కేంద్రానికి డిస్కంల ప్రతిపాదనలు
‘సాక్షి’తో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ, పట్టణ విద్యుదీకరణ పనులకు రూ.13 వేల కోట్లు కావాలని కేంద్రాన్ని కోరాలని డిస్కంలు నిర్ణయించాయి. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్‌ల నుంచి ఈ నిధులు కేటాయించాలని కోరనుంది. ఇందుకు ఈ నెలాఖరున ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి తెలిపారు. ఈ పథకాల విధి విధానాల ఖరారుపై ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరై వచ్చిన అనంతరం ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
ఈ పథకాల కింద రూ. 75 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, తెలంగాణలోని ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో రూ.13 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి కనీసం రూ.4 వేల కోట్ల నుం చి రూ.5 వేల కోట్లు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రబీ సీజన్, వేసవి అవసరాల దృష్ట్యా సదరన్ రీజియన్‌లో వివిధ కంపెనీల నుంచి 300 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. మే నెలాఖరు వరకు విద్యుత్ కొనుగోలు చేసేలా వివిధ కంపెనీలతో ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు.
మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న ఎన్‌టీపీసీ ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సదరన్ రీజియన్‌లో ఎన్‌టీపీసీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును తెలంగాణకు ఇచ్చి.. రత్నగిరి ప్లాంటు విద్యుత్తును వేరే రాష్ట్రాలకు ఇచ్చేలా స్వాపింగ్ కుదిరితే ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన నిర్ణయం మేరకు 500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్లను గురువారం జారీ చేస్తామన్నారు.
13 వేల కోట్లు కావాలి
Published Thu, Jan 22 2015 5:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM
Advertisement