అమావాస్యనాడు ఏం జరిగింది?
ఓ దుర్మార్గుడి కారణంగా మరణించిన ఓ యువజంట... ప్రేతాత్మలుగా మారి వాడిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అమావాస్య’. రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్, నృపుర్ మెహతా, రూబీ అహ్మద్, సోనమ్ ప్రధాన పాత్రధారులు.
నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి రాకేష్ సావంత్ మాట్లాడుతూ -‘‘కథ పాతదైనా...కథనం కొత్తగా ఉంటుంది. హారర్ చిత్రాల్లో ఇది కొత్త కోణమని చెప్పొచ్చు. నటి సీమపై ఇటీవలే ఐటమ్ సాంగ్ తీశాం. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. డబ్బింగ్ కూడా పూర్తయ్యింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, జీవా, ముమైత్‌ఖాన్, శ్రావణ్, సంభావన సేత్, జితేందర్‌సింగ్ సాహు, రాజేష్ వివేక్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మణికంఠ నాయుడు, కెమెరా: ద్రిడ్ బసు, సంగీతం: సయ్యద్ అహ్మద్.