NTPC plant
-
షోలాపూర్ ఎన్టీపీసీ ప్లాంట్‌కు సింగరేణి బొగ్గు
సాక్షి, హైదరాబాద్: మన సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు కోల్ ఇండియా సంస్థ నుంచి బొగ్గును సరఫరా చేసుకుంటున్న ఎన్టీపీసీ ఇక సింగరేణి నుంచి బొగ్గు తీసుకోనుంది. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో రెండు సంస్థల అధికారుల మధ్య ఇంధన సరఫరా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు ఏడాదికి 25.40 లక్షల చొప్పున 25 ఏళ్ల పాటు సింగరేణి బొగ్గును మహారాష్ట్రలోని షోలాపూర్ యూనిట్–1కు సరఫరా చేయనుంది. ఇప్పటివరకు కోల్ ఇండియా నుంచి బొగ్గును తీసుకుంటున్న ఎన్టీపీసీ.. నాణ్యత, నిరంతరాయ సరఫరా కోసం సింగరేణి నుంచి బొగ్గు తీసుకుంటే తమకు లాభదాయకంగా ఉంటుందని భావించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ అంగీకారాన్ని కోరగా, ఇందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే, సింగరేణి సంస్థ ఇప్పటికే దేశంలోని 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లకు బొగ్గు ఇస్తోంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్లాంట్లకు యేటా 135.30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. షోలాపూర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా కోసం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి తరఫున కోల్ మూవ్మెంట్ ఈడీ జె.ఆల్విన్, మార్కెటింగ్ జీఎం కె.రవిశంకర్, డీజీఎం వెంకటేశ్వర్లు, ఎన్టీపీసీ ప్రాంతీయ ఈడీ మనీశ్ జవహరి, చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్.ఎన్.రావు, ఏజీఎం పి.కె.రావత్‌లు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రామగుండం పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయ ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.1,500 కోట్లతో 2016లో ప్రధాని నరేంద్రమోదీ ఎన్టీపీసీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. శరవేగంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతుండగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి కూడా రాలేదని సీఎం పేర్కొనడం పచ్చి అబద్ధమన్నారు. ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిగా రాష్ట్రానికే వస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయని, దీనికి కారణమేంటో ప్రజలకు చెప్పాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్రంతో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని కేసీఆర్ పేర్కొనడం అబద్ధమన్నారు. మోదీ బాధ్యతలు చేపట్టాక రైతులకు ఎరువుల కష్టాలు తీర్చడంలో భాగంగా ఖాయిలా పడ్డ ఎరువుల పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నారన్నారు. -
13 వేల కోట్లు కావాలి
కేంద్రానికి డిస్కంల ప్రతిపాదనలు ‘సాక్షి’తో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ, పట్టణ విద్యుదీకరణ పనులకు రూ.13 వేల కోట్లు కావాలని కేంద్రాన్ని కోరాలని డిస్కంలు నిర్ణయించాయి. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌ల నుంచి ఈ నిధులు కేటాయించాలని కోరనుంది. ఇందుకు ఈ నెలాఖరున ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి తెలిపారు. ఈ పథకాల విధి విధానాల ఖరారుపై ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరై వచ్చిన అనంతరం ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ పథకాల కింద రూ. 75 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, తెలంగాణలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.13 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి కనీసం రూ.4 వేల కోట్ల నుం చి రూ.5 వేల కోట్లు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రబీ సీజన్, వేసవి అవసరాల దృష్ట్యా సదరన్ రీజియన్‌లో వివిధ కంపెనీల నుంచి 300 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. మే నెలాఖరు వరకు విద్యుత్ కొనుగోలు చేసేలా వివిధ కంపెనీలతో ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సదరన్ రీజియన్‌లో ఎన్టీపీసీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును తెలంగాణకు ఇచ్చి.. రత్నగిరి ప్లాంటు విద్యుత్తును వేరే రాష్ట్రాలకు ఇచ్చేలా స్వాపింగ్ కుదిరితే ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన నిర్ణయం మేరకు 500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్లను గురువారం జారీ చేస్తామన్నారు.