Nukapally
-
అక్రమార్కులపై క్రిమినల్ కేసులు
అనుమతిలేని ఇళ్లను తొలగిస్తాం సబ్‌కలెక్టర్ శశాంక మల్యాల : నూకపల్లి అర్బన్‌హౌసింగ్ కాలనీలోని మూడు నెలలుగా ఇళ్ల స్థలాలు విక్రయిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని అధికారులపై జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా ఇళ్ల స్థలాలు విక్రయించిన కాంట్రాక్టర్లు, దళారులు జాబితా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫార్సు చేస్తామని, పట్టాలు లేకుండా నిర్మించుకున్న ఇళ్లను సైతం తొలగిస్తామని హెచ్చరించారు. మండలంలోని నూకపల్లి అర్బన్‌హౌసింగ్‌కాలనీని సబ్‌కలెక్టర్ శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2008లో 5వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, ఆన్లైన్ జాబితా ప్రకారం 1,676 మంది మాత్రమే అర్హులున్నారని తెలిపారు. 2008లో పట్టాలు పొంది ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలు సైతం రద్దయినట్లు చెప్పారు. ఆన్లైన్లో నమోదైన 1676 గహాలు ఏయే దశలో ఉన్నాయో సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా జగిత్యాల మున్సిపాలిటీ, హౌసింగ్, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు అర్బన్ హౌసింగ్‌కాలనీలో లబ్ధిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, జగిత్యాల తహసీల్దార్ మధుసూదన్, హౌసింగ్ డీఈఈ రాజేశం, ఏఈ రాజమౌళి, ఆర్ఐ రాజిరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. -
మిఠాయి వికటించి 35 మంది విద్యార్థులకు అస్వస్థత
జగిత్యాల/మల్యాల: కరీంనగర్ జిల్లా మల్యాల మండలం నూకపల్లి ఆదర్శ పాఠశాలల్లో మిఠాయి వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులకు కొంతకాలంగా పక్కనే ఉన్న జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్నభోజనం వండిపెడుతున్నారు. శుక్రవారం నుంచే ఆదర్శ పాఠశాలలోనే కొత్తగా నిర్వాహకులను ఏర్పాటు చేసి అక్కడే వంట చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వోలపు గంగాధర్ మిఠాయిలు తీసుకొచ్చి విద్యార్థులకు పంచిపెట్టారు. తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరికొందరికి కళ్లుతిప్పడం, తలనొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ సరితారెడ్డి అందుబాటులో ఉన్న వాహనాలు, 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. 24 మంది విద్యార్థుల వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపించారు. ఆస్పత్రిలో ఉన్న విద్యార్థులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని సూపరింటెండెంట్ తెలిపారు. విద్యార్థుల అస్వస్థత విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, డీఈవో కె.లింగయ్య ఆసుపత్రికి వచ్చి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తహశీల్దార్ శంకర్, ఎంఈవో వెంకట్రావు నూకపల్లికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మిఠాయిలు స్వాధీనం చేసుకున్నారు.