కెదురు కావడంతో పన్ను బకాయిలు రాబట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రోగ్రాములు, శిక్షణ పేరుతో భారీగా వసూలు: ఎన్నారై అకాడమీలో ఇద్దరే భాగస్వాములు. ఒకరు గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కాగా మరొకరు ఆయన భార్య మాధవి. ఎన్నారై ఎడ్యుకేషనల్ సొసైటీతో కలిసి పలు చోట్ల ఎన్నారై జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నారు. ట్యూషన్ ఫీజుతోపాటు ఇంజనీరింగ్ / మెడికల్‌కు ప్రత్యేక ప్రోగ్రాములు, జాతీయస్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు, శిక్షణ పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్నా దీనికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.53.94 కోట్ల సేవా పన్ను ఎగ్గొట్టినట్లు తేలింది. ఎన్నారై ఆధ్వర్యంలో 43 కాలేజీలు..: ఎన్నారై అకాడమీ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ 2009 ఏప్రిల్ 1వ తేదీన ఎన్నారై ఎడ్యుకేషనల్ సొసైటీతో ఒప్పందం చేసుకున్నారు. సొసైటీలో రాజేంద్రప్రసాద్ సహా ఏడుగురు సభ్యులున్నారు. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, తిరుపతి, ఒంగోలు, తెనాలి, నెల్లూరులో 43 ఎన్నారై జూనియర్ కాలేజీలను అకాడమీ నడుపుతోంది. ఆలపాటి ఆయా కాలేజీలకు ప్రెసిడెంట్, కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో బోధన నిర్వహిస్తున్నట్లు 2011లో సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేశారు. సర్వీస్ ట్యాక్స్ చెల్లించి రిటర్నులు ఫైల్ చేయాలని విజయవాడ సర్వీస్ ట్యాక్స్ సూపరింటెండెంట్ సూచించగా అకాడమీ 2012లో ‘నిల్’ రిటర్నులు ఫైల్ చేసింది. ఈ మధ్యలో సర్వీసు ట్యాక్స్ నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేశారు. ఇక అప్పటి నుంచి ఎన్నారై అకాడమీ సేవా పన్ను ఊసు ఎత్తడం లేదు. రూ.60.19 కోట్లు కట్టాలని షోకాజ్ నోటీసు..: 2015 ఏప్రిల్ 17న అహ్మదాబాద్‌లోని సెంట్రల్ ఎక్సైజ్, ఇంటెలిజెన్స్ జోనల్ యూనిట్ డైరెక్టర్ జనరల్ సెక్షన్ 73 (1), ఫైనాన్స్ చట్టం 1994 కింద ఎన్నారై అకాడమీకి డిమాండ్–షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2009 అక్టోబరు ఒకటి నుంచి 2015 మార్చి 31 వరకు సొసైటీ, అకాడమీలు రూ.522.89 కోట్లు వసూలు చేశాయని, సేవాపన్ను కింద ప్రభుత్వానికి రూ.60.19 కోట్లను చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఎన్నారై అకాడమీ చెల్లించాల్సిన సేవా పన్ను రూ.53,94,36,220 అని గుంటూరు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కమిషనరు 2016 నవంబరు 29న నిర్ధారించారు. ఆలపాటి ప్రకటనే రుజువు: వాస్తవానికి ఎన్నారై అకాడమీ ఈ అంశంపై హైదరాబాద్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ (సీఈఎస్‌టీఏటీ) ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవాలి. ఫీజుల కింద వసూలు చేసిన మొత్తంలో 7.5 శాతం అంటే రూ.4.40 కోట్లను డిపాజిట్ చేయాలి. అయితే ఇందుకు భిన్నంగా ఎన్నారై అకాడమీ మేనేజింగ్ పార్టనర్ అయిన ఎమ్మెల్యే ఆలపాటి గతేడాది హైకోర్టులో రిట్ పిటిషన్ (నంబర్ 7638/2017) దాఖలు చేశారు. ఇంటర్లో నిర్దేశించిన సిలబస్‌నే బోధిస్తున్నందున పన్ను వర్తించదని పేర్కొన్నారు. సీజీఎస్టీ ఈ వాదనను తోసిపుచ్చింది. ఎన్నారై అకాడమీ అఖిల భారతస్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్టుగా సొసైటీ ఎంవోయూల్లో ఆలపాటి ఇచ్చిన స్టేట్మెంట్ను రుజువుగా చూపారు. అకాడమీ వసూలు చేసే బిల్లుల్లోనూ పలు రకాలున్నాయి. కోచింగ్, స్పెషల్ ప్రోగ్రామ్‌ల పేరుతో భారీ ఫీజులను వసూలు చేశారని స్పష్టం చేసింది. సేవా పన్ను ఎగ్గొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెడుతున్నారని తెలిపింది. ఎన్నారై ఎడ్యుకేషనల్ సొసైటీ ఇంటర్ విద్యార్థులకు బోధన నిర్వహిస్తుండగా అకాడమీ కోచింగ్ ఇస్తోంది. కోచింగ్ ఫీజుల కింద అకాడమీ వసూలు చేసిన రూ.474.70 కోట్లకు సేవాపన్ను చెల్లించడం లేదని పేర్కొంది. పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు బెంచ్..: జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ అమరనాథ్గౌడ్లతో కూడిన హైకోర్టు బెంచ్ ఈనెల 8వ తేదీన ఎన్నారై అకాడమీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. చట్టప్రకారం కోచింగ్ సేవలు సేవాపన్ను పరిధిలోకి వస్తాయని బెంచ్ స్పష్టం చేసింది. దీంతో రూ.54 కోట్ల దాకా సేవాపన్ను, దాదాపు అంతే మొత్తంలో అపరాధ రుసుం, వడ్డీతో కలిపి వసూలు చేసేందుకు గుంటూరు సీజీఎస్టీ సిద్ధమైనట్లు సమాచారం. పరిశీలిస్తున్నాం..: గుంటూరులోని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ ఎం.శ్రీహరిరావు, తెనాలి జీఎస్టీ కార్యాలయ సూపరింటెండెంట్ కోటేశ్వరరావులను ఈ అంశంపై వివరణ కోరగా, పరిశీలించాల్సి ఉందని ఒకరు, పాత బకాయిలు వెరిఫై చేయాలని మరొకరు పేర్కొనడం గమనార్హం. -
ఎదురులేని ‘ఎన్ఆర్ఐ’
ఇంటర్ విద్యలో నాణ్యమైన బోధనకు చిరునామాగా నిలిచిన ‘ఎన్ఆర్ఐ అకాడమి’ ఎంసెట్ 2014 ఫలితాలలోనూ స్టేట్ టాప్ ర్యాంకులతో దూసుకెళ్లింది. మెడికల్, ఇంజనీరింగ్‌లో రికార్డు స్థాయిలో వందలోపు, వెయ్యిలోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించింది. మెడికల్‌లో 360 మందికిపైగా ఎన్నారై విద్యార్థులు సీట్ గెట్టింగ్ ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇంజనీరింగ్‌లో వెయ్యిలోపు బెస్ట్ ర్యాంకులతో 12,304 ఇంజనీరింగ్ సీట్ గెట్టింగ్ ర్యాంకులు ఎన్నారైకు దక్కాయి. గత ఆరేళ్లుగా విజయాల క్రమాన్ని పెంచుకుంటున్న తాము ఈ ఏడాది అత్యున్నత ర్యాంకులతోపాటు అత్యధిక సీట్ గెట్టింగ్ ర్యాంకులను సాధించామని ‘ఎన్నారై అకాడమి’ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్, డెరైక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య వివరించారు. ‘కేవలం కొందరికే కాదు.. అందరికీ అత్యుత్తమ ర్యాంకులు’ అన్న తమ విధానం ఈ ఫలితాలలో కూడా ప్రతిబింబించిందని చెప్పారు. ఎన్నారై డాక్టర్ల నేతృత్వంలో నడుస్తున్న ‘ఎన్నారై అకాడమి’లో డాక్టర్, ఇంజనీర్ కావాలనే లక్ష్యాన్ని చేరుకోవటం సులభ సాధ్యమని పేర్కొన్నారు.