‘ప్రైవేట్’ లెక్క ఎంత?
► శిక్షణలేని టీచర్ల సంఖ్య తేల్చేపనిలో విద్యాశాఖ
► ప్రైవేటు సూళ్లలో బోధనకు టెట్ తప్పనిసరి
► జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 20,40,436 మంది విద్యార్థులుండగా 1,27,843 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మరోవైపు 11,304 ప్రైవేటుపాఠశాలల్లో 27,23,601 మంది విద్యార్థులుండగా కేవలం 92,675 మంది ఉపాధ్యాయులే పని చేస్తున్నట్లు ప్రైవేటు స్కూళ్లు 2015–16లో లెక్కలు చెప్పాయి. దీనిని బట్టి ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని అనుసరించడంలేదన్నది స్పష్టం అవుతోంది. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల సంఖ్యను దాస్తున్నారన్నది అర్థం అవుతోంది.
ఇప్పుడు ఆ లెక్కను తేల్చే పనిలో విద్యాశాఖ పడింది. 2019 మార్చి 31 నాటికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ప్రతి టీచర్ ఉపాధ్యాయశిక్షణ తీసుకొని ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లోని 92,675 మంది టీచర్లలో 3,905 మంది అన్ట్రైన్డ్ టీచర్లు శిక్షణ పొందా లని తేల్చింది. అయితే, ప్రైవేటు పాఠశాలల్లో వాస్తవంగా మరో 30 వేల మందికిపైగా టీచర్లుంటారని విద్యాశాఖ భావిస్తోంది. అధికారికంగా వారి సంఖ్యను చూపిస్తే నిబంధనల ప్రకారం వారికి ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందనే లెక్కలు చెప్పడం లేదేమోనని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ తాజా లెక్కలు తేల్చేందుకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో అర్హత సాధించినవారే ప్రైవేటు పాఠశాలల్లో బోధించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకే వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్న విద్యాశాఖ లెక్కల సేకరణలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య, ఉపాధ్యాయ శిక్షణ పొందినవారు, పొందనివారు.. టెట్‌లో అర్హతలకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు సిద్ధం అవుతోంది. ఈసారి టెట్‌ను పక్కాగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అర్హతలు కలిగినవారి తాజా వివరాలను సేకరించాలని నిర్ణయించింది.
జాతీయ ఓపెన్‌స్కూల్ ద్వారా అర్హతలు పొందే వీలు
ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న అన్ట్రైన్డ్ టీచర్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఓస్) ద్వారా ఉపాధ్యాయ శిక్షణకు తత్సమాన అర్హత పొందేలా కేంద్రం వీలు కల్పించాలని నిర్ణయించింది. ఎన్ఐఓఎస్ ప్రవేశం పొంది, రెండేళ్లలో నిర్వహించే రెండు పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే వారికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు (డీఎడ్) తత్సమాన సర్టిఫికెట్‌ను అందజేయనుంది. దూరదర్శన్‌కు చెందిన రెండు చానెళ్ల ద్వారా ఈ శిక్షణను అందజేయనుంది. ఇందుకు అభ్యర్థులు రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.