ntr health services
-
ఆరోగ్యశ్రీకి నిబంధనాలు
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆకర్షించడానికి చేసే పథకంలా ఆరోగ్యశ్రీలో బడ్జెట్ కేటాయింపులు, నగదు చెల్లింపులు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి నగదును పెంచిన ప్రభుత్వం, పథకంలోని సర్జరీల సంఖ్యను మాత్రం పెంచలేదు. పేదలకు ప్రమాదకర రోగం వస్తే చికిత్స చేయించుకునే తాహతులేక, ఆస్తులు అమ్ముకున్నా ఖరీదైన వైద్యం పొందలేక ప్రాణాలు కోల్పోతున్నారు. సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అయిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, న్యూరో సర్జరీలు, యాక్సిడెంట్లలో తీవ్రంగా గాయపడిన వారికి అందించే ఐసీయూ చికిత్సలు, గుండెకు చేసే అధునాతనమైన శస్త్రచకిత్సలను ఈ పథకం పరిధిలో చేర్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఒంగోలు సెంట్రల్: నిబంధనల ఆరోగ్యశ్రీ పథకంతో ఆరోగ్యం మెరుగయ్యేదెలా అంటూ పేదలు ప్రభుత్వతీరును విమర్శిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రస్తుతం ఈ పథకానికి ఇస్తున్న రూ. 2.50 లక్షలు ఏప్రిల్ నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని వల్ల పేద రోగులకు పెద్దగా ఉపయోగంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో..: ఖరీదైన వైద్యం పేదలకు అందించాలన్న ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. మొదట్లో 468 జబ్బులతో మొదలైన ఈ పథకం కింద సంవత్సరంలోనే 938 జబ్బులను చేర్చారు. పేదవారు చికిత్స చేయించుకోలేని గుండెజబ్బు నుంచి కాలేయ జబ్బు వరకూ, క్యాన్సర్ నుంచి ఏ జబ్బుకైనా కార్పొరేట్ ఆసుపత్రుల్లో దీని కింద చికిత్స చేసుకునేలా పథకాన్ని తీర్చిదిద్దారు. జబ్బు బారిన పడిన వారికి చికిత్సతో పాటూ వైద్యం జరిగినన్ని రోజులు భోజనం, రవాణా చార్జీలను సైతం చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. అప్పట్లో అనేక మంది దీని ద్వారా ప్రాణాలు కాపాడుకుని వైఎస్సార్‌కు తమ గుండెల్లో గుడికట్టారు. ప్రస్తుతం జరుగుతున్న తీరు ప్రస్తుతం 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండగా వీటిలో 133 జబ్బులకు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు చేయకూడదని, ప్రభుత్వ వైద్య శాలల్లోనే చికిత్స చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. హైదరాబాద్ వంటి నగరాల్లో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కింద నగదు విడుదల చేయడం లేదు. దీంతో అక్కడి వైద్యశాలలు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రోగులకు వైద్య చికిత్సలను అందించడం లేదు. ♦ సొంత ఊరిలో రేషన్ తీసుకుంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని లింకు పెట్టారు. దీంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారిని ఈ పథకం కింద వైద్య సాయానికి అనర్హులుగా చేశారు. ♦ కిడ్నీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పథకం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ♦ క్యాన్సర్ వస్తే చికిత్సకు కనీసం 8 సార్లుకు పైగా కీమోథెరపీని చేయించుకోవాలి. అయితే ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వరకే తాము భరిస్తామని, తరువాత ఎవరికి వారే చేయించుకోవాలని నిబంధనను విధించడంతో క్యాన్సర్ రోగులు మృత్యువాత పడుతున్నారు. ♦ అతి తక్కువ మంది ఉండే చెవి, మూగ వారికి చేసే కాంక్లియర్ ఇన్‌ప్లాంట్స్‌ను మాత్రం పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే అది కూడా ఆసుపత్రులు నెలకు 1 కేసు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. ♦ ఇక నరాలు, కాలేయానికి సంబంధించిన శస్త్రచికిత్సలకు ప్రైవేటు వైద్యశాలలు ముందుకు రావడంలేదు. ఇలాంటి అనేక నిబంధనల వల్ల పేద వారు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పలు వైద్య సేవలను పొందలేకపోతున్నారు. ♦ గతంలో ఆరోగ్యశ్రీలో ఉండే 24 గంటల కడుపు నొప్పిని, పసరు తిత్తిలోని రాళ్లకు చేసే శస్త్రచికిత్సలను, ఆడవారికి చేసే పెద్ద శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలని నిబంధన విధించారు. ♦ ప్రస్తుతం పథకంలో ఉన్న అర్థం, పర్థంలేని నిబంధనలు ఉంటే పథకం కింద వైద్యశాలలకు ఇచ్చే నగదును పెంచితే పేద రోగులకు ఒరిగేదేమీ లేదు. పథకం పరిధిని విస్త్రత పరిస్తేనే పేద రోగులకు లబ్ధి చేకూరతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -
అటకెక్కిన ఎన్టీఆర్ వైద్య సేవలు..
కడప రూరల్: జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవల (ఆరోగ్య శ్రీ) నెట్ వర్కింగ్ హాస్పిటల్స్ యజమానులు ‘ఆశా’ అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మె బాట పట్టారు. ఫలితంగా గురువారం జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు ఆరోగ్య రక్ష, ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్), వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం (డబ్ల్యూజేహెచ్‌ఎస్)ల కింద వైద్య సేవలను అందించే ఆసుపత్రులు 23 ఉండగా..అందులో ప్రభుత్వ రంగానికి సంబంధించినవి కడప రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, రాజంపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నాయి. 23 హాస్పిటల్స్‌లో మూడింటిని మినహయిస్తే మిగతా 20 ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలను నిలుపుదల చేశాయి. ఈహెచ్ఎస్, డబ్ల్యూజేహెచ్‌ఎస్ పథకాల కింద దంత వైద్య సేవలను అందించే హాస్పిటల్స్ జిల్లాలో 25 ఉన్నాయి.ఇవి సమ్మెలో పాల్గొనడంలేదు. త్వరలో సమ్మె బాట పట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ స్కీంలో సోమ, మంగళ, బుధవారాల్లో ఒక్కో హాస్పిటల్‌కు ఔట్ పేషెంట్స్, రోజుకు దాదాపు వంద మంది వస్తుంటారు. సాధారణ రోజుల్లో 50 మంది వస్తారు. ఇన్ పేషెంట్స్ రోజుకు 10 మంది చేరుతుంటారు. సమ్మెలో భాగంగా ఈ ఓపీ, సాధారణ వైద్య సేవలు పూర్తిగా బంద్ అయ్యాయి. దీంతో రోగులు వెనుతిరిగిపోతున్నారు. ఆరోగ్య శ్రీ కింద మా హాస్పిటల్‌కు దాదాపు రూ 2 కోట్లకు పైగా బకాయిలు రావాలి. ఇవి రాకపోవడంతో ఆసుపత్రి నిర్వహణ గగనంగా మారుతోందని పేరు చెప్పడాకి ఇష్టపడని వైద్యులు అంటున్నారు. కాగా కడప నగరంలో ఉన్న 11 హాస్పిటల్స్ మాత్రమే వైద్య సేవలు నిలుపుదల చేశాయని మిగతావి యథావిధిగా పనిచేస్తున్నాయని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్టినేటర్ డాక్టర్ శివనారాయణ తెలిపారు. -
ఆరోగ్యంపై భరోసా కరువు
శ్రీకాకుళం: ప్రతి పేదవాడికీ కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడిచింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చి మొదట్లో హడావుడి చేసిన సర్కారు తర్వాత ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తూ వస్తోంది. తాజాగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) సేవలను నిలిపివేయడంతో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండాపోయింది. ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్లు బకాయి ఉండడంతో సోమవారం నుంచి అన్నిప్రైవేటు ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్యసేవను నిలుపుదల చేశారు. ఏడాది కాలంగా బకాయిలు చెల్లించకపోతే తాము ఎలా నెట్టుకు రాగలుగుతామని ఆయా యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే సేవలు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు వారి ఆరోగ్యంపై భరోసా కల్పించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టగా, ఆయన హయాంలో పేదలు ఆరోగ్యంపై ధైర్యంగా ఉండేవారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేశాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం పరిస్థితి మరింత దయనీయంగా మారిది. పథకానికి పేరుమార్చి ఆరోగ్యశ్రీ నుంచి పలు రోగాలను తొలగించి పేదలకు షాకిచ్చింది. ఉన్న కొన్నిపాటి జబ్బులకు ఏదోలా వైద్యం చేయించుకుంటూ ఉండేవారు. ఇంతలో ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్లు ప్రభుత్వం బకాయిలపై స్పష్టమైన హామీని ఇచ్చేవరకు వైద్యసేవలను అందించేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఆరు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలు అందుబాటులో ఉండగా, వీటికి రూ.30 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయినా ఆస్పత్రులు మాత్రం జీఎస్టీ, ఆదాయపుపన్నును తమ నిధుల నుంచి కట్టాల్సి వస్తుండడంతో ఎదురు పెట్టుబడి పెట్టినట్లు అవుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ కింద 1,044 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు 10 వరకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇలా నెలలో 300 వరకు శస్త్ర చికిత్సలు, 500 వరకు ఇతర వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వైద్యసేవలను బంద్ చేయడంతో పేద రోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గుండె, నరాలు, క్యాన్సర్, గైనిక్, ఎపండిసైటిస్, ఎముకల సంబంధిత శస్త్ర చికిత్సలు అవసరమైన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరికీ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులే ఆధారం కానున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో నిపుణులు లేకపోవడం, కొన్ని శస్త్ర చికిత్సలు చేసేందుకు పరికరాలు లేకపోవడం వంటివి రోగులను వేధిస్తున్నాయి. ప్రైవేటుగానే వైద్యం చేయించుకోవాలంటే సొంత డబ్బులను ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరితోపాటు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు కూడా ఈ వైద్యసేవలు దూరమవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యరక్షను నీరుగార్చిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా తయారైంది. ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెడుతూ ఈ పథకం ద్వారా ఆరోగ్యరక్షను పొందాలనుకొనేవారు రూ.1200 చెల్లించి రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చని పేర్కొంది. దీనిని నమ్మి జిల్లాలో 2196 మంది ఆరోగ్యరక్ష పథకంలో ప్రీమియం చెల్లించి లబ్ధిదారులుగా చేరారు. ఇప్పుడు ప్రభుత్వం 123 శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆరోగ్యరక్ష లబ్ధిదారులు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఆవేదన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రానివారికి 2017లో ప్రభుత్వం ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రీమియం చెల్లించి కొంత ధీమాగా వున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తాజా జీవో ద్వారా షాక్ ఇచ్చింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం వైద్యం చేయించుకోవచ్చన్న ధీమాతోనే పలువురు లబ్ధిదారులు ప్రీమియం చెల్లించారు. ఇప్పుడు దీనిని కాదనడంపై సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 600కు పైగా వున్న నెట్వర్క్ ఆస్పత్రుల్లో 1044 వ్యాధులకు నగదు రహిత వైద్యం చేయించుకోవచ్చని తొలుత పేర్కొన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమైన 123 శస్త్ర చికిత్సలు, మరికొన్ని వైద్యసేవలను ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. ఆయా ఆస్పత్రుల్లో వీటికి అవసరమైన సౌకర్యాలు లేకపోయినా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలను జారీ చేయడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆరోగ్యంపై భరోసాను కోల్పోతున్నారు. తమను ఆదుకొనే వారి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
హెల్త్ కార్డుల అమలులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
10 నుంచి ప్యాకేజి రేట్ల నిర్ణయంపై సమావేశాలు మేనేజింగ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు వెల్లడి హైదరాబాద్: హెల్త్‌కార్డుల అమలుకు సంబంధి పలు విషయాలను చర్చించిన అంశాలను ప్రభుత్వానికి ప్రతిపాదనల రూపంలో అందించనున్నామని మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు ఐ.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో డా. ఎ. రవిశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలను ప్రతిపాదించామన్నారు. ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్లకు, గురుకులాలు, ప్రభుత్వరంగ, గ్రంధాలయ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి. హెల్త్‌కార్డులున్న అందరికీ మాస్టర్ హెల్త్చెకప్ అన్ని ప్రైవేట్ నెట్వర్కు ఆసుపత్రులలో అనుమతించడంతో పాటు భార్య,భర్త, పెన్షనర్లకు వర్తింపచేయాలి. 40 సంవత్సరాలు దాటిన వారికి సంవత్సరానికి ఒక సారి మాస్టర్ హెల్త్చెకప్,క్రానిక్ వ్యాధులకు ప్రైవేట్ నెట్వర్కు 382 ఆసుపత్రులన్నింటిలో వైద్యం అందించాలి. 1885 ప్రోసీజర్స్ కాకుండా అన్ని వ్యాధులకు హెల్త్‌కార్డులపై వైద్యం చేయాలి. హెల్త్ కార్డులు అమలుచేయని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంతాన సాఫల్యానికి హెల్త్‌కార్డు ద్వారా అందించాలని, ఇక మీదట మెడికల్ బిల్లులు డీడీఓల ద్వారా రప్పించుకొని ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ప్యాకేజి రేట్లు నిర్ణయించేందుకు ఈ నెల 10,11,12 తేదీలలో నెట్వర్కు ఆసుపత్రుల యాజమాన్యం, ఎన్టీఆర్ వైద్యసేవ డాక్టర్లు సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మేనేజింగ్ కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించిన్నట్లు చెప్పారు.